Idream media
Idream media
ఆగస్టు 30,1997 ఉదయం నుంచి పారిస్ లోని రిట్జ్ హోటల్ గేటు ముందు ఫోటోగ్రాఫర్లూ, వీడియో గ్రాఫర్లూ మకాం వేసి ఉన్నారు హోటల్లో ఉన్న యువరాణి ఫోటో ఒకటైనా సంపాదించాలని వీరి ఆశయం. ఈ బృందంలో ఎక్కువ మంది పాపరాజ్జి. వీళ్లు ఏ పత్రికలో, వార్తా సంస్థలో ఉద్యోగులు కాదు. ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్లు. పాఠకులకు నచ్చే ఫోటోలు తీసి వార్తా సంస్థలకు అమ్ముకుంటారు. తమకు కావలసిన ఫోటోల కోసం వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఎంత దూరమైనా వెళ్తారు. ఎవరికీ కనిపించకుండా దూరంగా దాగి, జూమ్ లెన్సులు వాడి ఫోటోలు తీయడం, కార్ల, బైకులలో వెంబడించి ఫోటోలు తీయడం లాంటి న్యూసెన్సుకు కూడా వెనుకాడరు.
ఆ హోటల్లో ఉన్నది బ్రిటన్ మాజీ యువరాణి. ఆమె అంతకు ముందే చాలా పాపులర్. బ్రిటన్ యువరాజు ఛార్లెస్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. అందులోనూ ఇప్పుడు హోటల్లో సాక్షాత్తు తన ప్రియుడితో కలిసి ఉంది. ఇద్దరినీ కలిపి ఒక ఫోటో తీసినా కోరుకున్న మొత్తానికి కొనడానికి పత్రికలూ, సంస్థలూ రెడీగా ఉంటాయని అక్కడ కాపు కాసిన వారికి తెలుసు. అందుకే ఉదయాన్నే వచ్చి, రాత్రి అవుతున్నా ఓపికగా వేచి చూస్తున్నారు.
బ్రిటన్ మాజీ యువరాణి డయానా తన ప్రియుడు దోడీ ఆల్ ఫాయేద్ తో కలిసి ఇటలీ దగ్గర ఉన్న సార్డీనియా ద్వీపం పక్కన సముద్రంలో అతని విలాసవంతమైన ఓడలో వారం రోజులు గడిపి, లండన్ తిరిగి వెళ్తూ రెండు రోజులు పారిస్ లో గడపాలని అతని కుటుంబానికి చెందిన హోటల్ రిట్జ్ లో దిగారు. అయితే ఆమె ఫోటోల కోసం హోటల్ బయట కాపు కాచి ఉన్న ఫోటోగ్రాఫర్ల వల్ల ఇతర అతిధులకు ఇబ్బంది కలగకూడదని పక్కనే ఉన్న అతనికే చెందిన అపార్టుమెంటుకు మారాలనుకున్నారు.
పాపరాజ్జిని తప్పుదారి పట్టించడానికి అర్ధరాత్రి సమయంలో డయానా, ఆమె ప్రియుడు పారిస్ లో వాడుతున్న నల్లరంగు మెర్సిడెస్ కారు ముందు గేటులో నుంచి బయటకు వెళ్ళింది. దానికోసం వేచి ఉన్న ఫోటోగ్రాఫర్లందరూ మోటారు సైకిళ్ళ మీద దాని వెనకే వెళ్ళారు. కాసేపటికి డయానా, దోడీలు ఉన్న మరో నల్లరంగు మెర్సిడెస్ హోటల్ వెనక గేటు నుంచి బయటకు వచ్చింది. ఈ ప్లాను గురించి హోటల్ సిబ్బందికి లంచాలు ఇచ్చి తెలుసుకున్న కొందరు కెమెరాలతో ఆ గేటు వద్ద కాపు కాచి కారును వెంబడించారు. వారిని తప్పించడానికి కారు డ్రైవర్ వేగం పెంచాడు. వారిని వెంబడిస్తున్న పాపరాజ్జి కూడా వేగం పెంచి కారును వదలకుండా వస్తున్నారు.
హాలీవుడ్ సినిమా లెవల్లో ఛేజ్ చేసుకుంటూ ముందు మెర్సిడెస్ కారు, వెనక మోటారు సైకిళ్ల మీద ఫోటోగ్రాఫర్లూ గంటకు యాభై కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉన్న ఒక టన్నెల్ లోనికి అంతకు మూడింతల వేగంతో ప్రవేశించారు. ఆ వేగంలో డయానా ప్రయాణిస్తున్న కారు వేరొక కారును ఢీకొట్టి, గాలిలోకి ఎగిరి టన్నెల్ గోడను బలంగా ఢీకొట్టింది.
