iDreamPost
android-app
ios-app

బీజేపీతో ‘గాంధీ’ల బంధం ముగియనున్నదా ?

బీజేపీతో ‘గాంధీ’ల బంధం ముగియనున్నదా ?

తాజాగా బీజేపీ తన కేంద్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనలో తెలుగు రాష్ట్రాలకు మంచి పదవులు దక్కాయి కానీ ఉత్తరాదిన కీలక నేతలుగా భావిస్తున్న కొందరిని తప్పించడానికి బీజేపీ ఏ మాత్రం వెనకాడలేదు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సహా ఆమె కుమురుడు వరుణ్ గాంధీని భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ నుంచి తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

తాజాగా బీజేపీ ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో 80 మంది రెగ్యులర్ సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, మరో 179 మంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు కానీ గాంధీ వంశానికి చెందిన వరుణ్ గాంధీతో పాటు మేనకాగాంధీకి ఇందులో ఏ జాబితాలోనూ చోటు దక్కలేదు. అయితే వీరి తొలగింపుకు కారణం ఆమె కుమారుడు ఎంపీ వరుణ్ గాంధీ తీరే అంటున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేయడమే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి అనే ప్రాంతంలో ఆదివారం నాడు జరిగిన ఒక ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. నిజానికి అక్కడ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆదివారంనాడు హాజరయ్యారు.. వీరు వస్తున్న సంగతి తెలిసే ముందు నుంచి రైతులు నల్లజెండాలు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న మంత్రి కాన్వాయ్ ముందు నడుస్తూ అడ్డుపడటంతో రైతుల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు కూడా.

ఈ విషయం మీద వరుణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఘటన తన మనసుని కలచి వేసిందని వరుణ్ పేర్కొన్నారు, నిన్న కూడా ప్రమాద సమయంలో జరిగిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసి ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది, రైతులు రక్తం ధారపోశారు, ఆ రక్తానికి బాధ్యత ఎవరిది? రైతులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోను కాకముందే వారికి న్యాయం జరగాలి అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఇక ఒక్క ట్వీట్ కి పదవులు తప్పించారా అనే అనుమానాలు కలగవచ్చు కానీ సరిగ్గా నెల రోజుల క్రితం కూడా వరుణ్ గాంధీ ఇదే విధంగా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్పందించారు. నెల రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్ లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది మంది రైతులు మన సొంత రక్తం అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. రైతు సమస్యలను వారి దృక్కోణంలో చూసి అప్పుడు చర్చలు జరపాలని పేర్కొన్న ఆయన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా పంచాయతీకి పెద్ద సంఖ్యలో హాజరైన రైతుల ఈ వీడియోను షేర్ చేశారు.

అయితే చాలా కాలంగా వరుణ్ గాంధీ వ్యవహారశైలి నచ్చడం లేదని బీజేపీ నేతలే చెవులు కొరుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా ఆయన తల్లి సహా ఆయన మీద కూడా వేటు వేయడం అనేది చాలా పెద్ద నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని వరుణ్ అసంతృప్తిగా ఉన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మేనకాగాంధీని కూడా ఆ తర్వాత తప్పించారు. దీంతో వీరిద్దరూ బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించడమే కాక స్వపక్షంలో విపక్షంలాగా తయారు అవ్వడంతో వారిని కావాలనే పక్కన పెట్టారు అంటున్నారు. ఇక ఇదే పరిస్థితి కనుక కొనసాగితే గాంధీలకు బీజేపీతో బంధం ముగిసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో?