Idream media
Idream media
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. తాజాగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా పాజిటివ్ తేలింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాజిటివ్ రావడం విస్మయం కలిగిస్తోంది. దీంతో పాకిస్తాన్‌లో కలకలం రేపుతోంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తాజాగా చేసుకున్న పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పాక్ వైద్య శాఖ మంత్రి ఫైజల్ సుల్తాన్ ప్రకటించారు.
ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి ఇమ్రాన్ ఖాన్ వెళ్లారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే ఆయనకు పాజిటివ్ రేపడం ఆందోళన కలిగిస్తోంది. చైనాకు సంబంధించిన వ్యాక్సిన్ ‘సినోవక్’ వ్యాక్సిన్ తొలి డోసు ఇమ్రాన్‌ఖాన్ తీసుకున్నారు. ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ పొందాలని సూచించారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధికారికంగా తెలిపింది. అయితే పాకిస్తాన్ ప్రధానికి పాజిటివ్ రావడం.. చైనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కరోనా సోకడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చైనా వస్తువుల మాదిరి వ్యాక్సిన్ కూడా నాసిరకం అని కామెంట్స్ చేస్తున్నారు.
వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం?
కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న ఇపుడు అందరిలోనూ మెదులుతుంది. ఈ విషయంపై తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద్ర కూడా వ్యాక్సిన్ పూర్తిస్థాయి సురక్షితం కాదని చెప్పడం గమనార్హం. సాక్షాత్తు పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండో రోజే మళ్లీ కరోనా రావడం వ్యాక్సిన్ సురక్షితం పై అనుమానాలు నెలకొనడానికి కారణ మయింది. దీనిపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారత్లోని విజృంభణ
గత ఏడాది మార్చి 18న భారత్లో జనతా కర్ఫ్యూ పెట్టిన తర్వాత కరోనా విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే ఏడాది గడిచిన తర్వాత మళ్లీ భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఏకంగా 27,126 కొత్త కేసులు బయటపడటంతో, దేశవ్యాప్తంగా ఈ రోజు నమోదైన కొత్త కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 40,953 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గత 111 రోజుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284కు చేరుకుందని కేంద్రఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా 188 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,558కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,11,07,332కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.12 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,88,394గా ఉంది.
క్రమంగా పెరుగుదల
ఇటీవల దేశంలో ప్రత్యేకించి 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పెరుగుదల కనిపిస్తోందని తెలిపింది. వాటిలోనూ మహారాష్ట్ర, కేరళ పంజాబ్ రాష్ట్రాల్లోనే 76.22 శాతం యాక్టివ్ కేసులు కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలోని పుణే, నాగ్‌పూర్, ముంబై, థానే, నాసిక్ జిల్లాల్లో కోవిడ్ ప్రబలం ఎక్కువగా ఉండగా, కేరళలోని ఎర్నాకులం, పథానంతిట్ట, కన్నూర్, పాలక్కడ్, త్రిస్సూర్ జిల్లాల్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది.
సీఎం కుమారుడు ఆదిత్య థాక్రేకు కరోనా..
పంజాబ్‌లోని జలంధర్, ఎస్‌ఏఎస్ నగర్, పటియాలా, లూధియానా, హొషిర్‌పూర్‌లలో కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో వీటితో పాటు తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హరియాణాలు ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది. దీంతో ఆయన ఐసోలేషన్ వార్డులో వెళ్లారు.
నాగ్‌పూర్‌లో నిబంధనలు..
మహారాష్ట్రలో కోవిడ్ విస్తరిస్తున్న వేళ నాగ్‌పూర్ జిల్లాలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకూ పొడిగిస్తున్నట్లు మంత్రి నితిన్ రౌత్ చెప్పారు. ఇటీవల మార్చి 15 నుంచి 21 వరకూ కోవిడ్ ఆంక్షలను విధిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. నేటితో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో లాక్‌డౌన పొడిగిస్తున్నట్లు చెప్పారు. అయితే కొద్దిమేర నిబంధనలను సడలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
అత్యవసర వస్తువులను సాయంత్రం 4 గంటల వరకు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని, సాయంత్రం 7 వరకూ రెస్టారెంట్లను తెరచి ఉంచేలా నిబంధనలు సడలించినట్లు చెప్పారు. రాత్రి 11 వరకూ ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. నాగపూర్ జిల్లాలో శనివారం 3,679 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.