కరోనావైరస్ మహమ్మారి అనేక విధాలుగా ప్రపంచాన్ని కుదిపేసి ప్రజలను తమ ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యేలా చేసింది. దీంతో లాక్ డౌన్ ప్రభావంతో ఇంటికే పరిమితమయిన జనం సోషల్ మీడియాను విపరీతంగా వాడటం మొదలు పెట్టారు. ముఖ్యంగా టిక్‌టాక్ వంటి అప్లికేషన్ ను మునుపెన్నడూ లేని విధంగా వాడటం మొదలు పెట్టినట్టు, టిక్‌టాక్ అప్లికేషన్ ను యాప్ స్టోర్ మరియు ప్లే స్టోర్ నుండి 2 బిలియన్ సార్లు డౌన్‌లోడ్ చెసినట్టు తాజా నివేదికల ప్రకారం తెలుస్తుంది.
సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం, టిక్ టాక్ 2020 మొదటి త్రైమాసికంలో 1.5 బిలియన్ మార్కును అధిగమించిన వెంటనే 2 బిలియన్ మార్కును దాటింది. ఇలా పెరుగుదలకు లాక్ డౌన్ ప్రభావంతో టిక్‌టాక్ కు జనాదరణ పెరిగిందని, ప్రజలు టిక్‌టాక్ చాలా వినోదాత్మకంగా ఉపయోగిస్తున్నారని నివేదిక వెల్లడించింది. 1.5 బిలియన్ మార్కును అధిగమించి 2 బిలియన్లకు చేరిన టిక్ టాక్ వినియోగదారుల్లో అత్యధికంగా 611 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్లతో భారత్ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది.
ఈ టిక్ టాక్ అప్లికేషన్ ను చైనాకు చెందిన సంస్థ డెవలప్ చేసినా దాని ఉపయోగించే వారి సంఖ్య చైనాలో కన్నా భారత్ లో ఎక్కువగా ఉండటం విశేషం. నివేదికల ప్రకారం ఈ టిక్ టాక్ వాడేవారిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారత్ నిలవగా రెండవ స్థానంలో చైనా, 3వ స్థానంలో అమెరికా ఉనట్టు తెలుస్తుంది. దీనిప్రకారం మొత్తం ప్రపంచంలో ఉన్న టిక్ టాక్ అప్లికేషన్ ను వాడుతున్న వారిలో 30.3% మంది భారతదేశానికి చెందిన వారు అవ్వడం గమనార్హం.
సరిగ్గా ఏడాది క్రితం ఈ అప్లికేషన్ చిన్నపిల్లకు హాని చేస్తుందని చెబుతూ మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిషేధించడంతో రెండు వారాల పాటు ఈ అప్లికేషను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం గూగుల్ ప్లే స్టోర్ , ఆపిల్ స్టొర్ నుంచి తొలగించారు. అయితే కోర్టుకు కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన హామిల మేరకు తిరిగి కోర్టు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇలా మొదట్లో భారత్ లో ఒడిదుడుకులు ఎదుర్కున్న ఈ అప్లికేషన్ ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ లో తన మార్కెట్ ను పెంచుకోవడంలో విజయం సాధించడం గమనార్హం.