ఇటీవల సరిహద్దుల్లో చైనాతో జరిగిన వ్యవహారాల నేపథ్యంలో భవిష్యత్‌లో ఆ దేశం పట్ల ఎలా వ్యవహరించాలి..? మన వ్యూహం ఎలా ఉండాలి..? తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన మేరకు దేశ వ్యాప్తంగా 20 పార్టీల నేతలు ఈ సమావేశంలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత, రక్షణ శాఖ మాజీ మంత్రి శరద్‌పవార్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూలి, సీపీఎం నేత, రాజ్యసభ సభ్యుడు డి. రాజాతో సహా పలు పార్టీల నేతలు ఈ సమావేశంలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
సరిహద్దుల్లో సైనికులు ఆయుధాలతో సంచరించే విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలను అనుసరించాలని ఎన్సీపీ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి శరద్ పవార్ సూచించారు. పంచశీల ఒప్పందాన్ని ఇరు దేశాలు గౌరవించేలా పని చేయాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి సూచించారు. ఇటీవల అమెరికాతో భారత్ సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో సీపీఐ నేత రాజా కీలక సూచన చేశారు. అమెరికా కూటమిలో చేరవద్దని ప్రధాని మోదీకి సూచించారు.
భారత్, చైనా సరిహద్దు వద్ద ఇటీవల తరచూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు విషయమై ఇరు దేశాల సైనికుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చేటుచేసుకుంది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన ఒక కల్నల్‌తో సహా 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా సైనికులు కూడా దాదాపు 35 మంది చనిపోయినట్లు వార్తలొచ్చాయి. ఈ ఘటనపై దేశం యావత్తు స్పందించింది. చైనాకు వ్యతిరేకంగా ర్యాలీ చేసింది. వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తూ చైనా వస్తువులు బ్యాన్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో బ్యాన్ చైనా వస్తువులు అనే ప్రచారం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆ దేశంతో వాణిజ్యం, దౌత్యం పరంగా ఎలాంటి విధానాన్ని అవలంభిచాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది.