iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాల్లో ఫిరాయింపుల విషయంలో వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నారు. నేరుగా ఎవరినీ పార్టీలో చేర్చుకోకూడదని ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకూ అమలవుతోంది. ఇతర పార్టీల నుంచి కొందరు ఎమ్మెల్యేలు జగన్ కి మద్ధతు పలుకుతున్నప్పటికీ వారికి కండువాలు కప్పడం, క్యాబినెట్ లో తీసుకోవడం వంటి చర్యలకు పూనుకోవడంలో జగన్ తన పంథాలో సాగుతున్నారు. కానీ త్వరలో తీరు మార్చుకుంటారని కొందరి వాదన. ఇప్పటికే దానికి అనుగుణంగా ప్రచారం సాగుతోంది. ఆగష్ట్ 9న వైఎస్సార్సీపీలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు ముహూర్తం పెట్టుకున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ మాజీ మంత్రి చేరికకు జగన్ దాదాపుగా సానుకూల సంకేతాలు ఇవ్వగా, బొత్సా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు.
బొత్సా సత్యన్నారాయణ, గంటా శ్రీనివాసరావు మధ్య రాజకీయ అనుబంధం ఉంది. గతంలో ఇద్దరూ సహచర మంత్రులుగా పనిచేశారు. ఉత్తరాంధ్రకి చెందిన కాపు, తూర్పు కాపు నేతలిద్దరి మధ్య ఉన్న స్నేహమే ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకి ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నారు. విశాఖలో పార్టీ బలోపేతానికి గంటా రాక ఉపయోగపడుతుందని బొత్సా బలంగా వాదిస్తున్నారు. దానికి అనుగుణంగా ఆయన్ని పార్టీలో చేర్చుకోవడానికి ఆయన మంతనాలు జరుపుతున్నారని సమాచారం. అయితే గంటా రాకను అవంతి శ్రీనివాస్ బలంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో గంటా లాంటి నేతలు పార్టీలోకి వస్తే తన ప్రాబల్యానికి గండి పడుతుందని ఆయన భావిస్తున్నట్టు పలువురి అంచనా. గతంలో పీఆర్పీ నుంచి సన్నిహితులుగా ఉన్న గంటా, అవంతి మధ్య రెండేళ్లుగా విబేధాలు ఏర్పడ్డాయి. బాహాటంగానే ఇద్దరు నేతలు విమర్శలు గుప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. భీమిలి సీటు కోసం మొదలయిన వారి తగాదా ఆ తర్వాత తారస్థాయికి కూడా చేరింది. అయినప్పటికీ ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకం అయినప్పటికీ అంతిమంగా జగన్ నిర్ణయమే అందరికీ శిరోధార్యం అనడంలో సందేహం లేదు. దాంతో జగన్ ఎలా స్పందిస్తారన్న దానిని బట్టి గంటా భవితవ్యం ఉంటుందని చెప్పవచ్చు.
తాజాగా విజయనగరంలో మీడియాతో మాట్లాడిన సమయంలో బొత్సా స్పందన గమనిస్తే గంటా రాకకు అంతా సిద్దమేననే సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో సాగుతున్న అభివృద్ధిని చూసి అనేక మంది ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. గంటా పార్టీలోకి వస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానంగా అనేక మంది వస్తున్నారని బొత్సా పేర్కొనడం ఆసక్తికరమే. విశాఖలో రాజధాని ఖారారు కావడంతో ఆగష్ట్ 15 నాటికి కీలక కార్యాలయాల తరలింపు ప్రారంభమవుతుందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో పాలనా కేంద్రంలో పట్టు సాధించేందుకు జగన్ పావులు కదిపే అవకాశం ఉందని చెబుతున్నారు. దానికి అనుగుణంగా విశాఖ నగరంలో పార్టీకి కొత్త బలం కోసం గంటాకి తలుపులు తెరిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే గంటా కూడా విశాఖ రాజధాని నిర్ణయాన్ని స్వాగతించారు. చివరకు తన చిరకాల మిత్రుడు నలందా కిషోర్ పై కేసు పెట్టినా, ఆయన కరోనాతో మరణించిన సందర్భంలోనయినా పల్లెత్తు మాట కూడా అనలేదు. చివరకు రఘురామ రాజు లాంటి వాళ్లు కూడా ప్రభుత్వాన్ని తప్పుబడితే గంటా మౌనం పాటించడం వెనుక రాజకీయ వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది. ఏమయినా పాలనలో విశాఖ కొత్త పుంతలు తొక్కే పరిస్థితి ఎదురుగా ఉన్న తరుణంలో రాజకీయంగా మరిన్ని మలుపులకు కేంద్ర స్థానం అవుతుందా అనే విషయంలో కొద్దిరోజుల్లోనే స్పష్టత వస్తుందని ఆశించవచ్చు.