iDreamPost
android-app
ios-app

ఆ దేశ రాజధాని మునిగి పోతుందంట…!

  • Published Jan 19, 2022 | 5:52 AM Updated Updated Mar 11, 2022 | 10:23 PM
ఆ దేశ రాజధాని మునిగి పోతుందంట…!

సముద్ర నీటిమట్టంలో అసాధారణ పెరుగుదల, పెరిగిన జనసాంద్రత, కాలుష్యం తదితర కారణాలతో ఇండోనేషియా రాజధానిని జకార్తా నుంచి తరలించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇండోనేషియా పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించింది. కొత్త రాజధానిని జకార్తాకు సుమారు రెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియా ద్వీపంలో ఉన్న ఈస్ట్ కలిమంటన్ ప్రాంతంలో నిర్మించనున్నారు. దీనికి నుసంతరగా నామకరణం చేశారు.

ఎందుకు తరలింపు

రాజధాని జకార్తా సమీపంలో సముద్ర నీటిమట్టం అసాధారణ రీతిలో పెరుగుతోంది. నీటిమట్టం సాధారణ పెరుగుదల 3.4 మిల్లీమీటర్లు కాగా జకార్తా సమీపంలో దాన్ని మించి ఏడాదికి 5 మిల్లీమీటర్ల మేరకు నీటిమట్టం పెరుగుతోంది. దశాబ్దాలుగా ఇది కొనసాగుతుండటంతో జకార్తా నగరం ప్రాంతాలు క్రమంగా మునిగిపోతున్నాయి. అంతేకాకుండా జకార్తా మెట్రో ప్రాంతంలో జనసాంధ్రత అంచనాలకు మించి పెరిగిపోయింది. దాదాపు 30 మిల్లియన్ల జనాభా ఉండటం వల్ల కాలుష్యం పెరిగింది. తరచూ ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయి. ఇక విచక్షణారహితంగా భూగర్భ జలాలను తోడేస్తుండటంతో జలవనరులు తరిగిపోయాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జకార్తా నుంచి రాజధానిని తరలించాలని 2019 ఏప్రిల్లో దేశాధ్యక్షుడు జొకో విడోడో ప్రతిపాదించారు. దీనివల్ల జకార్తా నగరంపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.

పర్యావరణవేత్తలు, స్థానికుల వ్యతిరేకత

జావా ద్వీపంలో జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని ఈస్ట్ కలిమంటన్ ప్రాంతంలో 56,180 హెక్టార్ల విస్తీర్ణంలో కొత్త రాజధానిని పర్యావరణ హితంగా స్మార్ట్ సిటీగా నిర్మించనున్నారు. 2024 నాటికి కొత్త రాజధానిని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. అడవులు, ఖనిజ నిక్షేపాలు, వన్యప్రాణి సంపద విస్తారంగా ఉన్న ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనివల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బ తింటుందని అడవులు, వన్యప్రాణులు నాశనం అవుతాయని, వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు కూడా కొత్త రాజధానిని వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు ఉనికి కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.