iDreamPost
android-app
ios-app

IPL 2022: యార్క‌ర్ల‌తో బుమ్రాకు చుక్క‌లు చూపించిన భువి

  • Published May 18, 2022 | 12:24 PM Updated Updated May 18, 2022 | 12:24 PM
IPL 2022: యార్క‌ర్ల‌తో బుమ్రాకు చుక్క‌లు చూపించిన భువి

ఓవ‌ర్, ఓవ‌ర్ కి మ్యాచ్ దోబూచులాడింది. ఏ బ్యాట్స్ మెన్ కి బౌల‌ర్ బాల్ వేస్తున్నాడ‌న్న‌దానిబ‌ట్టి త్రాసు అటూఇటూ మొగ్గుతూనే ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ నిజంగా ఉత్కంఠను క‌లిగించింది. ఐపీఎల్ మ‌జా ఏంటో చూపించింది. సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 194 పరుగల లక్ష్యన్ని చేధించ‌డానికి ముంబై చివరి బాల్ వ‌ర‌కు పోరాడింది. 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయ‌గ‌లిగింది. చివ‌రి రెండు బాల్స్ లోనూ ముంబై గెలిచేదే. ఈ మ్యాచ్‌లో భువీ వేసిన 19వ ఓవర్ సూప‌ర్ హైలైట్‌.

రెండు ఓవ‌ర్లు అంటే 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సినప్పుడు బౌలింగ్ కు దిగాడు భువీ. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొయిడిన్‌ ఓవర్ వేశాడు. యార్క‌ర్ త‌ర్వాత యార్క‌ర్. బుమ్రాను ఉక్కిరిబిక్కిరి చేసిన భువీ, సంజయ్‌ యాదవ్‌ వికెట్‌ పడగొట్టి మొయిడిన్‌ వికెట్ సాధించాడు. భువీ మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మెయిడిన్లు (11) వేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి ఎదిగాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ది. ఈ బౌల‌ర్ 14 మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఆర్వాత‌ ఇర్ఫాన్ పఠాన్‌ (10), లసిత్ మలింగ (8), జస్ప్రీత్ బుమ్రా (8) టాప్ 5లో ఉన్నారు.

రాహుల్ త్రిపాఠి(44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు)తో ఒంటి చేత్తో ఇన్నింగ్స్ ను న‌డిపించాడు. అత‌ని మెరుపు బ్యాటింగ్ తో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.