వాస్తవాధీన రేఖను దాటి భారత సరిహద్దుల్లోకి అడుగుపెట్టిన చైనా సైనికుడిని తిరిగి చైనాకు భారత సైన్యం అప్పగించింది.
వివరాల్లోకి వెళితే పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి అడుగుపెట్టిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని భారత బలగాలు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. భారత సరిహద్దుల్లో పట్టుబడిన సైనికుడి గురించి చైనా సైన్యానికి సమాచారం అందించిన భారత సైన్యం చైనా సైనికుడిని విచారించింది. ఆ విచారణలో చైనా జవాన్ ఉద్దేశ్యపూర్వకంగా భారత భూభాగంలోకి అడుగుపెట్టలేదని తేలడంతో సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తూర్పు లద్ధాఖ్‌లోని చుషుల్-మోల్డో సరిహద్దుల వద్ద చైనా జవానును చైనా సైన్యానికి భారత ఆర్మీ అధికారులు తిరిగి అప్పగించారు.
గత సంవత్సరం అక్టోబరులో కూడా తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికుడిని భారత బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మూడు రోజుల విచారణ తరువాత పట్టుబడిన సైనికుడిని చైనా సైన్యానికి భారత సైన్యం అప్పగించింది.