ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డిపై నిన్న చంద్రబాబు ఘాటైన విమర్శలు చేయగా.. చంద్రబాబుకు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరు పుడంగో ఎన్నికల తర్వాత తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డులకు 25 వార్డులు వైసీపీ కైవసం చేసుకుంటుందని ఎంపీ రెడ్డప్ప ధీమా వ్యక్తం చేశారు. అంతే కాక ఈ ఎన్నికల్లో ఒక వేళ మేము ఓడిపోతే కుప్పం లో అడుగు పెట్టం, అదే టీడీపీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని చంద్ర బాబుకు సవాల్ విసిరారు. బాబు సీఎంగా ఉన్న హయాంలో కూడా చిత్తూరు జిల్లాలో పైచేయి సాధించిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఉందని గుర్తు చేసిన ఆయన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఏవిధంగా క్లీన్ స్వీప్ చేసిందో అదే విధంగా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేస్తూనే చంద్రబాబు కుప్పం పర్యటన గురించి కూడా రెడ్డప్ప మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల గురించి గత నెల రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడు కుప్పం లో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అంటే కుప్పం, కుప్పం అంటే చంద్రబాబు నాయుడని చెబుతూ టిడిపి నేతలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం కల్పించుకున్నారు. ఈ విషయం మీద రెడ్డెప్ప మాట్లాడుతూ చంద్రబాబు కుప్పం పర్యటన రెండు రోజులు కూడా బస్సులో నిద్రించారని, నిజంగా చంద్రబాబుకు కుప్పంలో అంత బలం, బలగం ఉంటే ఆయన ఒక్కరు కూడా ఇంటికి ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు. ఆయన అన్న మాటలు నిజమే అయినా చంద్రబాబు లాంటి నేత గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న లాంటి ప్రాంతంలో ఒక ఇంటిని నిర్మించుకో లేకపోవడం ఆశ్చర్యకరం. ఆయనకు చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో స్వగృహం ఉంది కానీ కుప్పం నియోజకవర్గంలో ఇల్లే లేదు.
పోనీ టీడీపీ కార్యాలయం ఉందా అంటే అదీ లేదు, ఒకవేళ ఉంటే అందులో అయినా ఉండేవారు. రాష్ట్ర స్థాయి నేత, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు కుప్పంలో సొంత ఇల్లు కట్టించుకో లేకపోవడం గమనార్హం. అంతేకాక అమరావతి నా ప్రాణం అమరావతి కోసమే ఈ జీవితం అంటూ మాటలు చెప్పే ఆయన అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకో లేకపోవడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. ఎప్పటికప్పుడు పని ముగించుకుని హైదరాబాద్ వెళ్ళిపోదామా? అని ఎదురు చూసే చంద్రబాబు ఆంధ్ర ప్రజల కష్టాలను ఏ మేరకు తీరుస్తారు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ చంద్రబాబు తన బేస్ మార్చుకోలేదు. కరకట్టలో లింగమనేని రమేష్ కు చెందిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ని తన నివాస గృహంగా మార్చుకున్న చంద్రబాబు సొంత ఇల్లు కట్టించుకోవడం విషయంలో మాత్రం ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. ఈ విషయంలో మాత్రం ఆయన టార్గెట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
Also Read : YCP MP Reddappa Challenge – ఎంపీ రెడ్డప్ప సవాల్.. అద్భుతమైన అవకాశం.. బాబు అందిపుచ్చుకుంటారా..?