iDreamPost
android-app
ios-app

ప్రజలు గెలిపించారు – కుటుంబం ఓడించింది ..ఎన్టీఆర్

  • Published Jan 18, 2022 | 6:27 AM Updated Updated Mar 11, 2022 | 10:23 PM
ప్రజలు గెలిపించారు – కుటుంబం ఓడించింది ..ఎన్టీఆర్

ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయన సినిమాలు ప్రభంజనమే. ఆయన రాజకీయాలు ప్రభంజనమే. ఆయన ప్రసంగాలు కూడా ప్రభంజనమే. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన నాయకుడు ఎన్టీఆర్. అయితే ఆ సమాజం ఆయనకు గుండె గుండెల్లో దేవాలయాలు నిర్మించింది. ఆ ప్రజలే ఆయనను దేవుడుగా కొలిచారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ ఒక సంచలనం. ఒక ప్రభంజనం. ఆయన రాజకీయాల్లోకి రావడమే ఒక సంచలనం. యావత్ భారతదేశంలో అప్పటివరకూ తిరుగులేని రాజకీయ ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఆ చీలిక ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత ఎక్కువగా ఉంది. రెడ్డి కాంగ్రెస్ ఒక వైపు, ఇందిరా కాంగ్రెస్ మరోవైపు. రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్ అధికారంలో ఉంది. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేశారు. 

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాదెండ్ల భాస్కర రావు భిన్నమైన ఆలోచనలో ఉన్నారు. అప్పటి కాంగ్రెస్ చీలికలు ఆయనలో ప్రత్యామ్నాయ ఆలోచనలు రేకెత్తించాయి. ఈ పరిస్థితుల్లో నాదెండ్ల భాస్కరరావుకు ఈనాడు యజమాని రామోజీరావు జతకలిశారు. ఈ ఇద్దరికీ ఎన్టీఆర్ తోడయ్యారు. అప్పటికే ప్రత్యామ్నాయ ఆలోచనలతో సంసిద్ధంగా ఉన్న భాస్కరరావు, ఈనాడు వంటి విస్తృత మీడియా ప్లాట్ ఫార్మ్ ఉన్న రామోజీరావు కలిసి విస్తృత అభిమానుల బలం ఉన్న ఎన్టీఆర్ ను తెరముందు నిలబెట్టారు. నిర్మాణం నాదెండ్ల చేస్తుండగా, ప్రచారం ఎన్టీఆర్ చేస్తుంటే వాటికి తన మీడియా ద్వారా మరింత బలం చేకూర్చారు రామోజీరావు. మొత్తానికి ఈ ముగ్గురి ప్రయత్నాలు ఫలించి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ 1983 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి సరికొత్త చరిత్రకు అంకురార్పణ చేసింది. 

ఈ క్రమంలోనే రామోజీరావు, ఎన్టీఆర్ కలిసి టీడీపీని గుప్పిట్లో పెట్టుకున్నారు అనే భావన నాదెండ్లకు కలిగింది. పార్టీ ఏర్పాటులో, పార్టీ నిర్మాణంలో తనది కీలక పాత్ర అయినప్పటికీ తనను నామమాత్రం చేశారు అనే భావం నాదెండ్లలో పేరుకుపోయింది. ఈ భావనే నాదెండ్ల తిరుగుబాటుకు దారితీసింది. అయితే ఆ తిరుగుబాటును ప్రజాదరణ కలిగిన ఎన్టీఆర్, ఈనాడు మీడియా మద్దతుతో రామోజీరావు కలిసి నాదెండ్లను పక్కనబెట్ట గలిగారు. పార్టీ, అధికారం రెండూ తిరిగి ఎన్టీఆర్ చేతిలోకి వచ్చాయి. అప్పట్లో ప్రజల మద్దతు కూడా ఎన్టీఆర్ కే ఉండేది. అందుకే ప్రజాక్షేత్రంలో ఎన్టీఆర్ తిరుగులేని నాయకుడిగా నిలబడడంతో రాజకీయ క్షేత్రంలో పావులు కదిపిన నేతలు తలొగ్గాల్సి వచ్చింది. 

