iDreamPost
android-app
ios-app

India vs South Africa, Freedom Series, First Test – బోణీ కొట్టిన భారత్‌

  • Published Dec 30, 2021 | 2:32 PM Updated Updated Dec 30, 2021 | 2:32 PM
India vs South Africa, Freedom Series, First Test – బోణీ కొట్టిన భారత్‌

ఫ్రీడమ్‌ ట్రోఫీలో భారత్‌ బోణీ కొట్టింది. సఫారీ గడ్డపై తొలి టెస్టును గెలుచుకుంది. ఈ గడ్డ మీద ఇప్పటి వరకు 20 టెస్టులు ఆడగా, భారత్‌కు ఇది నాల్గవ విజయం. తొలి ఇన్నింగ్స్‌లో రాహూల్‌ సెంచరీ సాధించడం, షమీ ఐదు వికెట్లు సాధించడంతో పాటు రెండవ ఇన్నింగ్స్‌లో మరో మూడు వికెట్లు సాధించడంతో భారత్‌ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ తన బ్యాటింగ్‌తో భారత్‌ విజయాన్ని అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మూడు టెస్టుల ఫ్రీడమ్‌ ట్రోఫీలో తొలి టెస్టు గెలవడం ద్వారా భారత్‌కు సిరీస్‌ మీద ఆశలు రేకెత్తాయి.

సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు మీద భారత్‌ అన్ని విభాగాల్లోను ఆధిపత్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లోనే కాకుండా.. రెండవ ఇన్నింగ్స్‌లో కూడా భారత్‌ బౌలర్లు రాణించడంతో భారత్‌ జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 305 పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 191 పరుగులకే ఆల్‌ఔట్‌ అయ్యింది. ఐదు రోజుల టెస్టులో ఒక రోజు వర్షం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయినా భారత్‌ జట్టు విజేతగా నిలవడం విశేషం. 94 పరుగులకు నాలుగు వికెట్ల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్‌ ఆరంభించింది. చేతిలో ఆరు వికెట్లు… 211 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా జట్టు ఇన్నింగ్స్‌ ఆరంభించింది. కెప్టెన్‌ ఎల్గర్‌ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌ చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ నిలబడకపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

కెప్టెన్‌ ఎల్గర్‌ 77 పరుగులు (12I4) చేశాడు. ఎల్గర్‌ వికెట్‌ను బుమ్రా తీయడంతో దక్షిణాఫ్రికా పతనం ఆరంభమైంది. తరువాత నుంచి వికెట్లు టపటపా రాలిపోయాయి. కేవలం బవుమా మాత్రమే 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డీకాక్‌ 21, మల్డర్‌ 1, జాన్సన్‌ 13లు చేసి ఔట్‌ కాగా, రబడ, ఎన్గిడిలు సున్నా పరుగులకే వెనుదిరిగారు. భారత్‌ బౌలింగ్‌లో షమీ మరోసారి రాణించాడు. తొలి ఇన్సింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అతను, రెండవ ఇన్నింగ్స్‌లో 63 పరుగుల ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. బుమ్రా 50 పరుగులకు మూడు వికెట్లు, సిరాజ్‌ 47 పరుగులకు రెండు వికెట్లు, అశ్విన్‌ 18 పరుగులకు రెండు వికెట్లు సాధించి భారత్‌కు విజయాన్ని అందించారు. 

ఇది నాల్గవ విజయం:

సౌత్‌ ఆఫ్రికాలో భారత్‌ ఇప్పటి వరకు 20 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, ఇప్పటి వరకు కేవలం మూడు టెస్టులు మాత్రమే గెలిచింది. తాజాగా సెంచూరియన్‌ గెలుపుతో విజయాల సంఖ్య నాలుగుకు చేరింది.

2006-07లో సౌత్‌ ఆఫ్రికా గడ్డపై భారత్‌ తొలిసారి గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు భారత్‌ గెలవగా, మిగిలిన రెండు టెస్టులు సౌత్‌ ఆఫ్రికా గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది.

2010-11లో మూడు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు సౌత్‌ ఆఫ్రికా గెలుచుకోగా, రెండవ టెస్టు భారత్‌ గెలిచింది. మూడవ టెస్టు డ్రా కావడంతో సిరీస్‌ డ్రా అయ్యింది.

2017-18లో మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు సౌత్‌ ఆఫ్రికా గెలుచుకోగా, మూడవ టెస్టు భారత్‌ గెలిచింది. టెస్టు సిరీస్‌ను సౌత్‌ ఆఫ్రికా 2-1 తేడాతో గెలుచుకుంది.

తాజాగా తొలి టెస్టు సాధించిన భారత్‌ మిగిలిన రెండు టెస్టులను కనీసం డ్రా చేసుకున్నా… సఫారీ గెడ్డపై తొలిసారి సిరీస్‌ చేజిక్కుంచుకునే అవకాశం దక్కుతుంది.

Also Read : రసకందాయంలో తొలి టెస్టు