ప్రపంచమంతా ఇంటర్నెట్ లో శోధించేది ఒకటయితే, భారతీయులు శోధించేది మాత్రం మరొకటి. అవును ఇది నమ్మశక్యం కాని నిజం. ఎవరైనా ప్రపంచ రికార్డు సాధిస్తే ఆ వ్యక్తి జీవిత విశేషాలు, అతను ఆ స్థానాన్ని చేరుకోవడానికి ఎదుర్కొన్న కష్టాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. కానీ ఇండియాలో మాత్రం అలా చేయరు. కేవలం అతని కులం మతాన్ని అంతర్జాలంలో శోధిస్తారని, ఒకవేళ ఆ రికార్డు సాధించిన వ్యక్తి తమ కులం వాడైతే పొంగిపోతారని ఇంటర్నెట్ ట్రెండ్స్ చెప్తున్నాయి.
ఉదాహరణకు భారతీయుల అంతర్జాల శోధన ఎలా ఉంటుందంటే ఒకవేళ హిమదాస్ పతకం గెలిస్తే, హిమదాస్ కులం ఏమిటి అని వెతుకులాట ప్రారంభిస్తారు కొందరు భారతీయులు. అందులోను తృప్తి పడకపోతే మతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మంచి పేరును పతకాలను సంపాదించుకున్న గొప్పవ్యక్తుల్లో తమ కులంవారు, మతంవారు ఉంటే వారి విజయాలను తమ విజయాలుగా భావించి మురిసిపోతారట కొందరు మహానుభావులు. అందుకే అకస్మాత్తుగా ఫేమస్ అయిన వ్యక్తులను తమ కులం వాడో కాదో అని అంతర్జాల సహాయాన్ని తీసుకుని మరీ తెలుసుకుంటారట..తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతిరావు కులాన్ని,ప్రణయ్ కులాన్ని అంతర్జాలంలో వెతికి మరీ, సోషల్ మీడియాలో కులాల యుద్దాలను సోషల్ మీడియాలో కొందరు కొందరు పెద్ద మనుషులు చేశారు. కుల,మత రహిత సమాజం కోసం కొందరు నిజాయితీగా ఉద్యమిస్తుంటే మరికొందరు మాత్రం కావాలని కులాల కుమ్ములాటలను ప్రోత్సహించి ఆ మంటల్లో చలి కాచుకుంటున్నారు.
కుల మత విషయాలను పక్కన పెడితే, కొన్ని విషయాల్లో కొందరి వెతుకులాట మరీ చిత్రంగా ఉంటుందిin. హైదరాబాద్ శివారులో జరిగిన “దిశ” హత్యాచార ఘటన గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే, “దిశ” అత్యాచార వీడియో అంతర్జాలంలో ఉందేమో అని కొందరు పోర్న్ సైట్స్ అన్నీ గాలించారు. సుమారు 80 లక్షల మంది, దిశా అత్యాచార ఘటన గురించి వెతికారంటే కొందరి మానసిక వైకల్యం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో జమ్మూ కాశ్మీర్లోని కతువా ప్రాంతంలో జరిగిన “అసిఫా” హత్యాచార ఘటనని కూడా పోర్న్ సైట్స్ లో కొందరు వెతకడం అప్పట్లో అనేక విమర్శలకు దారి తీసింది.
వివిధ నాయకులు, ఆటగాళ్ల యొక్క కులాలను మతాలను వెతుక్కుని తమ కులాలు,మతాలు గొప్పవి అని మురిసిపోయే కొందరు “పెద్ద”మనుషులు చేసేదే తప్పు అనుకుంటే, అత్యాచార ఘటనలు జరిగాక బాధితుల వీడియోల గురించి అంతర్జాలంలో వెతికేవారిని గమనిస్తే మనుషుల్లో మానవతా విలువలు ఎంతగా తగ్గిపోతున్నాయో అంచనా వేయవచ్చు. మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది అనడానికి కొందరి భారతీయుల అంతర్జాల వెతుకులాటను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
యాహూ మోస్ట్ సెర్చుడు సెలెబ్రిటీస్
గత దశాబ్దంలో అంతర్జాలంలో భారతీయులు అత్యధికమంది శోధించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఏ అమితాబ్ బచ్చనో, సల్మాన్ ఖానో,విరాట్ కోహ్లీనో కాదు. వీళ్లందరినీ తలదన్ని ప్రథమస్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ కి గురవడం ఖాయం. ఆమె మరెవరో కాదు సన్నీ లియోన్.. గత పదేళ్లలో నెటిజన్లు అంతర్జాలంలో అత్యధికంగా శోధించిన వ్యక్తిగా సన్నీ లియోన్ నిలిచిందని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూ వెల్లడించింది. యాహూ మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రెటీస్ పేరుతో ప్రతి సంవత్సరం వివరాలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను సన్నీ లియోన్,సల్మాన్ ఖాన్ లు సంయుక్తంగా మన నెటిజన్లు ఎక్కువగా శోధించిన వ్యక్తులుగా మొదటిస్థానం లో నిలిచారు. వారి తర్వాతి స్థానాల్లో వరుసగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా అంటే 2017,18 లో కూడా భారతీయులు అంతర్జాలంలో ఎక్కువగా వెతికిన సెలెబ్రిటీగా సన్నీలియోన్ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం..