iDreamPost
iDreamPost
జనసేనతో పొత్తులో ఉన్న భారతీయ జనతాపార్టీ ఈ మధ్య ఉమ్మడి అజెండాను వదిలేసి.. సొంత అజెండాతో ముందుకు సాగుతోంది. ప్రజా అంశాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎదురవుతున్న ఇబ్బందులను లైట్ గా తీసుకుంటూ మతపరమైన సున్నిత అంశాలను కెలుకుతోంది. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు, గోవధ వంటి వివాదాస్పద అంశాలతో రచ్చ చేసి మైలేజ్ పొందాలని తాపత్రయపడుతోంది. ఈ అంశాలపై తన మిత్రపక్షమైన జనసేనను కలుపుకొని పోకపోవడం విశేషం. ఇంకా చెప్పాలంటే అసలు జనసేనతో సంప్రదించాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. పొత్తు ధర్మాన్ని వీడి సొంత అజెండాను బీజేపీ భుజానికి ఎత్తుకోవడం చూస్తే జనసేనతో తెగదెంపులకు ఆ పార్టీ పూర్తిగా సిద్ధమైందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
పార్టీ శ్రేణులకు సంకేతాలు
జనసేనతో పొత్తు ఇక ముగిసినట్లేనని ముందు ముందు ఒంటరి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ శ్రేణులకు ఇప్పటికే సంకేతాలు పంపారు. అందులో భాగంగానే జనసేనతో ప్రమేయం లేకుండా తమ పార్టీకే ప్రత్యేకమైన మత అంశాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికలనాటికి బలపడేలా.. ఉమ్మడి అజెండాతో పనిచేయాలని రెండేళ్ల క్రితం పొత్తు కుదుర్చుకున్న సందర్బంగా బీజేపీ, జనసేన నేతలు బాసలు చేసుకున్నారు. తొలినాళ్లలో కొంతవరకు అలాగే పనిచేశారు. కానీ చాన్నాళ్ల నుంచి జనసేన నేతలు అసలు కలిసి రావడంలేదని బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడి తీరుతో జనసేన కార్యకర్తల్లోనూ నిస్సత్తువ ఆవరించిందని.. ఇక ఆ పార్టీని నమ్ముకుంటే తమ పుట్టి మునిగిపోతుందని కమల దళపతులు ఆందోళన చెందుతున్నారు. అందుకనే సొంత అజెండాతో ముందుకెళ్తున్నారు.
టీడీపీతో పొత్తు వైపు జనసేన మొగ్గు
మరోవైపు బీజేపీతో మైత్రికి కటీఫ్ చెప్పి పాత నేస్తం తెలుగుదేశంతో మళ్లీ కలవాలని జనసేన తపిస్తోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలాగూ టీడీపీ అధినేతతో ఇప్పటికీ లోపాయికారీ స్నేహం మెంటెయిన్ చేస్తున్నారు. దాన్నే అధికారికం చేసేసుకుంటే బాగుంటుందని జనసైనికులు భావిస్తున్నారు. పవన్ పాపులారిటీని వాడేసుకొని బీజేపీ లాభపడుతోందన్నది వారి ఆరోపణ. అదే సమయంలో ఆ పార్టీ వల్ల తమకు ఏమాత్రం మేలు జరగడం లేదని కార్యకర్తలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అదే అసంతృప్తితో బీజేపీకి దూరం అవ్వాలని ఆయన కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో జనసేనను పోటీ పెట్టకుండానే టీడీపీకి పవన్ మద్దతు ఇచ్చారు. దాంతో ఆ ఎన్నికల్లో టీడీపీ పవన్ ఇమేజ్ ను వాడుకొని పూర్తిగా లాభపడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని టీడీపీతో జత కడితే రెండు పార్టీలకు మేలు జరుగుతుందని జనసైనికులు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తం మీద పరిస్థితి చూస్తే అటు బీజేపీ.. ఇటు జనసేన.. రెండింటికీ పొత్తుపై మొహం మొత్తినట్లు కనిపిస్తోంది.
Also Read : ఎమ్మెల్యే ఆశానువాహుల ఆశలపై నీళ్లు.. అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