సమస్యాత్మక బాల్యం
కొన్ని తరాలుగా బ్రిటిష్ రాచకుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కుటుంబంలో పుట్టిన డయానా ఆమె ఆరవ ఏట తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో కొన్ని రోజులు తల్లి దగ్గర, మరికొన్ని రోజులు తండ్రి దగ్గర పెరుగుతూ ఉండగా, తండ్రి కోర్టు ద్వారా ఆమె పూర్తిగా తన దగ్గర పెరిగేలా ఆర్డరు తెచ్చుకున్నాడు. ఆమె పదమూడవ ఏట ఆమె తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన సవతితల్లితో ఢయానాకు పడేది కాదు. ఇలా సమస్యల్లో ఉన్న డయానాను ఆమె అక్కతో డేటింగ్ చేస్తున్న బ్రిటిష్ యువరాజు ఛార్లెస్ చూశాడు. అప్పుడు ఆమెకు పదహారు సంవత్సరాలు. మొదటి చూపులోనే డయానాను నచ్చిన యువరాజు అక్కకు బ్రేకప్ చెప్పి, చెల్లితో డేటింగ్ మొదలుపెట్టాడు. రెండు మూడు సార్లు తనతో తీసుకెళ్లి రాజ దంపతులకు కూడా చూపించాడు. వాళ్ళు కూడా నచ్చడంతో ఇరవై ఏళ్ల వయసులో తన కన్నా పదమూడు సంవత్సరాలు పెద్ద అయిన ఛార్లెస్ ను పెళ్ళి చేసుకుని బ్రిటిష్ రాజకుటుంబంలో అడుగు పెట్టింది డయానా.
ప్రజలు మెచ్చిన యువరాణి
పెళ్ళెన మరుసటి సంవత్సరం పెద్ద కొడుకు, ఆ తరువాత రెండు సంవత్సరాలకు రెండవ కొడుకు పుట్టారు. పిల్లల ఆలనాపాలనా ఆయాల మీద వదలకుండా తనే చూసుకుంది డయానా. వాళ్ళని స్కూలుకు కూడా తనే తీసుకెళ్లి వదిలి పెట్టి, తిరిగి తీసుకొచ్చేది. ఇదే కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలకు కూడా మద్దతు ఇచ్చింది. 1992లో భారతదేశానికి వచ్చిన డయానా అనేక అనాధాశ్రమాలను, మదర్ థెరెసా నడిపే సంస్థలను విచ్చేసింది. ఎక్కడో అంత:పురం లోపలకు పరిమితం కాకుండా ప్రజల మధ్యలో ఉన్న యువరాణిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారు.
విభేదాలు – విడాకులు
అయితే మరోవైపు ఛార్లెస్, డయానాల మధ్య పొరపొచ్చాలు మొదలై ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడని పరిస్థితి వచ్చింది. దీంతో ఛార్లెస్ తన పాత ప్రియురాలు కేమిల్లా పార్కర్ బౌల్స్ తో ప్రేమాయణం మొదలు పెట్టాడు. దీంతో అతని దగ్గర దొరకని ప్రేమను వెతుక్కోవడం మొదలు పెట్టింది డయానా. రాజకుటుంబ సభ్యులకు గుర్రపుస్వారి నేర్పించే హెవిట్ ఆమెకు దగ్గరయ్యాడు. ఈ ఇద్దరి అఫైర్లు పబ్లిక్ లోకి రావడంతో రాజమాత ఇద్దరినీ ఒకచోట కూర్చోబెట్టి సయోధ్య చేసినా అది ఎంతో కాలం నిలవక1996లో విడాకులతో ముగిసింది. విడాకుల ఒప్పందంలో భాగంగా డయానాకు కోటీ డెబ్భై లక్షల పౌండ్లు, ఆ తరువాత సంవత్సరానికి నాలుగు లక్షల పౌండ్లు ఇచ్చేలా ఛార్లెస్ అంగీకరించాడు. పిల్లలు ఇద్దరూ ఛార్లెస్ దగ్గర ఉండేలా ఒప్పందం కుదిరింది.
ఆ మరుసటి సంవత్సరం డయానాకు హేరోద్స్ స్టోరు ఓనరు ఈజిప్టు నుంచి వచ్చి లండన్లో స్థిరపడిన బిలియనీర్ కొడుకు దోడీ ఆల్ ఫాయెద్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొద్ది రోజుల క్రితమే అతనికి అమెరికన్ మోడల్ కెల్లీ ఫిషర్ తో వివాహం నిశ్చయం అయింది. డయానాతో పరిచయం అయ్యాక అతను ఆమెకు బ్రేకప్ చెప్పాడు. డయానాతో కలిసి అతను చేసిన మొదటి యాత్ర సార్డీనియాకి. అక్కడ నుంచి పారిస్ వచ్చి, అక్కడ యాక్సిడెంటుకు గురయ్యాడు.
యాక్సిడెంట్
టన్నెల్ గోడకు గుద్దుకోగానే డయానా ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు ధ్వంసమైంది. పది నిమిషాల్లో పోలీసులు, మరో అయిదు నిమిషాలలో అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి అప్పటికి డయానా ప్రాణాలతో ఉండడంతో అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె మరణించింది. దోడీ ఆల్ ఫాయెద్, డ్రైవర్ హెన్రీ పాల్ సంఘటనా స్థలంలో మరణించగా, మరో ప్రయాణికుడు, సెక్యూరిటీ ఆఫీసర్ రీస్ జోన్స్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. పోస్టుమార్టంలో డ్రైవర్ హెన్రీ పాల్ రక్తంలో అధిక మోతాదులో ఆల్కహాల్, మత్తు కలిగించే మానసిక వ్యాధులకు వాడే ఔషధాల జాడలు కనిపించాయి.
డయానా వల్ల తమ పరువు పోతుందని రాజకుటుంబం కుట్ర చేసి, డయానా మరణానికి కారణమైందని కొందరు ఆరోపించారు కానీ, అందుకు తగిన ఆధారాలు లేవని ఫ్రైంచ్ పోలీసులు తేల్చారు. ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న అందాల యువరాణి కథ అలా విషాదంతో ముగిసింది.
(ఆగస్టు 31 డయానా వర్ధంతి సందర్భంగా)