iDreamPost
android-app
ios-app

కరోనా విరామం తర్వాత భారత్ తొలి క్రికెట్ సిరీస్ రేపే ప్రారంభం

కరోనా విరామం తర్వాత భారత్ తొలి క్రికెట్ సిరీస్ రేపే ప్రారంభం

కరోనా మహమ్మారి కారణంగా దక్షిణాఫ్రికాతో అర్థాంతరంగా ఆగిపోయిన వన్డే సిరీస్ తర్వాత భారత్ శుక్రవారం ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఆడనుంది. సిడ్నీ వేదికగా రేపు జరిగే తొలి వన్డేతో కోహ్లీసేన సుదీర్ఘ పర్యటనని ప్రారంభించనుంది. కాగా సిడ్నీ మైదానంలో టీమిండియా గత పరిమిత ఓవర్ల మ్యాచ్ రికార్డులు అభిమానులను గాభరా పరుస్తున్నాయి.

2018-19 సీజన్‌లో సొంత గడ్డపై ఆసీస్‌ని నిలవరించిన టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్‌ గెలుపొందింది. గత ఆస్ట్రేలియా పర్యటనలో కంగారును ఖంగు తినిపించిన భారత్ వన్డే సిరీస్‌తోపాటు టెస్టు సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది.అయితే పొట్టి క్రికెట్ ఫార్మేట్ టీ-20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ఇక అప్పటివరకు సొంత గడ్డపై భారత్‌ చేతిలో ఒక్క సిరీస్‌లోను ఓడిపోని ఆస్ట్రేలియాకు తొలిసారి పరాభవం ఎదురవ్వడం గమనార్హం.

ఇదిలా ఉంటే సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన భారత్ 14 మ్యాచ్‌లలో ఓడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది.అలాగే ఆసీస్‌తో మ్యాచ్ అంటే చెలరేగి పరుగులు సాధించే భారత సారథి కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఈ మైదానం అచ్చిరాలేదు.ఆసీస్ గడ్డపై మంచి గణంకాలను నమోదు చేసిన కోహ్లీ ఈ మైదానంలో అత్యంత పేలవమైన ప్రదర్శన చేశాడు.కంగారుల గడ్డపై వన్డేలలో 50.17 సగటుతో 1154 పరుగులు సాధించిన కోహ్లీ సిడ్నీలో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో 9 పరుగుల సగటుతో కేవలం 36 రన్స్ మాత్రమే చేశాడు. ఈ వేదికపై రన్ మిషన్ కోహ్లీ అత్యధిక పరుగులు 21 కావడం అభిమానులను కలవర పెడుతుంది.

ఇక గణాంకాలు ఎలా ఉన్నప్పటికీ వన్డే సిరీస్‌లో కోహ్లీ సేన బోణీ కొట్టిన ఈ లెక్కలను సరి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు గత సిరీస్‌లో టీమిండియా చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే కసితో ఆసీస్ బరిలో దిగుతోంది.

ఐపీఎల్-2020లో ఆర్‌సీబీ తరపున కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన ఆసీస్ వన్డే సారధి ఆరోన్ ఫించ్ వన్డే సిరీస్‌లో విరాట్‌ను కట్టడి చేసేందుకు వ్యూహాలు రచించనున్నాడు.ఇక మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటం ఆస్ట్రేలియా బలాన్ని పెంచింది.హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సేవలు భారత్ కోల్పోవడం కొంత ప్రతికూల అంశం. కాగా ఐపీఎల్‌లో విశేషంగా రాణించిన యువ బ్యాట్స్‌మన్‌లు తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండడం భారత్‌కి కలిసి రానుంది.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సమవుజ్జీ లాంటి భారత్-ఆసీస్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో పైచేయి ఎవరిదో తెలుసుకోవడానికి కొద్ది గంటలు వేచి చూడక తప్పదు మరి..