Idream media
Idream media
ఏపీని సస్య శ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. కావాల్సిన సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. తాజాగా ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు కూడా. జాతీయ స్థాయి ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తికి రాష్ట్రం ఒక్కటే చిత్తశుద్దితో పని చేస్తే చాలదు. కేంద్ర్రం సహకారం అందించాల్సిన అవసరం చాలా ఉంది. దురదృష్టవశాత్తు కేంద్రంలో కదలిక కనిపించడం లేదు. ముఖ్యమంత్రి లేఖలు రాసినా, ఎంపీలు స్వయానా విన్నవిస్తున్నా కంటితుడుపు చర్యలే తప్పా, సీరియస్ గా పరిగణించడం లేదు. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో చేసిన ప్రకటన ఏపీకి షాక్ ఇచ్చేలా ఉంది.
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పోలవరం పనుల్లో వేగం పుంజుకుంది. కేంద్రం నిర్ణీత సమయానికి నిధులు ఇవ్వకపోయినా, సొంత నిధులు వెచ్చిస్తూ పనులు ఆగకుండా చూస్తోంది. అయితే, కరోనా కారణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికీ ప్రాజెక్టును నిరంతరాయంగా కొనసాగిస్తోంది. రాష్ట్రం పనితీరు ఇలా ఉంటే, కేంద్రం మాత్రం చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఏదైనా ప్రాజెక్టంటే నిర్మాణాలు మాత్రమే కాదు భూసేకరణ పునరావాసం కూడా ప్రాజెక్టు పరిధిలోకే వస్తాయి. ముఖ్యమంత్రిగా, రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియాంది కాదు. కానీ పోలవరం విషయంలో పెద్దగా సహకారం అందించడం లేదు. దీనిపై వైసీపీ ఎంపీలు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.
ప్రాజెక్టు అంచనాల్లో సుమారు 30 వేల కోట్ల రూపాయలు భూసేకరణ పునరావాసానికే ఖర్చవుతుంది. ఇంతటి కీలకమై ఖర్చుల విషయాన్ని తనకు సంబంధం లేదని కేంద్రం తాజాగా తేల్చేసింది. తామిచ్చే నిధులు కేవలం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కు మాత్రమే అని చెప్పింది. 2013-14లో సవరించిన అంచనాలు రు. 20398 కోట్లకు మించి ఇచ్చేది లేదని రాష్ట్రానికి స్పష్టంగా చెప్పేసింది. నిజానికి ఈ నిధులతో ప్రాజెక్టు నిర్మాణం జరిగే పనికాదు. భూసేకరణ పునరావాసం జరగకుండా ఏ ప్రాజెక్టు నిర్మాణం కూడా సాధ్యంకాదు. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం చంద్రబాబనే చెప్పాలి. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అన్న విషయం అందరికీ తెలిసిందే.
2014లో అధికారోంలోకి రాగానే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను చంద్రబాబు కేంద్రం నుండి బలవంతంగా తీసుకున్నారు. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకోకుండా ఉండుంటే మొత్తం బాధ్యత కేంద్రానిదే అయ్యుండేది. అప్పుడు ప్రాజెక్టు నిర్మాణం చేసినా చేయకపోయినా కేంద్రమే జనాలకు సమాధానం చెప్పాల్సుండేది. కానీ చంద్రబాబు చేసినపని వల్ల ఇపుడు ఆ భారం మొత్తం రాష్ట్రానిపై పడింది. కేంద్రం నిధులివ్వదు రాష్ట్రానికి అంత స్తోమతలేదు. సవరించిన అంచనాల ప్రకారం రు. 20398 కోట్లలో ఇప్పటికే రు. 11182 కోట్లు ఇచ్చేసినట్లు కేంద్రం పార్లమెంటులోనే ప్రకటించింది. అంటే కేంద్రం ఇక ఇవ్వాల్సింది సుమారు రు. 9000 కోట్లు మాత్రమే. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తికి ఏ మాత్రమూ సరిపోదు. కేంద సర్కార్ తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రకటిస్తుందో చూడాలి.