Also Read : నారా లోకేష్‌ కు కరోనా

నాదెండ్ల  సంఘటన తర్వాత ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. దేశంలో కాంగ్రెస్సేతర రాజకీయ పార్టీలు, నాయకులను ఆయన ఏకం చేశారు. కాంగ్రెస్సేతర పార్టీల ఐక్యత 1977లో విఫలం అయినప్పటికీ తిరిగి నేషనల్ ఫ్రంట్ పేరుతో ఎన్టీఆర్ మరోసారి విజయం చేకూర్చారు. ఇంటగెలిచి, రచ్చ గెలిచిన ఎన్టీఆర్ రాష్ట్రంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ అందరి ఆదరణ పొందుతున్న ఎన్టీఆర్ మాత్రం కుటుంబంలో నిరాధారణే ఎదుర్కొన్నారు. 

భార్య బసవతారకం మరణం తర్వాత ఎన్టీఆర్ కుటుంబంలో ఏకాకి అయ్యారు.అంతమంది సంతానంలో ఏ ఒక్కరూ ఆయనకు చేరువ కాలేదు. అధికారికంగా పార్టీ నేతలు కానీ, అధికారులు కానీ ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నా, ఆత్మీయత పంచుకునే కుటుంబసభ్యులు ఒక్కరూ లేకపోయారు. అందుకే అందరూ ఉండీ ఎవరూ లేని అనాథ అయ్యారు ఎన్టీఆర్. ఆ వయసులో ఆయనకు దక్కాల్సిన ప్రేమాభిమానాలు ఎన్టీఆర్ కు బసవతారకం మరణం తర్వాత కరువయ్యాయి. ఓ రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఇల్లు ఒక రాజకీయ అనాథాశ్రమం అయింది. అందులో ఆయనే బంధీ అయ్యారు. 

ఇలాంటి పరిస్థితుల్లోనే లక్ష్మీపార్వతి పరిచయం ఎన్టీఆర్ ఒంటరితనాన్ని గెలుచుకుంది. భార్య, పిల్లలు లేని ఎన్టీఆర్ కు ఒక తోడు దొరికింది. ఆ వయసులో ఆ తోడు అవసరం. లక్ష్మీపార్వతిని తప్పు పట్టాలంటే తల్లిలేకపోయినా ఆ వయసులో తండ్రి ఒంటరిగా ఉన్నారు అనే స్పృహ కోల్పోయిన కుటుంబ సభ్యులను తప్పుపట్టాలి. కానీ చంద్రబాబు నాయుడి రాజకీయం లక్ష్మీపార్వతినే దోషిగా నిలబెట్టింది. లక్ష్మీపార్వతిపై రాజకీయ, మానసిక వత్తిడి తెచ్చిపెట్టింది. మొదట లక్ష్మీపార్వతిని దోషిగా నిలబెట్టిన రాజకీయమే, తర్వాత ఎన్టీఆర్ ను కూడా దోషిగా నిలబెట్టి తిరుగుబాటుకు తెరలేపింది. ఆ తిరుగుబాటు ఎన్టీఆర్ కు ఘోర అవమానం మిగిల్చింది. 

చంద్రబాబు రాజకీయం ఎన్టీఆర్ కు  లక్ష్మీపార్వతిని  మాత్రమే మిగిల్చి కుటుంబాన్ని దూరం చేసింది. ఎన్టీఆర్ కు రాజకీయం లేకుండా చేసింది. ఎన్టీఆర్ కు అధికారం లేకుండా చేసింది. చివరికి ఎన్టీఆర్ కు మనశ్శాంతి కూడా లేకుండా చేసింది. పులిలా బ్రతికిన ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడి స్వార్థం కారణంగా అనామకుడిగా మిగిలిపోయారు. అవమానం చెందారు. అవమానింపబడ్డారు. చివరికి ప్రజలకు దేవుడు అయిన ఎన్టీఆర్ కుటుంబానికి విలన్ అయ్యారు. ప్రజలు ఆయన్ను రాముడు, కృష్ణుడు అంటుంటే కుటుంబం ఆయన్ను రావణుడు, కంసుడు అంది. అది చాలా అవమానం. ఆయనకు మానసిక వేదన మిగిల్చింది. ఆ వేదనే చివరికి ఆయన ఊపిరిని తీసుకెళ్ళింది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ చరిత్రను వక్రీకరించాలని ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదు. 

సమాజం మొత్తం దేవుడుగా భావించే ఎన్టీఆర్ చివరికి కుటుంబ సభ్యులు దెయ్యంగా భావించినప్పుడు ఆగిన గుండె నేటికి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ యుగపురుషునికి నివాళి.

Also Read :, చంద్రబాబుకు కరోనా పాజిటివ్..