iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు పెను దుమారం రేపాయి. అందులో ఒకటి ఇద్దరు కలెక్టర్లని విధుల నుంచి తొలగించడం. వారిలో గుంటూరు కలెక్టర్ శామ్యూల్ తో పాటుగా చిత్తూరు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా కూడా ఉన్నారు. సమర్ధత అధికారులుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరినీ కేవలం ఎక్కువ స్థానాలకి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయనే కారణంచెప్పి విధుల నుంచి తప్పించడం వివాదాస్పద విషయమైంది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా తన అధికారుల పేరుతో నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరించారు.
ఆ వెంటనే ప్రభుత్వం మాత్రం వారికి తగిన హోదా కల్పించేందుకు సంకల్పించింది. అందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖలో శామ్యూల్, అందరికీ ఇళ్ళు నిర్మించే కీలక పథకం బాధ్యతలు భరత్ నారాయణ్ గుప్తా కి ప్రభుత్వం అప్పగించింది. జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయిలో కీలక స్థానాల్లో నియమితులయ్యారు.
అప్పట్లో స్థానిక ఎన్నికల నిర్వహణలో వారి తీరుని ఎస్ఈసి తప్పుబట్టింది. బాద్యతలు మార్చేందుకు కారణం అయ్యింది. కానీ ఇప్పుడు సీఈసీ కీలక బాధ్యతలు అప్పగించింది. భరత్ నారాయణ గుప్తాని బెంగాల్ ఎన్నికల పరిశీలకునిగా నియమించింది. నిమ్మగడ్డ చేత నిందలు వేయబడిన అధికారికి జాతీయ స్థాయిలో కీలక ఎన్నికల్లో బాధ్యత దక్కడం ఆసక్తిగా మారింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అలాంటి తరుణంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన అధికారుల జాబితాలో ఏపీ క్యాడర్ కి చెందిన గుప్తా పేరు ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్రంలోని,బిర్భూమ్ జిల్లా ఎన్నికల పరిశీలకులుగా డా. నారాయణ భరత్ గుప్త వ్యవహరిస్తారు. అంటే స్థానిక ఎన్నికల్లో నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంలో అసంబద్ధతని ఇది సూచిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.