iDreamPost
android-app
ios-app

బీజేపీకి బాబు బంపరాఫర్ ఇస్తున్నారా ?

  • Published Oct 01, 2020 | 12:29 PM Updated Updated Oct 01, 2020 | 12:29 PM
బీజేపీకి బాబు బంపరాఫర్ ఇస్తున్నారా ?

టీడీపీ అధినేత చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అవన్నీ ఫలించడం లేదు. బీజేపీ నేతలు ఆయన్ని విశ్వసించడం లేదు. అయినప్పటికీ చంద్రబాబు భాజపాను ప్రసన్నం చేసుకోవాలనే యత్నం మాత్రం ఆపలేదు. అందుకు అనుగుణంగా మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రచారం మొదలయ్యింది. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు గానూ ఇటీవల తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మరణంతో ఒక సీటు ఖాళీ అయ్యింది. అక్కడ పోటీచేసి పరువు నిలుపుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకి తలకుమించిన భారం అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీకి అననుకూల పరిస్థితుల రీత్యా ఎవరూ ముందుకొచ్చే అవకాశం లేదు.

దానిని అవకాశంగా మలచుకుని తిరుపతి స్థానం బీజేపీకి వదిలేయడానికి బాబు సిద్ధపడుతున్నట్టు ప్రచారం మొదలయ్యింది. టీడీపీ త్యాగం చేస్తున్నట్టు, బీజేపీకి అక్కడ మద్ధతిచ్చేందుకు సిద్ధమన్నట్టుగా ఇప్పటికే బాబు సంకేతాలు ఇస్తున్నారు. తద్వారా బీజేపీ నేతల దృష్టిలో సానుకూలత సాధించాలనే లక్ష్యం చంద్రబాబుకి ఉన్నట్టు చెబుతున్నారు. త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ నేతలు రాయబారాలు మొదలెట్టారు. జేపీ నడ్డా ముందు తమ ప్రతిపాదనను టీడీపీ నేతలు ఉంచారు. అయితే బాబు ప్రయత్నాల గురించి బాగా తెలిసిన బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తిదాయకం.

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్ధతు ప్రకటించడం ద్వారా ఒకవైపు తన పరువు నిలుపుకునే యత్నం, రెండో వైపు బీజేపీ అధిష్టానానికి చేరువయ్యే మార్గం దక్కుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. కానీ భవిష్యత్తులో టీడీపీ పుట్టి ముంచే నిర్ణయం కాగలదని పరిశీలకుల అంచనా. ఇప్పటికే టీడీపీని ఖాళీ చేసి అర్జెంట్ గా రెండో స్థానానికి చేరాలని బీజేపీ ఆశిస్తోంది. దానికి అనుగుణంగా బీజేపీ కార్యాచరణ సాగుతోంది. అలాంటి సమయంలో ఉప ఎన్నికల్లో టీడీపీ పక్కకు తప్పుకోవడం ద్వారా నేరుగా బీజేపీకి ఆ స్థానం దక్కినట్టే అవుతుందని అంచనా వేస్తున్నారు. జగన్ కి పోటీగా బాబు స్థానంలో బీజేపీని జనం గుర్తించే స్థానానికి చేరినట్టే అవుతుందని లెక్కలేస్తున్నారు.

అయినప్పటికీ ఇప్పుడు పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే బీజేపీ నేతల ఆశీస్సులు అత్యవసరంగా భావిస్తున్న చంద్రబాబు ఆత్మహత్యాసదృశ్యమైన నిర్ణయాలతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం అవుతుందనడంలో సందేహం లేదు.