iDreamPost
iDreamPost
మాజీ హోంమంత్రి, పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పపై పిల్లి సత్తిబాబు వర్గం మళ్లీ కారాలు, మిరియాలు నూరుతోంది. రాజప్ప తన నియోజకవర్గానికి పరిమితం కాకుండా తరచు కాకినాడ రూరల్ రాజకీయాల్లో వేలు పెడుతున్నారంటూ వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్యనారాయణ (సత్తిబాబు) తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నేత. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన ఆయన ప్రస్తుతం టీడీపీ రూరల్ నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్నారు.
పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన కుమారులు సాగించిన రాజకీయాలు, రచ్చలు పార్టీకి, ఆయన కుటుంబానికి చెడ్డపేరు తెచ్చాయి. దీనికితోడు సత్తిబాబుకు నోటి దురుసు ఎక్కువ. ఈ కారణంగానే కొందరు నాయకులు, కార్యకర్తలు ఆయనకు దూరంగా ఉంటారనేది ఆ పార్టీ వారే చెప్పేమాట. అలా దూరం జరిగిన నాయకులను చేరదీసి తమపై అధిష్టానానికి రాజప్ప ఫిర్యాదులు చేయిస్తున్నారని సత్తిబాబు వర్గం ఆరోపణ. గత ఏడాది, తాజాగా వారం క్రితం తమపై ఫిర్యాదులు చేయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్‌లో పెత్తనం తాను తీసుకొని వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికే ఈ విధంగా పొగ బెడుతున్నారని ఈ వర్గం అనుమానం.
మర్యాద రామన్నకు ఇది తగునా?
తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రాజప్ప 25 ఏళ్లు పాటు పనిచేశారు. అవిభక్త రాష్ట్రంలోనే ఇది ఓ రికార్డు. పార్టీకి వీర విధేయుడిగా, సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, అందరినీ కలుపుకొని పోతూ మర్యాద రామన్నలా వ్యవహరిస్తారనే కారణంగానే ఇంత పెద్ద జిల్లాకు అన్నేళ్లూ అధ్యక్షుడిగా ఆయనను అధిష్టానం కొనసాగించిందంటారు. అంత ఇమేజ్ ఉన్న ఈయన ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం రాజకీయాల్లో వేలు పెడుతున్నారని ప్రత్యర్థి వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. జిల్లా టీడీపీ రాజకీయాల్లో కొన్నాళ్లు కింగ్‌మేకర్‌లా చక్రం తిప్పిన బొడ్డు భాస్కర రామారావు వర్గంలో సత్తిబాబు ఉండేవారు. పార్టీలో ఆయనకు ఏ కష్టం వచ్చినా భాస్కర రామారావు చక్రం అడ్డం వేసేవారు. ఆయన ఇటీవల కరోనాతో మృతిచెందారు. ఈ నేపథ్యంలో రాజప్ప మళ్లీ పావులు కదుపుతున్నారనేది రచ్చకు కారణం.
పక్క సీటుపై రాజప్పకు మక్కువ నిజమేనా?
కోనసీమలోకి ఉప్పలగుప్తం మండలం గాడవిల్లికి చెందిన ఆయన 2014లో పెద్దాపురం నుంచి పోటీ చేసి 10,663 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచారు. హోంమంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో 4,027 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయన మెజార్టీ 6000కు పైబడి తగ్గిపోయింది. హోం మంత్రి హోదాలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తన మెజార్జీ 2019 ఎన్నికల్లో భారీగా పెరుగుతుందని ఆశించారు. అయితే పెరగలేదు సరికదా తగ్గడంతో ఆయన అవాక్కయ్యారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న పెద్దాపురంలో బీసీలు, ఎస్సీలు తరువాత స్థానంలో ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం తనకు సరికాదని, రకరకాల సమీకరణల అనంతరం తన సామాజిక వర్గమైన కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న కాకినాడ రూరల్‌లో బరిలో దిగాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వినికిడి.
కాకినాడ రూరల్‌లో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కాపు, శెట్టిబలిజ ఓటర్లు ప్రధాన భూమిక పోషిస్తారు. పార్టీలు ఏవైనా ఎన్నికల్లో ఈ సామాజిక వర్గాల నేతల మధ్యే పోటీ ఉంటుంది. సత్తిబాబును ఇన్‌చార్జి నుంచి తప్పించి తాను పగ్గాలు సాధ్యమైనంత త్వరగా చేపడితే వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావడానికి సమయం ఉంటుందని రాజప్ప ఉద్దేశం. అయితే శెట్టిబలిజ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న సత్తిబాబును తప్పించి రాజప్పకు అక్కడ చంద్రబాబు అవకాశం ఇస్తారా? అన్నదే ప్రశ్న.
Also Read : దాడిశెట్టి రాజా ఆశలు పండేనా, అధినేత అవకాశమిచ్చేనా