Idream media
Idream media
తెలంగాణలోని రాజకీయ పార్టీల ఫోకస్ మొత్తం నాగార్జునసాగర్ ఉప ఎన్నికపైనే ఉంది. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిపికేషన్ రాకుండానే అభ్యర్థిని ఖరారు చేసుకుని బరిలోకి దింపాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నా ఈ విషయంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే క్లారిటీతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, కాంగ్రెస్ పెద్దలంతా తననే పోటీచేయాలని కోరుతున్నారంటూ జానారెడ్డి మీడియా సమావేశం పెట్టిమరీ వెల్లడించారు.
ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి సాగర్ లో ఎవరు పోటీ చేస్తారనేదానిపై ఇంకా క్లారిటీరాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా మరణించిన నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు సీటిస్తారా.? లేదా మరో అభ్యర్ధిని తెరపైకి తీసుకొస్తారా అనేది ఇంకా తెలియలేదు.. తాజాగా సీఎం కేసీఆర్ సాగర్ సభతో కూడా ఈ విషయంపై క్లారిటీ రాలేదు..
ఇక దుబ్బాక విజయంతో, జీహెచ్ఎంసీలో పుంజుకోవంతో ఊపుమీదున్న భారతీయ జనతాపార్టీ ఎవరిని బరిలోకి దింపుతుందనేది ఆసక్తిగా మారింది. గతంలో పోటీ చేసిన కంకణాల నివేదితా శ్రీధర్ రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు రెడీగా ఉనారు. ఈమెతో పాటు మరో ముగ్గురు అభ్యర్థులు కూడా బీజేపీ తరపున బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర న్యాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.. అయితే బీజేపీ మాత్రం సాగర్ అభ్యర్థి విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్ బరిలో కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్ధిగా జానారెడ్డి ఉండటంతోపాటు అధికార టీఆర్ఎస్‌కు ఇది సిట్టింగ్ సీటు కావడంతో ఈ ఇరు పార్టీలకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది.
ఈ క్రమంలో సాగర్ బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ నటి, ఇటీవల బీజేపీలో చేరిన విజయశాంతి పేరును పరిశీలిస్తునారు. విజయశాంతి అభ్యర్థిత్వంపై నల్గొండ జిల్లా పార్టీ నేతలు రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే పలు సూచనలు చేసినట్టు సమాచారం.. విజయశాంతి సినీ గ్లామర్‌తో పాటు కేసీఆర్ పై ఆమె విరుచుకుపడుతున్న తీరు, గతంలో కేసీఆర్ తో కలిసి పనిచేసి అక్కడ అన్యాయం జరిగినట్టుగా విజయశాంతి ప్రసంగాల్లో మాట్లాడే విధానం బీజేపీ పార్టీకి కలిసొస్తుందని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్ధి ఎవరైతే బావుంటుందనే అంశంపై ఇప్పటికే ఒక అంతర్గత సర్వే నిర్వహించినట్టు పార్టీ వర్గాలు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే అందరికీ తెలిసిన అభ్యర్థి బరిలో ఉంటేనే తమకు మంచి ఫలితాలొస్తాయని గులాబీ, హస్తం పార్టీలకు రాములమ్మ ద్వారానే గట్టి పోటీ ఇచ్చినవాళ్లమవుతామని భావిస్తున్న బీజేపీ విజయశాంతి సేవలను, ఆమె అభ్యర్ధిత్వాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది.
