iDreamPost
android-app
ios-app

Nz vs Ind, Mumbai Test – రెండవ టెస్టులో భారీ విజయం.. సిరీస్‌ భారత్‌ వశం

  • Published Dec 06, 2021 | 6:28 AM Updated Updated Dec 06, 2021 | 6:28 AM
Nz vs Ind, Mumbai Test – రెండవ టెస్టులో భారీ విజయం.. సిరీస్‌ భారత్‌ వశం

రెండు టెస్టుల ఇండియా, న్యూజిల్యాండ్‌ సిరీస్‌ను ఇండియా కైవసం చేసుకుంది. తొలి టెస్టులో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న భారత జట్టు రెండవ టెస్టులో అన్నిరంగాల్లో ఆధిపత్యం సాధించి న్యూజిల్యాండ్‌ జట్టును ఓడించింది. ఒక విధంగా చెప్పాలంటే రెండవ టెస్టు ఏకపక్షంగా సాగింది.

ముంబైలో జరిగిన రెండవ టెస్టులో భారత్ విజేతగా నిలిచింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన సిరీస్‌ను 1-0 తేడాతో సొంతం చేసుకుంది. టెస్టు ప్రపంచ చాంఫియన్‌ షిప్‌ ఫైనల్స్‌లో న్యూజిల్యాండ్‌ చేతిలో పరాజయానికి భారత్‌ బదులు తీర్చుకుంది. రెండవ ఇన్నింగ్స్‌లో 540 పరుగులు భారీ లక్ష్య సాధనతో బ్యాటింగ్‌ ప్రారంభించిన కివీస్‌ జట్టు కేవలం 167 పరుగులకు ఆల్‌ ఔట్‌ అయ్యింది. దీనితో భారత్‌ 372 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు సాధించగా కివీస్‌ కేవలం 62 పరుగులకు ఆల్‌ఔట్‌ అయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల ఆధిక్యత సాధించిన భారత్‌ కివీస్‌ జట్టును ఫాలో ఆన్‌ ఆడించే అవకాశమున్నా రెండవ ఇన్నింగ్స్‌ ఆరంభించింది. మూడవ రోజు టీ బ్రేక్‌ ముందుకు ఏడు వికెట్లకు 276 పరుగులు చేసి ఇన్సింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

దీనితో కివీస్‌ ముందు 540 భారీ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్‌ బ్యాటింగ్‌ చూసినవారికి, ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో వారు సాధించిన స్కోర్‌ చూసినవారికి ఈ లక్ష్యం దాటడం అసాధ్యమని తేల్చారు. ఇక రెండున్నర రోజులు బ్యాటింగ్‌ చేయడం కూడా సాధ్యంకాదని, భారత్ గెలుపు లాంఛనమేనని మూడవ రోజు మధ్యాహ్నమే తేలిపోయింది. దీనికి తగ్గట్టుగానే కివీస్‌ జట్టు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి. 140 మాత్రమే చేసింది. దీనితో నాల్గవ రోజు లంచ్‌ బ్రేక్‌ సమాయానికి మ్యాచ్‌ ముగుస్తుందని క్రీడా పండితులు అంచనా వేశారు. అంతకన్నా ముందే కివీస్‌ ఆల్‌ ఔట్‌ అయ్యింది.

న్యూజిల్యాండ్‌ జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో మూడవ రోజు ఆటమొదలు పెట్టి కేవలం 27 పరుగులకే మిగిలిన వికెట్లు కోల్పోయింది. కివీస్‌ జట్టులో డేరి మిచెల్‌ 60 పరుగులు, నికోల్స్‌ 44 పరుగులు సాధించారు. 165 వద్ద ఆరవ వికెట్‌ కోల్పోయిన కివీస్‌ జట్టు 165 వద్ద ఏడు, ఎనిమిది వికెట్లు, 167 వద్ద తొమ్మిది, పది వికెట్లు కోల్పోవడం విశేషం. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి చివరి నాలుగు వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. నాల్గవ రోజు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు గాను నాలుగు వికెట్లు జయంత్‌ యాదవ్‌ పడగొట్టడం విశేషం. భారత్ జట్టులో రవీంద్ర అశ్విన్‌ మరోసారి నాలుగు వికెట్లు తీశాడు. అతను తొలి ఇన్నింగ్స్‌లో కూడా నాలుగు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

అజాజ్‌కు 14 వికెట్లు:

తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు సాధించి ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్షించిన అజాజ్‌ పటేల్‌ రెండవ ఇన్నింగ్స్‌లో పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో అతను నాలుగు వికెట్లు తీశాడు. మొత్తం మీద ఈ టెస్టులో అజాజ్‌ 225 పరుగులు ఇచ్చి 14 వికెట్లు తీయడం విశేషం. గతంలో ఆ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ ఆస్ట్రేలియాపై 123 పరుగులు ఇచ్చి 15 వికెట్లు తీయడం అత్యత్తమ ప్రదర్శనగా నిలిచింది.

భారీ ఆధిక్యతతో గెలవడం ఇదే తొలిసారి:

భారత్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇంతటి భారీ ఆధిక్యతతో గెలవడం ఇదే తొలిసారి. ఇంత వరకు భారత్‌ సౌత్‌ ఆఫ్రికాపై 337 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2015 డిసెంబరులో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ ఫీట్‌ సాధించింది. ఆ రికార్డును న్యూజిల్యాండ్‌ మ్యాచ్‌పై తిరగరాసింది. మొత్తం టెస్టు మ్యాచ్‌ల చరిత్రలో ఇంగ్లాండ్‌ జట్టు ఆస్ట్రేలియాపై ఏకంగా 675 పరుగుల తేడాతో గెలవడం ఇప్పటి వరకు రికార్డుగా ఉంది.

Also Read : Nz Vs Ind Second Test – రెండవ టెస్టు… రికార్డుల మోత