Idream media
Idream media
భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచీ కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు చర్చలు.. మరోవైపు శత్రవును ఆర్థికంగా దెబ్బ తీయడం.. ఇంకోవైపు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేలా సైన్యాన్ని సిద్ధం చేయడం.. ఇలా త్రిముఖ వ్యూహాలతో భారత్ రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నారు ప్రధాని మోదీ. ఎప్పటికప్పుడు త్రివిధ దళాలతో చర్చిస్తూ సరిహద్దులను పటిష్టం చేయడమే కాకుండా మరోవైపు చైనాపై నిషేధాస్ర్తాలు ప్రయోగిస్తున్నారు. ఆ విషయంలో కూడా మోదీ చైనా ఊసెత్తకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. భారతీయుల వ్యక్తిగత గోప్యతకూ, డేటా భద్రతకూ, దేశ సార్వభౌమత్వానికి ముప్పు పేరిట చైనాకు సంబంధించిన యాప్ లను నిషేధిస్తూ వెళ్తున్నారు. ఆర్థికంగా పతనం చేసి దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
డిజిటల్ స్రైక్
రెండు నెలలక్రితం 59 యాప్‌లు, జూలై నెలాఖరున 47 యాప్‌లు నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా బుధవారం ఆ దేశానికే చెందిన మరో 118 యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. దీని వల్ల చైనాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లడం ఖాయం. డిజిటల్ రంగంలో సూపర్ పవర్‌గా ఎదగాలని బలంగా వాంఛిస్తున్న చైనాకు చెక్ పెట్టడానికి ఇది తోడ్పడుతుందని ఆ రంగంలోని నిపుణుల భావన. అలాగే వేరే దేశాలు సైతం ఇదే బాట పడితే తమ ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నామన్న అభిప్రాయం అక్కడి టెక్ కంపెనీల్లో, నిపుణుల్లో ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే చైనా ఇప్పటికే కాస్త దిగొచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ డ్రాగన్ మాటలొకలా.. బుద్ధి మరొకలా ఉండడాన్ని పసిగట్టిన భారత్ అన్ని విధాలుగానూ బలోపేతం అవుతోంది.
చర్చలు
కేంద్రం తీసుకుంటున్న నిషేధాస్ర్తాలు పని చేస్తున్నట్లే కనిపిస్తున్నాయి. మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సమావేశంలో చైనా రక్షణ శాఖ మంత్రి వే ఫెంఝీ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యేందుకు అవకాశం కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. చైనా ప్రతిపాదనపై ఇప్పటి వరకు భారత్ అధికారికంగా స్పందించలేదు. కానీ, ఫెంఝీతో సమావేశానికి కేంద్రం కచ్చితంగా ఓకే అనేట్లు ఉంది. ఈ మేరకు కేంద్రం కూడా సానుకూల సంకేతాలు పంపుతోంది. మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య సదస్సులో ముందుగా భారత్-చైనా రక్షణమంత్రులు సరిహద్దు వివాదాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చైనా రక్షణమంత్రి వీ నుంచి ఆహ్వానం అందింది. సరిహద్దు తగాదాలపై చర్చలు కేంద్రం నుంచి సానుకూలత ఉండటంతో రాజ్‌నాథ్ దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత్ ఎప్పుడూ శాంతే కోరుకుంటుందని, చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని సంకేతాలు ఇస్తోంది. ఉద్రిక్తతలు చల్లారడానికి చర్చల ద్వారా తన ప్రయత్నం చేస్తూనే ఉంది.
సర్వ సన్నద్ధం
శాంతి.. శాంతి.. అని కేవలం చర్చలు జరుపుతూ కూర్చుని ఉంటే సరిపోదని కేంద్రం భావిస్తోంది. ఎటువంటి పరిస్థితులునైనా ఎదుర్కొనేలా సరిహద్దుల్లో సైన్యాన్నిసన్నద్ధం చేస్తోంది. చైనా భారీ ఆయుధాల కదలికను భారత సైన్యం ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కుంగ్ నుండి ముక్పారికి వెలుపల చైనా సైన్యం మోహరించింది.
మరోవైపు భారత సైన్యం యుద్ధ ట్యాంకులతో అదనపు దళాలతో ఈ ప్రాంతంలో వివాదాస్పద ఎల్‌ఏసీ ప్రాంతం వెంబడి మోహరించింది. చైనా సాయుధ దళాలను ట్యాంక్ విధ్వంస క్షిపణులు, రాకెట్లు, ఇతర ఆయుధాలతో తిప్పికొట్టేలా భారత్ ఈ ప్రాంతంలో సర్వసన్నద్ధమైంది. తూర్పు లడఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారత్ క్షిపణి సహిత టీ-90 యుద్ధ ట్యాంకులు, టీ-72ఎం1 ట్యాంకులను సిద్ధం చేసింది. మరోవైపు ఇరు పక్షాల వైమానిక దళాలు సైతం ఎల్‌ఏసీపై పహారా కాస్తున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితి కొంతమేర ఉద్రిక్తంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే శుక్రవారం పేర్కొన్నారు. మన భద్రత కోసం ముందస్తుగా దళాల మోహరింపును చేపట్టామని చెప్పారు.