కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలు, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఉద్యమం.. ఇప్పుడు విశ్వవ్యాప్తమయ్యాయి. ఎర్రకోట ముట్టడి అనంతరం ఈ అంశాలపై ప్రపంచ దేశాలు కూడా దృష్టి సారించాయి. ఇతర దేశాల ప్రధానులు, అధ్యక్షులు సైతం దీనిపై స్పందిస్తున్నారు. టీమ్ ఇండియాలో కూడా రైతు ఉద్యమంపై చర్చ జరిగినట్లు తెలిసింది.
అమెరికా ఏం చెబుతోందంటే..
భారత్ తీసుకువచ్చిన సాగు చట్టాలను అగ్రరాజ్యం అమెరికా స్వాగతించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలను ఉద్దేశించి తీసుకువచ్చిన ఈ చట్టాలతో భారతీయ మార్కెట్ల సామర్థ్యం పెరుగుతాయని.. రైతులకు కూడా మార్కెట్ పరిధి విస్తృతమవుతుందని అమెరికా విదేశాంగ శాఖ, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. అదే సమయంలో శాంతియుత మార్గంలో జరుగుతున్న రైతుల ఆందోళనను ప్రశంసించాయి. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందనడానికి శాంతియుత ఆందోళనే నిదర్శనమని పేర్కొన్నాయి. ఈ సమస్యను చర్చలతో పరిష్కరించుకోవాలని రైతులు, ప్రభుత్వాన్ని కోరాయి. బైడెన్ నేతృత్వంలోని అమెరికా సర్కారు భారత సాగు చట్టాలను స్వాగతిస్తుండగా.. పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు రైతుల ఆందోళనకు మద్దతు పలికారు.
రైతు ఉద్యమంపై చర్చిస్తాం : బ్రిటన్
భారత్‌లో రైతులు జరుపుతున్న ఆందోళనపై వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో చర్చించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై తమ పార్లమెంట్ వెబ్‌సైట్‌లో పెట్టిన ఈ-పిటిషన్‌కు 1.10 లక్షల మంది సంతకాలు చేశారని పేర్కొంది. నిబంధనల ప్రకారం ఈ-పిటిషన్‌కు 10 వేల మంది స్పందిస్తే.. దానిపై బ్రిటన్ సర్కారు ఓ ప్రకటన చేస్తుంది. ఆ సంఖ్య లక్ష దాటితే.. పార్లమెంటు సభ్యులతో ఆ సమస్యపై చర్చించి, అధికారికంగా తన స్పందనను తెలియజేస్తుంది. రైతుల ఆందోళనపై అంతర్జాతీయంగా ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
పరిష్కారం కొనుగొనాలి : కోహ్లీ
ఇటు భారత క్రీడారంగంలోనూ రైతుల ఆందోళన ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లేలు ప్రభుత్వాన్ని సమర్థించే రీతిలో పోస్టులు పెట్టగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన స్పందనను తెలియపర్చారు. ఈ ఆందోళన గురించి జట్టు సమావేశాంలో స్వల్ప చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే ఎవరేమన్నారన్నది చెప్పలేదు. ఎవరి వైఖరి వారు వెల్లడించారన్నారు. ‘‘రైతులు ఈ దేశంలో అంతర్భాగం. సమస్యపై అన్ని పక్షాలూ చర్చించి ఓ పరిష్కారం కనుగొనాలి. విభేదాలొచ్చినా అందరం ఐక్యంగా ఉందాం’’ అని కోహ్లీ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.