Idream media
Idream media
నైజీరియా ప్రభుత్వం మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫార్మ్ ట్విట్టర్‌ను కొద్ది రోజుల క్రితం సస్పెండ్ చేసింది. ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ చేసిన ట్వీట్‌ను సామాజిక మాధ్యమం డిలీట్ చేసిన కారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. విశేషమేంటంటే.. ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారానే ప్రకటించారు. ఇదిలా ఉండగా, దేశంలో కూడా కేంద్రం, ట్విటర్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు కేంద్రం, ఇటు ట్విటర్ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో కేంద్రం ట్విటర్ పై చర్యలకు కూడా పూనుకుంది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం స్టాట్యుటరీ అధికారులను నియమించడంలో ఇది విఫలమైనందుకు దీనికి లీగల్ ప్రొటెక్షన్ (నాయపరమైన రక్షణ) ను రద్దు చేసింది. అయినప్పటికీ ట్విటర్ తీరు మారడం లేదంటూ పార్లమెంటరీ కమిటీ రంగంలోకి దిగింది.
నూతన సోషల్ మీడియా నిబంధనలను ట్విటర్ పాటించడం లేదని ఐటీ, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ట్విటర్ కు లేఖ రాసింది. అయినా సరిగా స్పందించలేదు. దీంతో చర్యలు తీసుకున్న కేంద్రం ట్విటర్‌ను ఇకపై సామాజిక మాధ్యమంగా కాకుండా ఓ పబ్లిషర్‌లా కేంద్ర ప్రభుత్వం చూడనుంది. అంటే యూజర్లు చేసే ప్రతి ట్వీట్‌కు ట్విటర్ బాధ్యత వహించాలి. ఎవరైనా తప్పుదోవ పట్టించే, అభ్యంతరకర పోస్టులు పెడితే సదరు యూజర్‌తో పాటు ట్విటర్‌పైనా కేసులు నమోదు చేయవచ్చు. మరోవైపు కేంద్రంలోని చాలా మంది మంత్రులు ట్విటర్ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు తాజాగా పార్లమెంటరీ కమిటీ ట్విటర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇండియాలో ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలకు అనుగుణంగా నడచుకోలేదని ఆరోపణలకు గురైన ట్విటర్ పై ఐటీ, టెక్నాలజీలపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మండిపడింది. ఈ సామాజిక మాధ్యమానికి చెందిన ఇద్దరు ప్రతినిధులను కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వాన గల ఈ కమిటీ సుమారు గంటన్నర సేపు విచారించింది. ప్రభుత్వ రూల్స్ ని ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించింది. ట్విటర్ నిర్వాకాన్ని కేంద్రం ఇటీవలే తీవ్రంగా పరిగణించి..దీనికి షో కాజ్ నోటీసులను కూడా జారీ చేసింది.
కానీ దీనికి ఈ సంస్థ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఏకంగా పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులతో సమావేశం అయింది. చట్టానికి మీరేమీ అతీతులు కారని, ప్రభుత్వ నిబంధనలకన్నా మీ రూల్స్ ఎక్కువేమీ కాదని ఈ కమిటీ దాదాపు దుయ్యబట్టింది. ఈ సమావేశంలో ట్విటర్ ఇండియా తరఫు లీగల్ న్యాయవాది ఆయుషి కపూర్, సీనియర్ మేనేజర్ షగుఫ్తా కమ్రాన్ పాల్గొన్నారు. తమ రూల్స్ కూడా ఇంతే తమకు సమానమని ఈ ప్రతినిధులు కేంద్రానికి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కమిటీ సూచనలను వీరు పాజిటివ్ గా తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివాదం ట్విటర్ పై సస్పెన్షన్ వరకూ దారి తీయనుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : రఘురామరాజు రెండో కోణం ఆలోచించలేదా..?