Idream media
Idream media
రెండు మూడు జట్లు పోటీ పడుతున్న చోట.. నీ జట్టు కెప్టెన్ వేరే వారి జట్టు గెలుపు కోసం నువ్వు ఆట సరిగా ఆడకు అంటే ఆ బాధ వర్ణనాతీతం. గెలుపో ఓటమో మన ఆట మనం ఆడినప్పుడే సంతృప్తిగా ఉంటుంది. ఇది క్రీడల్లోనే కాదు రాజకీయాల్లోనూ వర్తిస్తుంది. గత ఎన్నికల్లో జనసేన–టీడీపీల పరోక్ష ఉమ్మడి పోటీ గురించి అందరికీ తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన గెలుపు కోసం టీడీపీ అధ్యక్షుడు తీవ్రంగా కృషి చేశాడన్నదే బహిరంగ రహస్యమే. (అఫ్‌కోర్స్ అది బెడిసి కొట్టిందనుకోండి.. అది వేరే విషయం) అలాంటి కోవలోకే చేరుతుంది భీమవరం నియోజకవర్గ వ్యవహారం. ఇక్కడి వైఎస్సార్‌సీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్, టీడీపీ నుంచి పులపర్తి రామంజనేయులు అలియాస్ అంజిబాబు పోటీ పడ్డారు. ఎప్పుడైతే పవన్ కల్యాన్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడని తెలిసిందో… అప్పుడే అసలు సినిమా మొదలయ్యింది.
తన స్నేహితుడు పవన్‌ను ఎలాగైనా గెలిపించాలని భావించిన చంద్రబాబు.. అంజిబాబుకు కబురు పెట్టారు. వైఎస్సార్‌సీపీ బలంగా వీస్తున్న నేపథ్యంలో నువ్వు కాస్త సైలెంట్ అయితే పవన్ గెలుపు సులువవుతుందని అంజిబాబుకు చెప్పారు. దీంతో ఆయనకు మైండ్ బ్లాంక్ అయ్యింది. నైతికంగా కరెక్ట్ కాదని, తన అనుచరులకు ఏ విధంగా సమాధానం చెప్పాలని చంద్రబాబును మొఖం మీదే అడిగేశారు. అయితే పవన్ గెలుపు మనకు ఎంతో అవసరమని చంద్రబాబు తేల్చేశారు. అందుకే ఆ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం కూడా చేయలేదు. చేసేది లేక అంజిబాబు సైలెంట్ కావాల్సి వచ్చింది. ఎన్నికల్లో చురుగ్గా వ్యవహరించలేదు. అదే సమయంలో చంద్రబాబు భీమవరం పట్టణానికి చెందిన పలువురిని పిలుపించుకొని పవన్ కోసం పనిచేయాలని సూచించారు. తనకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చేతిలో ఓటమి తప్పుదు అన్న సంగతి ముందే తెలుసని, అయితే ఎవరి కోసమో ఇలా అస్త్ర సన్యాసం చేయడం ఎంతో బాధ కలిగిస్తోందంటూ తన అనుచరులతో వాపోయాడు. ఆ తర్వాత చంద్రబాబు పాచికలు పారక.. పవన్ ఓడిపోవడం.. వైఎస్సార్‌సీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ ఘన విజయం సాధించడం.. అంజిబాబు ఏకంగా మూడో స్థానానికి పడిపోవడం తెలిసిందే.
ఫలితాల తర్వాత ఆయన పూర్తిగా పార్టీకి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారి కూడా పార్టీ కార్యాలయానికి రావడంగానీ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చేయలేదు. జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి కొన్ని సార్లు సముదాయించే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత చంద్రబాబు జోలె పట్టుకొని భీమవరం వెళ్తే.. అంజిబాబు అటువైపు కూడా చూడలేదు. వ్యవహారం తేడా కొట్టిందని తెలుసుకున్న చంద్రబాబు తన దూతలను అంజిబాబు వద్దకు పంపించారు. ఎట్టకేలకు అమరావతికి రప్పించుకొని అంజిబాబుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో మీరు చేసిన పనివల్ల కార్యకర్తలకు మొహం చూపించలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇకపై నియోజకవర్గంలో చురుగ్గా ఉండాలంటూ సూచించి పంపించేశారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి చేసిందంతా చేసి.. ఇప్పుడు రాజీకి పిలిచారంటూ తన అనుచరుల వద్ద అంజిబాబు వాపోయారట. అంతా సమసిపోయిందని చంద్రబాబు చెప్పుకున్నా అక్కడ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉందని భీమవరంలో టాక్ నడుస్తోంది.
అంజిబాబు భీమవరం నుంచి 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఒకసారి కాంగ్రెస్ నుంచి మరోసారి టీడీపీ నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2009 ఎన్నికల్లో తనకు 63,862 ఓట్లు, 2014 ఎన్నికల్లో 90,722 ఓట్లు రాగా, 2019 ఎన్నికల్లో 54వేల ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.