iDreamPost
android-app
ios-app

దర్శకేంద్రుడి సినిమాకు భలే టైటిల్

  • Published Jan 12, 2021 | 6:41 AM Updated Updated Jan 12, 2021 | 6:41 AM
దర్శకేంద్రుడి సినిమాకు భలే టైటిల్

తెలుగు సినిమా చరిత్రలో తమదంటూ ప్రత్యేక ముద్ర వేసి మలుపు తిప్పిన దర్శకుల్లో రాఘవేంద్రరావు పేరు ఎప్పటికీ ముందువరసలోనే ఉంటుంది. ఘరానా మొగుడు లాంటి మసాలా సినిమాతో కోట్లు కొల్లగొట్టినా, అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రంలో హృదయాలను ద్రవింపజేసినా ఆయనకే చెల్లుతుంది. వందకు పైగా సినిమాలు చేసినా ఈయన ఎప్పుడు నేరుగా తెరమీద కనిపించింది లేదు. దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్ తరహాలో నటుడిగా కూడా ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించనూ లేదు. స్టేజి మీద కూడా ఆచి తూచి మొహమాటపడుతూ మాట్లాడే దర్శకేంద్రుడు ఇన్నేళ్లకు మేకప్ వేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో శ్రేయ, సమంతా, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించబోతున్నట్టు ఇప్పటికే లీక్స్ వచ్చాయి. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయట. వయసు మళ్లిన ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో రాఘవేంద్రరావులోని కొత్త వేరియేషన్స్ ని ఇందులో చూపించబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. దీనికి టైటిల్ గా ‘ఓ బాబు’ అని ఫిక్స్ అయినట్టుగా ఇన్ సైడ్ న్యూస్. ఇంకో రెండు మూడు ఆప్షన్లు పరిశీలించినా అందరూ దీని వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ప్రారంభించే రోజున క్లారిటీ రావొచ్చు.

గత కొంతకాలంగా దర్శకత్వ బాధ్యతకు దూరంగా ఉన్న రాఘవేంద్రరావు గారు తన కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ పెళ్లి సందడి సీక్వెల్ ని శ్రీకాంత్ కొడుకు రోషన్ తో ప్రకటించడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. అయితే దానికి ఆయన కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు నటన పరంగానూ ఓ బాబుతో బిజీ కానుండటం చూస్తుంటే ఏడాదికో రెండేళ్ళకో ఒక సినిమా చేస్తున్న యువతరం దర్శకులు స్పీడ్ పెంచడం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ బాబు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా ఎదురు చూడాలి మరి. 1975లో శోభన్ బాబుతో రాఘవేంద్రరావు తీసిన హిట్ మూవీ టైటిల్ కూడా బాబునే కావడం గమనార్హం.