iDreamPost
iDreamPost
లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రచారం లేదు. వేల కోట్లకు ఎంవోయూలు కుదుర్చుకున్న దాఖలాలు కూడా లేవు. వందల మందికి ఉపాధి దక్కుతోందంటూ ఊకదంపుడు కథనాలు కూడా లేవు. కానీ క్షేత్రస్థాయిలో ప్రయత్నాలతో ప్రభుత్వం తన పనితాను చేసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. దాని ప్రభావంతోనే మాంధ్యం ముంచుకొస్తుందనే ఆందోళనల మధ్య కూడా కొద్దిపాటి పరిశ్రమల ప్రస్తావన కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో జీడీపీ దిగజారిపోతున్న వేళ ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకి కొందరయినా పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు.
అందులో ఇప్పటికే పలు పరిశ్రమల ఏర్పాటుకి సంబంధించిన ప్రాధమిక ఏర్పాట్లు కూడా షురూ అవుతుండడంతో పారిశ్రామిక రంగం పుంజుకుంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో స్వయంగా ఉక్కు పరిశ్రమ నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంటోంది. దానికి గానూ శంకుస్థాపనకు ముహుర్తం రెడీ కావడంతో కడప ఉక్కు కర్మాగారం కల సాకారం అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉక్కు పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం సాహసోపేతంగా ప్రభుత్వరంగ పరిశ్రమ ఏర్పాటు చేస్తుండడం పెను సవాల్ గానే చెప్పాలి. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం డిసెంబర్ 26న శంకుస్థాపనకి ఏర్పాట్లు చేస్తుండడంతో కడప ఉక్కు పరిశ్రమ పెద్ద చర్చకు దారితీయబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఓవైపు ప్రభుత్వ రంగాన్ని అమ్మకాలకు పెడుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం దానికి విరుద్ధంగా సాగుతుండడం విశేషంగానే చెప్పాలి.
ప్రభుత్వరంగంలోనే పెద్ద పరిశ్రమ ఏర్పాటు అవుతున్న వేళ ఇతర కార్పోరేట్ దిగ్గజాల్లో కూడా ధీమా పెరిగే అవకాశం ఉంటుందని పారిశ్రామికవర్గాలు అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలోనే ఉబెర్ వంటి అంతర్జాతీయ సంస్థ ఇండియాలోనే తన రెండో కేంద్రంగా విశాఖను ఎంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉబెర్ సంస్థకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నడుస్తోంది. దాంతో పాటుగా విశాఖలో కూడా రెండో సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఉబెర్ ముందుకురావడం విశేషం. విశాఖలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏర్పాటు కోసం దండే రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ ప్రభుత్వాన్ని సంప్రదించింది. అదే సమయంలో ఉబెర్ వంటి కంపెనీలు కూడా విశాఖ వైపు చూస్తుండడంతో ఏపీ ఆర్థిక కేంద్రంగా భావిస్తున్న విశాఖలో పెట్టుబడులకు కదలిక ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే అనంతపురంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ కోసం వీరవాహన ఉద్యోగ్ సంస్థ ముందుకొచ్చింది. 1300 కోట్ల పెట్టుబడితో 6,500 మందికి ఉపాధి కల్పించబోతున్నట్టు సదరు సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మరోవైపు చైనాకి చెందిన ఉక్కు పరిశ్రమ కూడా ఏపీలో స్థాపించే ప్రయత్నాల్లో ఉంది. దానికి గాను 15వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇవి కొలిక్కి వస్తే ఏపీలో కొత్తగా కడపకు తోడుగా మరో ఉక్కు పరిశ్రమ కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఓవైపు లూలా వంటి సంస్థలు ఏపీకి దూరమవుతుండడంతో పారిశ్రామికవేత్తలు బైబై ఏపీ అంటున్నారని విపక్షం ప్రచారం చేస్తోంది. అమరావతి స్టార్టప్ ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ కన్షార్షియం తప్పుకోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అదే సమయంలో కొత్త ప రిశ్రమల ఏర్పాటుకి తగ్గట్టుగా ప్రయత్నాలు కొలిక్కివస్తుండడంతో ఆంద్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఉత్తేజం కలిగించడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు. తాజా పరిణామాలను గమనిస్తున్న పలువురు ప్రముఖులు కూడా ఆశాజనకంగా ఉందని చెబుతున్నారు. మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు వంటి వారు స్పందిస్తూ లూలా, సింగపూర్ కన్షార్సియం వంటివి వైదొలగడం ఏపీకి శ్రేయస్కరమేనని చెబుతున్నారు. ఈ రెండు సంస్థలకు కాంట్రాక్టులు విధి విధానాలు పాటించకుండా వారికి లబ్ధి జరిగే విధంగా కట్టబెట్టటం జరిగిందని చెబుతున్నారు. అదే సమయంలో కొత్త పరిశ్రమలు రావడానికి తగ్గట్టుగా వాతావరణం ఏర్పడుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.