iDreamPost
iDreamPost
దేశంలో రాష్ట్రపతి, ఉప ఎన్నికల చర్చ మొదలయ్యింది. వచ్చే ఏడాది జూన్ నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఆశావహులు మోదీ- అమిత్ షా మీద గంపెడాశతో ఉన్నారు. తమకు అవకాశం వస్తుందనే అభిప్రాయంతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు భవితవ్యం ఆసక్తిగా మారింది. ఆయన గతంలో ఉప రాష్ట్రపతి పదవిని అయిష్టంగానే స్వీకరించారనే అభిప్రాయం ఉంది. అయితే దానికి మించి ఉన్నత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఉప రాష్ట్రపతి హోదా స్వీకరించినట్టుగా కథనాలు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం ఉప రాష్ట్రపతి తర్వాత అత్యున్నత స్థానం అంటే నేరుగా రాష్ట్రపతి పదవే కావాలి. దాని మీద వెంకయ్యకు కూడా గట్టి ఆశలున్నట్టు సన్నిహితుల అభిప్రాయం..
మోదీ- షా ఏమి ఆలోచిస్తున్నారన్నది ప్రస్తుతానికి అంతుబట్టడం లేదు.తాజాగా ఉప రాష్ట్రపతి పదవికి గులామ్ నబీ ఆజాద్ పేరు తెరమీదకు వచ్చింది. బీజేపీ అధిష్టానం ఆజాద్‌కి అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా ఉందనే కథనాలు వస్తున్నాయి. సుదీర్ఘకాలం పాటు కాశ్మీర్‌కి చెందిన గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాలంలో ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా తెలుగువారికి కూడా సుపరిచితుడు. వైఎస్ మరణానంతరం జగన్ విషయంలో ఆజాద్ పాత్ర మీద కూడా కొందరు కాంగ్రెస్ నేతలు నేటికీ అసంతృప్తిగానే ఉంటారు.కాశ్మీర్ ముఖ్యమంత్రిగా,కేంద్ర మంత్రిగా పలు కీలక బాధ్యతలను పోషించిన గులామ్ నబీ ఆజాద్ కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వం పట్ల భిన్నాభిప్రాయాలతో ఉన్నారు.అదే సమయంలో మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ పలు వ్యాఖ్యలు కూడా చేశారు.
Also Read : Chandrababu Kuppam Tour – సర్వశక్తులు ఒడ్డుతున్న చంద్రబాబు
కాశ్మీర్‌లో మోదీ, బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్న సమయంలో కూడా ఆజాద్ తన సొంత పార్టీ నేతల తీరుని తప్పుబడుతూ బీజేపీ విధానాలను కొనియాడడం దుమారం రేపింది. అప్పట్లో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగుస్తున్న దశలో కొనసాగింపునకు అవకాశం ఇవ్వకపోవడంతోనే అసంతృప్తితో అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భావించారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గులామ్ నబీ ఆజాద్‌ని దూరం పెట్టినట్టే కనిపిస్తోంది.అదే సమయంలో ఆజాద్‌కి మోదీతో స్నేహం కుదిరింది. దాంతో ఆయనకు రాజ్యసభ అవకాశం వస్తుందని కొన్నాళ్లక్రితం ఊహాగానాలు వచ్చినా అవి వాస్తవ రూపం దాల్చలేదు. ప్రస్తుతం ఏకంగా ఉప రాష్ట్రపతిగా కాశ్మీరీ ముస్లీం నేత, కాంగ్రెస్ నేపథ్యం ఉన్న నాయకుడిని ఎంపిక చేసే అవకాశం ఉందనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ముస్లింలకు ప్రత్యక్ష ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బీజేపీ పరిగణలోకి తీసుకోవడం లేదు. యూపీ ఎన్నికల్లోనూ, ఇతర అనేక సందర్భాల్లోనూ ఇది స్పష్టమయ్యింది. కానీ ఇప్పుడు నేరుగా ఉప రాష్ట్రపతి పదవికి ఎంపికయ్యే అవకాశం ఇస్తుందా అనేది ప్రశ్నార్థకం.
ఆజాద్‌ని ఉప రాష్ట్రపతికి ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంటే వెంకయ్య నాయుడు ఏమి కావాలనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ముస్లింని ఉపరాష్ట్రపతి చేసి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన దక్షిణాదికి చెందిన వెంకయ్యను రాష్ట్రపతి చేసే ఆలోచనలో కమలదళం ఉందా అనే చర్చ మొదలయ్యింది. అయితే ప్రస్తుతం ఎస్సీ రాష్ట్రపతిగా ఉన్న తరుణంలో ఆయన స్థానంలో మహిళ లేదా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసే ఆలోచన ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. దాంతో రెండు పోస్టులు సామాజిక కోణంలో కేటాయిస్తే వెంకయ్య భవితవ్యం ఢోలాయమానంలో పడుతుంది. గతంలో అనేక సందర్భాల్లో ఉప రాష్ట్రపతిని రాష్ట్రపతిగా ప్రమోట్ చేసిన చరిత్ర ఉండడంతో వెంకయ్య ఆశలకు అవకాశం కనిపిస్తోంది. కానీ బీజేపీకి తమ అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం రావాలంటే రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటేనే ఆపార్టీ అభ్యర్థుల ఆశలు సజీవంగా ఉంటాయి.లేదంటే వివిధ ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవుల కేటాయింపులో బీజేపీ ఎలాంటి వ్యూహం తీసుకుంటుందో చూడాలి.
Also Read : Mamata Goa TMC -ఆపరేషన్ గోవాకు మమత శ్రీకారం.మూడు రోజులు అక్కడే మకాం.