భారత భూభాగంలోకి పొరపాటున తప్పిపోయి వచ్చిన చైనా సైనికుడిని భారత్ తిరిగి చైనాకు అప్పగించింది. ప్రోటోకాల్ ప్రకారం బుధవారం చుషూల్-మోల్దో మీటింగ్ పాయింట్ వద్ద చైనా బలగాలకు సైనికుడిని భారత్ అప్పగించింది.
వివరాల్లోకి వెళితే తప్పిపోయిన తన జడలబర్రె కోసం వెతుకుతూ వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఒక చైనా సైనికుడిని భారత సైన్యం గుర్తించి అదుపులోకి తీసుకుంది. గతంలో గల్వాన్ లోయలో భారత్ – చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణలో 22 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చైనా సైనికుడు భారత సేనలకు పట్టుబడడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా తప్పిపోయిన తమ సైనికుడిని తిరిగి అప్పగించాలంటూ చైనా భారత్‌ను విజ్ఞప్తి చేసింది. అయితే వైద్య పరీక్షలు నిర్వహించాక ప్రోటోకాల్‌ను అనుసరించి చైనాకు అప్పగిస్తామని భారత్ వెల్లడించింది. హామీ ఇచ్చిన ప్రకారమే ప్రోటోకాల్ ప్రకారం తిరిగి చైనా సైనికుడిని వాళ్ళ సైన్యానికి అప్పగించింది. కాగా తమకు అప్పగించిన చైనా సైనికుడిని క్షుణ్నంగా తనిఖీ చేసి తమ దళంలోకి తిరిగి తీసుకున్నారు. క్షేమంగా సైనికుడిని అప్పగించిన భారత్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.