Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఉనికి కోసం పాకులాడుతోందా..? అంటే అవునన్నట్లుగానే కనిపిస్తున్నాయి పార్టీ విధానాలు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలనా అనుభవం ఉన్న నేత ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ ఇప్పుడు కేవలం ఉనికి కోసమే కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. కాషాయిరంగు పులుముకున్న పసుపు దళం ప్రయత్నాలు ఫలించకపోవడం.. ఒక్కో నేత పార్టీ నుంచి జారుకుంటుండడంతో ఎలాగైనా టీడీపీని నిలబెట్టుకోవాలనే తపన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందుకు కొత్త కొత్త దారులను వెదుకుతోంది. దానిలో భాగంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై కమిటీల రాజకీయానికి తెరతీసింది. ఈ కమిటీలు ఏం చేస్తాయి..? నిజంగా నిజ నిర్ధారణ చేస్తాయా..? దానిపై నిలబడతాయా..? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
మరి అమరావతి భూ దందాపై కమిటీ ఏది..?
కార్మికశాఖ మంత్రి జయరాం భూదందాపై కమిటీ వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. సభ్యులుగా బీటెక్ రవి, బీటీ నాయుడు, ప్రభాకర్‌చౌదరి, కె.ఈరన్నను నియమించింది. ఇప్పటికే జయరాం తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఆ భూమికి సంబంధించి అన్నీ సక్రమంగా ఉండడంతో 100 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీనిలో ఏదో అవకతవకలు ఉన్నట్లు అనుమానం రావడంతో ఆస్పిరి పోలీస్ స్టేషన్లో ఆయనే కేసు కూడా పెట్టినట్లు కూడా వివరించారు. అయినప్పటికీ నిజ నిర్దారణ పేరుతో టీడీపీ ఇప్పుడు కమిటీ వేయడం వెనుక ఆంతర్యం వారికే తెలియాలి. ఒకవేళ నిజంగా మంత్రి దందా కు పాల్పడ్డారనే అనుకుందాం. భూ దందాలపై మాట్లాడే అర్హత టీడీపీకి ఉందా..? అనేదే అసలు ప్రశ్న. అమరావతిలో జరిగిన స్కాంలపై టీడీపీ నేతల బాగోతాలు బయటపడుతున్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ముందుగా తమ పార్టీ నేతలపై కమిటీలు వేసి చర్యలు తీసుకోవాలి. కానీ టీడీపీ గురువింద నీతి ప్రదర్శిస్తూ విమర్శల పాలవుతోంది.
గాజువాక ఘటనపై కమిటీ
గాజువాక అత్యాచార ఘటనపై.. కూడా నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకటరావు. నిజ నిర్ధారణ కమిటీలో.. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతోపాటు పుచ్చా విజయ్ కుమార్, ఇతలపాక సుజాత, బడుమురి గోవిందులు సభ్యులుగా నియమించారు. ఉంటరాన్నారు. అత్యాచార సంఘటనల్లో నిందితులను రక్షించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో దీన్ని రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం టీడీపీలో కనిపిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాగం స్పందించింది. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది. అయినప్పటికీ పదే పదే ఈ ఘటనను తెరపైకి తెచ్చి బాధిత కుటుంబ ఆవేదనను తెలుగుదేశం పెంచుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.