iDreamPost
android-app
ios-app

విశాఖలో మాట్లాడలేదు.. మనసులో మాట తెలిపారు

విశాఖలో మాట్లాడలేదు.. మనసులో మాట తెలిపారు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చనీయాంశంమైన అంశం రాజధాని. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు ఇటీవల జరిగిన అసెంబ్లీలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించనప్పటి నుంచీ ఈ చర్చ సాగుతోంది. రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై వేసిన నిపుణుల కమిటీ కూడా సీఎం చెప్పిన మాటలనే మరింత విస్తృతంగా చెప్పింది. 

కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలంటూ తన నివేదికలో తెలిపింది.నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన ఈనెల 21వ తేదీ నుంచి మూడు రాజధానులపై చర్చ తీవ్రమైంది. రాజధాని ప్రాంత గ్రామాలు మినహా రాష్ట్రం వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతించారు. రాజకీయ పార్టీల నేతలు కూడా మూడు రాజధానులపై హర్షం వ్యక్తం చేశారు.

నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ అనంతరం మూడు రాజధానులపై అధికారికంగా ప్రకటన వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే నిర్ణయం వాయిదా వేస్తూ రాజదానిపై హైపవర్‌ కమిటీని మంత్రివర్గం వేసింది. జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ కమిటీ ఇచ్చే రిపోర్టులపై హై పవర్‌ కమిటీ చర్చించి ప్రభుత్వానికి మరో నివేదిక ఇవ్వనుంది. దానిపై అసెంబ్లీలో చర్చించి, మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోనున్నారు.

నిన్నటి వరకు రాజధానిపై ఇలా జరగ్గా.. తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం సమర్థిస్తున్నట్లుగా ఈ రోజు మరో ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం విశాఖ ఆర్‌కే బీచ్‌లో విశాఖ ఉత్సవ్‌ ప్రారంభానికి సీఎం జగన్‌ విచ్చేశారు. అందిరీ ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పి సీఎం తన మాటలు ముగించారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించిన సీఎం విశాఖ ఉత్సవ్‌లో ఆ అంశంపై మాట్లాడతారని సభకు వచ్చిన ప్రజలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఊహించారు.

అయితే సీఎం జగన్‌ ఉత్సవ్‌లో ప్రశంగించకపోవడంతో ప్రజలు, నేతల అంచనాలు తల్లకిందులయ్యాయి. కానీ సీఎం జగన తన మనసులోని మాటను మాత్రం చెప్పకనే చెప్పారు. విశాఖ నగర ప్రభవాన్ని వివరిస్తూ ప్రభుత్వ ప్రతినిధి బ్యాక్‌ గ్రౌండ్‌లో చెప్పిన మాటల్లో పలు మార్లు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్‌ అంటూ ప్రస్తావించారు. నగర వైభవాన్ని మరింతగా పెంచేందుకు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను రాష్ట్రానికి కార్యనిర్వాహక రాజధానిగా సీఎం జగన్‌ ప్రతిపాదించారని, అందుకే ఈ ఉత్సవమని బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌లో చెప్పారు.

ఇలా తాను మాట్లడకపోయినా విశాఖే కార్యనిర్వాహక రాజధానని సీఎం జగన్‌ తన మనసులో మాట చెప్పించారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, అంతకు ముందు సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్టు నుంచి ఆర్‌కే బీచ్‌ వరకు 24 కిలోమీటర్ల మేర మానవహారంలా ప్రజలు నిలబడి ఘన స్వాగతం చెప్పడం గమనార్హం