iDreamPost
iDreamPost
సమస్యలు రావడం, ప్రతిపక్షాలు వాటి మీద పోరాటం చేయడం చాలాకాలంగా ఉన్న ఆనవాయితీ. ఆ పోరాటం కూడా వివిధ దశల్లో, వివిధ రూపాల్లో సాగుతుందనే విషయం కూడా అందరికీ తెలుసు. అధికారంలో ఉన్న సమయంలో పోరాటాలు వద్దని సుద్దులు చెపే చంద్రబాబు కూడా చివరకు విపక్షంలో ఉండగా అందరూ పోరాడాని చెబుతుండడం చూస్తుంటాము. కానీ హఠాత్తుగా అలాంటి చంద్రబాబు కూడా ఇప్పుడు పోరాటం కాకుండా మావోయిస్టులతో చేతులు కలపడం అనే కొత్త పద్ధతిని తెరమీదకు తెచ్చారు. స్వయంగా ఓ బాధిత యువకుడు రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చంద్రబాబు కూడా అలాంటి ఓ సామాన్యుడి స్థాయిలో ఆలోచన చేయడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బాబు అవగాహనా స్థాయి మీద ఆలోచన రేకెత్తిస్తోంది
దేశంలో మావోయిస్టు సంస్థ మీద చాలాకాలంగా నిషేధం అమలులో ఉంది. అలాంటి ఓ నిషేధిత సంస్థలో చేరడానికి ఎవరైనా అనుమతి ఇస్తారా.. పోని అనుమతి తీసుకుని నిషేధిత సంస్థలో ఎవరైనా చేరతారా ..కానీ చంద్రబాబు మాత్రం ఓ శిరోముండనం బాధితుడు ఏకంగా రాష్ట్రపతికి రాసిన లేఖలో అలాంటివి కోరిన విషయాన్ని ప్రస్తావించడం విస్మయకరమే కాకుంగా ఓ వింతగా మారింది. నిజంగా బాధితుడికి న్యాయం జరగకపోతే చంద్రబాబు పోరాడితే ప్రతిపక్షపార్టీగా తన బాధ్యత నిర్వహించిన వారవుతారు. టీడీపీ నేతలు అండగా ఉండి, ఉద్యమిస్తే జనం హర్షిస్తారు. ఆపార్టీ లీగల్ సెల్ తరుపున న్యాయపోరాటం సాగిస్తే చట్టం అంగీకరిస్తుంది. అన్యాయం జరిగిన వారికి ఊరట వస్తుంది. కానీ అన్నింటినీ వదిలి కేవలం మావోయిస్టులలో చేరతానంటూ ఓ యువకుడు లేఖ రాయడం, దానిని చంద్రబాబు పోస్ట్ చేయడం ఏమిటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.
సోషల్ మీడియా లేని సమయంలో కొందరు రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు గానూ ఆత్మహత్య చేసుకునే అవకాశం ఇవ్వాలంటూ లేఖలు రాసిన అనుభవాలున్నాయి. అలాంటి వారిని వారించి, నైతికంగా వారిని నిలబట్టేందుకు కూడా పలు ప్రయత్నాలు జరిగేవి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో వివిధ అభిప్రాయాలు స్వేఛ్ఛగా వెల్లడించే ఛాన్స్ ఉన్న సమయంలోనూ చంద్రబాబు ఇలాంటి పద్ధతి అనుసరించడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి పద్ధతుల ద్వారా చంద్రబాబు తన పరిధి దాటుతూ, విలువను తగ్గించుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.
భావోద్వేగాలతో కొందరు ఏదో తెలిసీ తెలియని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి ప్రచారం కల్పించాల్సిన అవసరం, చంద్రబాబుకి ఏమొచ్చిందన్నదే అంతుబట్టని విషయం. నిషేధిత సంస్థలో చేరడానికి ఎవరైనా సిద్ధపడితే వారించాల్సిన స్థానంలో, అలాంటి ఆవేశాన్ని చల్లార్చి అవగాహన పెంచాల్సిన స్థాయిలో ఉండి చంద్రబాబు సైతం దానికి ఊతమిచ్చేలా వ్యవహరించడం ఏమిటన్నది అర్థంకాని అంశంగా మారింది. సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు ఎందుకిలా చేస్తున్నారనేది చివరకు ఆయన సొంత మనుషులకు కూడా ఆందోళనకరంగా మారుతుందంటే ఆశ్చర్యం లేదు.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరిగిన ఘటనలో సీతానగరం ఎస్సై సహా పోలీస్ సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారు. సస్ఫెండ్ చేశారు. అరెస్ట్ చేశారు. జైలుకి తరలించారు. శిరోముండనం వంటి తీవ్ర చర్యలకు పాల్పడిన వారికి తగిన శాస్తి జరగాల్సి ఉంది. అలాంటి సమయంలో ఇంకా ఎవరైనా నిందితులున్నారంటే టీడీపీ బలంగా పోరాడి అందరికీ శిక్ష పడేలా చేయాలి. బాధితుడు వరప్రసాద్ కి తగిన రక్షణ కొరకు ఏర్పాట్లన్నీ పోలీసు వారి తరఫున కల్పించినట్టు డీఐజీ చెబుతున్నారు. సదరు గ్రామములో పికేటు కూడా కొనసాగుతోంది. అయిన్పటికీ ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటం సాగించాల్సిన సమయంలో దానికి భిన్నంగా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి సంఘటనలను అడ్డం పెట్టుకొని అమాయకుల చేత నక్సలైట్ లో చేరతాం అని తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సేఫ్టీ కి భంగం కలిగించే విధంగా ఉందని డీఐజీ వ్యాఖ్యానించడం విశేషంగా చూడాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యానాలు వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తామని అలాగే బెదిరింపులకు పాల్పాపడుతున్నము అనే సంగతిని గ్రహించాలని, భారత రాజ్యాంగ పరిధిలో ప్రజలకు కల్పించిన స్వేచ్ఛ, స్వతంత్రం, వాక్ స్వాతంత్రం, సమాన హక్కుల ను దుర్వినియోగం చేసుకోకుండా చట్టానికి లోబడి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని డి. ఐ.జి సూచించారు. ఈ విషయం చంద్రబాబు గుర్తిస్తారో లేదో మరి.