iDreamPost
iDreamPost
ఆంధ్ర ప్రదేశ్ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది.ఇటీవల కృష్ణా జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ చనిపోయారు.ఇవాళ ఆమె దశ దిన కర్మలు నిర్వహిస్తుండగా మంత్రి నానిపై హత్యాయత్న ఘటన చోటు చేసుకుంది. కర్మలకు హాజరైనట్టు నటించిన నిందితుడు తాపీతో మంత్రిని పొడవడానికి ప్రయత్నించాడు.
మంత్రి తల్లి గారి పెద్దకర్మ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.వారిని పలకరిస్తూ భోజనాల వద్దకు వెళ్తూ గేటు వద్దకు మంత్రి నాని వచ్చారు.ఈ సమయంలో ఓ వ్యక్తి కాళ్లకు దండం పెడుతున్నట్టు నటిస్తూ వేగంగా మంత్రి నాని వైపు దూసుకొచ్చాడు.వచ్చీరావడంతోనే అతడు ఓ ఇనుప వస్తువుతో మంత్రి పొట్టలో పొడిచేందుకు ప్రయత్నించాడు.అది బెల్ట్ బకెల్‌కి తగలడంతో మంత్రికి పెను ప్రమాదం తప్పింది. రెండోసారి పొట్టలో పొడవడానికి ప్రయత్నించగా అప్పటికే అప్రమత్తమైన మంత్రి అనుచరులు నిందితుడిని పట్టుకున్నారు.
హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మచిలీపట్నానికి చెందిన తాపీ మేస్త్రి బడుగు నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.నిందితుడు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడా? లేక దాడి వెనక కుట్ర దాగి ఉందేమో? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దాడిపై మంత్రి పేర్ని నాని స్పందన
తనపై జరిగిన దాడి గురించి మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ” మా తల్లిగారి పెద్ద కర్మ సందర్భంగా పూాజాధికాలు పూర్తిచేసుకుని భోజనాలకు వెళ్తుండగా ఘటన జరిగిందన్నారు. ఆ సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాళ్ల మీద పడుతున్నట్లు నటిస్తూ ఇనుప వస్తువుని పొట్టలో నుంచి తీసి పొడవడానికి ప్రయత్నించాడు.అయితే అది బెల్ట్ బకెల్‌కి మొదటి ప్రయత్నం విఫలమైంది.రెండోసారి దాడికి ప్రయత్నించగా అప్రమత్తమైన నా చుట్టూ ఉన్నవారు పట్టుకొని నిందితుడిని పోలీసులకు అప్పగించారు.నిందితుడు బలరాం పేటకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించాను. నేను క్షేమంగానే ఉన్నాను. నాకు ఎలాంటి గాయం కాలేదు.ఎవరూ ఆందోళన చెందవద్దు.’’ అని తెలిపారు.
ఇక మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడితో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.