iDreamPost
android-app
ios-app

భార‌త్ మ‌రో ఘ‌న‌త : నాగ్‌ చివరి ద‌శ ప్ర‌యోగం విజయవంతం

భార‌త్ మ‌రో ఘ‌న‌త : నాగ్‌ చివరి ద‌శ ప్ర‌యోగం విజయవంతం

ర‌క్ష‌ణ రంగంలో భార‌త్ మ‌రో ముంద‌డుగు వేసింది. ఇప్ప‌టికే బలోపేతం దిశ‌గా దూసుకెళ్తున్న భార‌త్ అమ్ముల‌పొదిలో మ‌రో శ‌క్తివంత‌మైన అస్త్రం చేరింది. ట్యాంక్‌ విధ్వసంక క్షిపణి నాగ్‌ చివరి ద‌శ‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఇది రూపుదిద్దుకోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో రక్షణ రంగం మరింత బలోపేతమైంది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌ రేంజ్‌ నుండి నాగ్‌ మిసైల్‌ క్యారియర్‌ (ఎన్‌ఎఎమ్‌ఐసిఎ) ద్వారా దీన్ని ప్రయోగించారు. నిర్ధేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు భారత రక్షణ, పరిశోధన సంస్థ (డిఆర్‌డిఒ) వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇక నాగ్‌ క్షిపణులు ఉత్పత్తి దశకు చేరుకున్నట్లయింది.

శత్రు యుద్ధ ట్యాంక్ ల‌ను ధ్వంసం చేసేలా…

శత్రువులు యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేందుకు యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌(ఎటిజిఎం)ను డిఆర్‌డిఒ అభివృద్ధి చేసింది. నాగ్‌ మిసైల్‌ క్యారియర్‌ను రష్యాకు చెందిన బిఎంపి-2 పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇది లాక్‌ బిఫోర్‌ లాంచ్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలో క్షిపణి ప్రయోగానికి ముందే లక్ష్యాన్ని గుర్తిస్తారు. భారత్‌-చైనా మధ్య తాజాగా తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. అత్యంత శ‌క్తివంత‌మైన క్షిప‌ణుల‌ను దేశీయ ప‌రిజ్ఞానంతో రూపొందించ‌డంపై దృష్టి సారించింది.

ఈ క్రమంలోనే ఒడిశా తీరంలోని ఎపిజె అబ్దుల్‌ కలాం లాంచ్‌ కాంప్లెక్స్‌ నుండి హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ వెహికల్‌ను ప్రయోగించింది. ఆ తర్వాత బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి, జలాంతర్గాములను ధ్వంసం చేయగల క్షిపణి సహాయక టర్పెడో, లేజర్‌ గైడెడె యాంటీ ట్యాంక్‌ క్షిపణులను వరుసగా ప్రయోగించింది. తాజాగా నాగ్‌ చివరి దశ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఆ క్షిపణులు ఉత్పత్తి దశకు చేరుకున్నాయి. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బిడిఎల్‌) వీటిని ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగస్వామ్యులైన శాస్త్రవేత్తలు, డిఆర్‌డిఒ సిబ్బందికి అభినందనలు తెలిపారు.