iDreamPost
iDreamPost
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన తెలుగుదేశం పార్టీకి ఇటీవలి వరకు చాలా నియోజకవర్గాల్లో ఇంఛార్జిలే లేకుండా పోయారు. ఆ బాధ్యతలు మోసేందుకు నేతలు ముందుకు రాకపోవడమే దీనికి కారణం. నానా రకాల ప్రయత్నాలు చేసి, పలు హామీలు ఇచ్చి నియోజకవర్గాల ఇంఛార్జీలను మెల్లగా నియమించుకుంటూ వస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆరు నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు.
ఈ క్రమంలో సీనియర్లను పక్కన పెడుతున్నారని ఒకవైపు అసంతృప్తి వ్యక్తం అవుతుంటే.. మరోవైపు
రెండున్నరేళ్లుగా నాయకుడు లేని నియోజకవర్గాల్లో పార్టీకి దిక్కులేకుండా పోయిందన్న ఆందోళన కార్యకర్తల్లో కనిపిస్తోంది. అటువంటి వాటిలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఒకటి. సత్వర నిర్ణయం తీసుకుని ఇంఛార్జీని నియమించకపోవడం వల్ల నియోజకవర్గంలో పార్టీ గ్రూపులుగా విడిపోయి.. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు.
రెండేళ్లుగా ఇదే దుస్థితి
సత్తెనపల్లికి గతంలో కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఓటమి.. అనంతరం ఆయన మృతి చెందడంతో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. కోడెల మరణానంతరం ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో కోడెల కుమారుడు శివరాం ను ఇంఛార్జిగా నియమిస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఆయనపై పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉండటం, పలు ఫిర్యాదులు అండటంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు సమాచారం. అయితే ఆ విషయం తేల్చివేయకుండా.. మరో నేతను నియమించకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో నియోజకవర్గ టీడీపీలో అయోమయం నెలకొంది.
Also Read : వర్ల రామయ్య వారసుడికి నియోజకవర్గ బాధ్యతలు
ఇదే అదనుగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన కుమారుడు రంగరావుకు సత్తెనపల్లి పదవి ఇవ్వాలని ఆ మధ్య చంద్రబాబును కలిసి కోరారు. వీరిద్దరికి తోడు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మళ్లీ రంగంలోకి వచ్చారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తర్వాత సొంత వ్యవహారాల్లో పడి పార్టీని, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చి తననే ఇంఛార్జిగా నియమించాలని కోరుతున్నారు. వీరు ముగ్గురు ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపడుతుండటంతో ఎవరివైపు వెళ్లాలో అర్థం కాక పార్టీ శ్రేణులు అయోమయంలో పడిపోతున్నారు. ఈ గొడవ అంతా ఎందుకని చాలామంది పార్టీకి దూరంగా ఉండిపోతున్నారు.
ఈ ఒక్క నియోజకవర్గానికి ఎందుకిలా..
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 16 చోట్ల ఇంఛార్జీలను నియమించిన టీడీపీ అధిష్టానం ఒక్క సత్తెనపల్లిని మాత్రం ఖాళీగా వదిలేసింది. దాంతో చోటా మోటా నేతలు కూడా అవకాశం కోసం అర్రులు చాస్తున్నారు. ఇప్పటికే పోటీ పడుతున్న ముగ్గురికి తోడు మరో ఇద్దరు తమకే ఇంఛార్జి పదవి ఇవ్వాలంటూ హడావుడి చేస్తున్నారు.
గతంలో కోడెల అనుచరుడిగా ఉన్న నకరికల్లు మాజీ ఎంపీపీ నాగోతు శౌరయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అబ్బూరు గ్రామానికి చెందిన మన్నెం శివనాగమల్లేశ్వర రావు కూడా రంగంలోకి దిగి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎటూ తేల్చడంలేదు. ఎవరికి ఇద్దామన్నా ఏవో కొన్ని లోపాలు కనిపిస్తుండటం.. మిగతావారు వ్యతిరేకించి.. పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉండటంతో ఏం చేయాలో పాలుపోక.. తన సహజ శైలిలో చివరి వరకు తేల్చకుండా వదిలేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనివల్ల పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని కార్యకర్తలు వాపోతున్నారు.
Also Read : చంద్రబాబు కుప్పం పర్యటన ఎందుకు రద్దు అయింది…?