Idream media
Idream media
అమెరికాలో భారతీయుల హవా తెలియంది కాదు.. ఇప్పుడు ఎన్నికల్లోనూ వారే నిర్ణయాత్మక శక్తులుగా మారారని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారా..? ఇటీవల జరిగిన నమస్తే ట్రంప్, హౌడీ మోదీ కార్యక్రమాలు దానికి సంకేతమా..? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ఉంటున్న భారతీయులను ఆకట్టుకుంటే తమ విజయం సులువవుతుందని అక్కడి రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్ పార్టీ, డెమొక్రాటిక్ పార్టీలు భావిస్తున్నాయి. ఎప్పుడూ డెమొక్రాట్లకు అండగా నిలిచే ఇండో-అమెరికన్లు ఈ సారి రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపిస్తున్నారన్న అంచనాల నేపథ్యంలో వీరిని ఆకట్టుకునేందుకు రెండు పార్టీలూ తీవ్రంగా కృషిచేస్తున్నాయి. అటు ట్రంప్.. ఇటు బిడెన్ ఇద్దరూ వారి ఓట్లు పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ..
అమెరికాలోని అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిషిగాన్, నార్త్‌కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్‌సిన్ రాష్ట్రాల్లో భారతీయ ఓటర్లు దాదాపు 13 లక్షల మంది ఉన్నారు. దీంతో రెండు ప్రధాన పార్టీలూ ఈ రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇదే విషయంపై డెమొక్రాటిక్ పార్టీ చీఫ్ థామస్ పెరెజ్ మాట్లాడుతూ.. ‘‘ఇండో-అమెరికన్లు అధికంగా ఉన్న రాష్ట్రాలను గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయాము. అదే హిల్లరీ ఓటమికి కారణమైంది. ఉదాహరణకు పెన్సిల్వేనియాలో 1.56 లక్షల మంది భారతీయ ఓటర్లు ఉన్నారు. అక్కడ 42 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం’’ అని పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలకు మరో 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇండో-అమెరికన్లు, ఆసియా-అమెరికన్లు, పసిఫిక్ ఐస్‌లాండర్లు వర్చువల్‌గా ఏర్పా టు చేసినకార్యక్రమాన్ని ఉద్దేశించి పెరేజ్ మాట్లాడారు.
వారి చూపూ ఇండో-అమెరికన్ల వైపే!
సాధారణంగా భారతీయ అమెరికన్లు డెమొక్రాటిక్ పార్టీకి అతిపెద్ద ఓటు బ్యాంకు. ఈ సారి ఈ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు మరింత పెంచుకునేందుకు యత్నిస్తున్న డెమొక్రాట్లకు చెక్ పెట్టేందుకు రిపబ్లికన్లు వ్యూహరచన చేస్తున్నారు. ఈ దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టారు. మోదీతో ఆయనకు గల సాన్నిహిత్యం, ఇటీవల జరిగిన నమస్తే ట్రంప్, హౌడీ మోదీ కార్యక్రమాలు ఇండో-అమెరికన్లను తన వైపు మొగ్గేలా చేస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు.ఇండో-అమెరికన్లు కీలకంగా ఉన్న రాష్ట్రాల్లో వారిని ఆకట్టుకునేందుకు 100 మందితో కూడిన ఓ నిపుణుల బృందం ఇప్పటికే కార్యాచరణ మొదలెట్టింది.