iDreamPost
android-app
ios-app

ఆ పరికరంతో ఆక్సిజన్ ప్రయోజనాలు రెట్టింపు – తూర్పు నౌకాదళం వినూత్న ఆవిష్కరణ

  • Published Jun 01, 2021 | 1:09 PM Updated Updated Jun 01, 2021 | 1:09 PM
ఆ పరికరంతో ఆక్సిజన్ ప్రయోజనాలు రెట్టింపు – తూర్పు నౌకాదళం వినూత్న ఆవిష్కరణ

ప్రస్తుత కోవిడ్ సెకండ్ వేవ్ లో వైరస్ బారిన పడుతున్నవారిలో అధిక శాతం మంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తోనే ఇబ్బంది పడుతున్నారు. శ్వాస తీసుకోవడం కష్టమై ఆక్సిజన్ పెట్టాల్సి వస్తోంది. దాంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు మెడికల్ ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. మెడికల్ ఆక్సిజన్ కోటా కేటాయింపు, సరఫరా అంతా కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉండటంతో అవసరమైనంత ఆక్సిజన్ సమకూర్చుకోవడం రాష్ట్రాలకు కష్టంగా మారింది. ఈ తరుణంలో విశాఖలోని తూర్పు నౌకాదళం ఆక్సిజన్ ను ఆదా చేసి.. వినియోగ ప్రయోజనాలను రెట్టింపు చేసే ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్(ఓఆర్ ఎస్)ను ఆవిష్కరించింది. ఈ పరికరాన్ని కోవిడ్ రోగులకు అమర్చి మంచి ఫలితాలు ఇస్తున్నట్లు నిర్ధారించారు. లిక్విడ్ ఆక్సిజన్ కూడా మెడికల్ అవసరాలకు వినియోగించేలా చేయడం ఈ వ్యవస్థ మరో విశిష్టత.

ఎలా పనిచేస్తుంది..

సాధారణంగా మనం పీల్చే గాలి నుంచి కొంత ప్రాణవాయువును మాత్రమే ఊపిరితిత్తులు తీసుకుంటాయి. మిగతా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వంటివన్నీ నిశ్వాస ద్వారా మళ్లీ బయటకు వచ్చేస్తాయి. అలా మిగిలిన ప్రాణవాయువును బయటకు వెళ్ళనివ్వకుండా తనలోకి లాక్కొని రీసైక్లింగ్ చేసి మళ్లీ ఉపయోగించడానికి ఓఆర్ ఎస్ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. రోగికి అమర్చే ఆక్సిజన్ మాస్కుకు అదనంగా మరో పైపు, తక్కువ శక్తి కలిగిన మోటారు అమర్చుతారు. ఇది రోగి వదిలే గాలిని తనలోకి లాక్కొని అందులోని కార్బన్ డయాక్సైడ్ ను వేరుచేసి బయటకు పంపేస్తుంది. ప్రాణవాయువును మళ్లీ ఉపయోగించుకునేలా చేస్తుంది. సాధారణంగా వైద్య అవసరాలకు లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగపడదు. కానీ ఓఆర్ ఎస్ విధానంలో వేపరైజర్, ప్రెషర్ వాల్వులు వినియోగించడం ద్వారా లిక్విడ్ ఆక్సిజన్ ను కూడా రోగులకు వాడవచ్చని ప్రయోగాత్మకంగా తేల్చారు. మొదట ఏప్రిల్ 22న దీన్ని పూర్తిస్థాయి నమూనా తయారు చేసి రోగికి అమర్చి పరీక్షించారు. అనంతరం కొన్ని మార్పులతో మరింత అభివృద్ధి చేశారు.

నేవీ పేరుతో పేటెంట్ హక్కులు

తూర్పు నౌకాదళం పరిధిలోని నేవీ డైవింగ్ స్కూల్ హెడ్ లెఫ్టినెంట్ కమాండర్ మయాంక్ శర్మ ఆక్సిజన్ రీసైక్లింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. నేవీ సిబ్బందికి సముద్ర అంతర్భాగంలో చాలా లోతుకు వెళ్లగలిగేలా శారీరక శిక్షణ ఇవ్వడంతో పాటు శ్వాసక్రియకు ఇబ్బంది లేకుండా పలు పరికరాలు వినియోగిస్తుంటారు. అటువంటి పరికరాల తయారీలో వారికి మంచి అవగాహన ఉంటుంది. అదే ఆక్సిజన్ రీసైక్లింగ్ వ్యవస్థ రూపకల్పనకు దోహదపడింది. దీనికి సంబంధించి నేవీ తన పేరుతో ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా తీసుకుంది. దీని తయారీకి ఒక్కోదానికి రూ. 10వేలకు మించి ఖర్చు కాదని.. అదే సమయంలో ఒక ఆక్సిజన్ సిలెండరును సగటు వినియోగ సమయం కంటే రెండు నుంచి నాలుగు రెట్ల ఎక్కువ సమయం వాడవచ్చని నేవీ అధికారులు తెలిపారు. ఆక్సిజన్ అవసరమైన రోగులతోపాటు పర్వతారోహకులు, సముద్ర అంతర్భాగాల్లో పనిచేసే అన్వేషకులకు రీసైక్లింగ్ వ్యవస్థ బాగా ఉపయోగ పడుతుంది.