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి విమర్శలు చేసిన రాములమ్మ బీజేపీలో చేరినతర్వాత అధికారపార్టీపై అమాంతం మాటలదాడి పెంచేయడం అందరికీ తెలిసిందే. సాగర్ బరిలో బిజెపి తరఫున బరిలోకి దిగేందుకు విజయశాంతి ఓకే అంటుందా లేక స్టార్ క్యాంపెయినర్ గా మాత్రమే ఉండి ప్రచారం చేస్తానని తప్పుకుంటారా అనేది కూడా చూడాలి. ఒకవేళ రాములమ్మ బిజెపి తరఫున రంగంలోకి దిగితే మాత్రం సాగర్ ఎన్నిక కూడా దుబ్బాక మాదిరిగా రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీ పరంగా బీజేపీ పుంజుకుంటున్నా విజయశాంతి అభ్యర్ధిత్వంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విజయశాంతి సుదీర్ఘకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నా ఆమె రాష్ట్ర రాజకీయాలపై తన ముద్ర వేయలేకపోయారన్నది వాస్తవం.. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీని గానీ, పరిస్థితులను గానీ ప్రభావితం చేయలేకపోయారన్నది వాస్తవం.. 2009లో మెదక్ ఎంపీగా కూడా కేవలం కేసీఆర్ చరిష్మాతోను, తెలంగాణ సెంటిమెంట్ తోనూ విజయశాంతి గెలిచారనే వాదన ఉంది. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి 2014 ఎంపీ ఎన్నికలోనూ ఘోర పరాజయం పాలయ్యారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయింది. నిజంగా విజయశాంతికి చరిష్మా ఉంటే తర్వాతి ఎన్నికల్లోనూ విజయశాంతి ఓడిపోయేది కాదు కదా అంటున్నారు ఆమె వ్యతిరేక వర్గాలు.
టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, తర్వాత కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రజా నాయకురాలిగా ఎదగలేకపోయింది. కేవలం ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించడం, పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించడం తప్ప విజయశాంతి ప్రజలతో మమేకమైన సందర్భాలు ఆమె రాజకీయ జీవితంలో చాలా తక్కువనే చెప్పుకోవాలి,కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అడపాదడపా పార్టీ కార్యక్రమాలకు హాజరవడం తప్ప మిగిలిన సందర్భాల్లో రాములమ్మ అజ్ఞాతవాసంలో ఉండేవారు. 2009లో టిఆర్ఎస్ పార్టీ తరపున మెదక్ ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఆమె కనిపించడం లేదంటూ నియోజకవర్గ ప్రజలు పోలీసులకు ఫిర్యాదుచేసిన సంఘటనలు కూడా లేకపోలేదు.
మొత్తంగా విజయశాంతి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ఏమాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో గొప్పగా లేదనేది వాస్తవం.ఆమె తోటి నటులైన జయప్రద, రోజా కూడా విజయశాంతికంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు.. తెలుగు రాష్ట్రానికి చెందిన జయప్రద ఉత్తరప్రదేశ్ కు వెళ్లి అక్కడి రాంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచింది. అక్కడి ప్రజలతో మమేకమవుతూ లీడర్ గా ఎదిగింది. అలాగే ఆర్కే రోజా కూడా నగిరి ఎమ్మెల్యే గా ఒకసారి ఓడిపోయినా రెండుసార్లు గెలిచి ఇప్పుడు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే కేవలం సినిమా గ్లామర్ ను నమ్ముకోవడయే కాకుండా రాజకీయ వ్యూహం, క్లారిటీతో పనిచేసే సత్తా ఉండాలనేది విజయశాంతి శ్రేయోభిలాషుల సూచన.. ఇదంతా ఒక ఎత్తైతే బీజేపీ క్యాడర్, ఆపార్టీ న్యాయకత్వం పార్టీ అభ్యర్ధి తరపున ఏ విధంగా ప్రచారం చేస్తారనేది చూడాలి. ఆపార్టీ జాతీయ న్యాయకత్వం గొప్పలు, రాష్ట్రంలో హిందుత్వ ఎజెండాతో బీజేపీ ఏ స్థాయిలో ముందుకెళ్లినా ఆపార్టీ సిద్ధాంతలపై ఏ స్థాయిలో ప్రచారం చేసినా అక్కడ పనిచేయాల్సిన అక్కడ పనిచేసే పార్టీ అభ్యర్థికి కూడా కాస్తో కూస్తో ట్రాక్ రికార్డు లేకపోతే ఎలా అనేది బీజేపీ ముందున్న ప్రశ్న.