iDreamPost
android-app
ios-app

యుద్ధం , ఒక బాల్య జ్ఞాప‌కం

యుద్ధం , ఒక బాల్య జ్ఞాప‌కం

పాకిస్తాన్‌తో యుద్ధం చేసి 50 ఏళ్లు. అప్పుడు నేను ఐదో త‌ర‌గ‌తి. యుద్ధం అన‌గానే ఏదో ఉత్సాహం. భ‌యం. మా ఊర్లో ఈశ్వ‌ర‌మ్మ అనే అవ్వ ఉండేది. ఆమె రెండో ప్ర‌పంచ యుద్ధంలో బొంబాయిలో వుండేది. రాత్రిపూట సైర‌న్లు విన‌ప‌డ‌గానే అంద‌రూ లైట్లు ఆర్పి, ఒక మూల దాక్కునేవార‌ని చెప్పేది. విమానాల నుంచి బాంబులు వేస్తార‌ని అనేది.

యుద్ధం మొద‌ల‌య్యాకా, రాత్రిపూట క‌రెంట్ పోతే బాంబులు ప‌డ‌తాయ‌ని భ‌య‌ప‌డేవాన్ని. వ‌ర్షానికి, ఉరుముల‌కి అర్జున‌, ఫ‌ల్గుణా అంటే స‌రి. మ‌రి బాంబుల‌కి ఏ దేవున్ని వేడుకోవాలో తెలియ‌దు. మొత్త‌మ్మీద రాయ‌దుర్గంలో బాంబులు ప‌డ‌లేదు.

ఆంధ్ర‌ప్ర‌భ మ‌ధ్యాహ్నం వ‌చ్చేది. దాంట్లో నేను చ‌దివేది ఏమంటే యుద్ధంలో ఎవ‌రి న‌ష్టం ఎంత అని. మ‌నం పోగొట్టుకున్న విమానాలు, సైనికులు, స‌బ్‌మెరీన్లు సంఖ్య వుండేది. మ‌న కంటే పాకిస్తాన్‌కే ఎక్కువ న‌ష్టం వుండేది. అదో సంతోషం. ఒక‌సారి ఒక వార్త గురించి అంద‌రూ మాట్లాడుతూ వుంటే చ‌దివాను.

మ‌న దేశానికి కాందిశీకులుగా వ‌స్తున్న గుంపు కోసం పాక్ సైన్యం వెతుకుతుంటే ఒక త‌ల్లి చేతిలోని బిడ్డ ఏడ్వ సాగాడు. బిడ్డ నోరుని గ‌ట్టిగా మూసింది త‌ల్లి. సైనికులు వెళ్లిపోయిన త‌ర్వాత చూస్తే బిడ్డ ఊపిరాడ‌క చ‌నిపోయి వున్నాడు. శ‌ర‌ణార్థ శిబిరంలో ఆ త‌ల్లి పొర్లిపొర్లి ఏడ్చింది.

యుద్ధంతో పిల్ల‌ల ఆట‌లు కూడా మారిపోయాయి. గోలీలు, బొంగ‌రాలు ఆడే మేము, ఒక దీపావ‌ళి తుపాకీతో కాల్చుకునే వాళ్లం. దొంగ ..పోలీసుల ఇండియా-పాకిస్తాన్‌. శ‌త్రుదేశాన్ని వెంటాడి కాల్చేవాళ్లం.

నిప్పాని రంగారావు అనే ఆంధ్ర‌ప్ర‌భ విలేక‌రి ఉండేవారు. సినీతార జ‌మున‌కి బంధువు. ఆయ‌న పెద్ద కొడుకు విఠ‌ల్ సైన్యంలో ప‌నిచేసేవాడు. యుద్ధం జ‌రిగిన‌న్ని రోజులు ఆ కుటుంబం దిగులుగా వుండేది. ఫోన్లు లేని కాలం అది.

గెలిచిన రోజు అంద‌రూ ఆనందించారు. కొంత మంది ట‌పాసులు కాల్చారు. శ‌ర‌ణార్థుల కోసం ప్ర‌తి పోస్టు కార్డు పైన 5 పైస‌లు పెంచారు. అస‌లు ఇబ్బంది సినిమా టికెట్లు పెంచ‌డంతో వ‌చ్చింది. 30 పైస‌ల నేల 40 పైస‌లు, 65 పైస‌ల బెంచి 75 పైస‌లైంది. 10 పైస‌ల‌కి జేబుల నిండా వేరుశ‌న‌గ కాయ‌లు వ‌చ్చేరోజులు.

పిల్ల‌బ్యాచ్‌ల‌న్నీ ఇందిర‌మ్మ‌కి వీర‌భ‌క్తులుగా మారాం. న్యూస్‌రీల్‌లో క‌నిపిస్తే చ‌ప్ప‌ట్లు. 72లో జైఆంధ్రా ఉద్య‌మంలో ఆమెని అంద‌రూ తిడుతూ ఉంటే అర్థం కాలేదు. పిల్ల‌లకి మ‌ల్లే పెద్దాళ్ల‌కి గ‌ట్టి అభిప్రాయాలుండ‌వు. ఎప్పుడు తిడ‌తారో ఎప్పుడు పొగుడుతారో వాళ్ల‌కే తెలియ‌దు. ఇది నాకు చిన్న‌ప్పుడే తెలుసు.