iDreamPost
android-app
ios-app

కరోనాని ఎంజాయ్ చేస్తున్న ఉండవల్లి

  • Published Aug 26, 2020 | 4:36 PM Updated Updated Aug 26, 2020 | 4:36 PM
కరోనాని ఎంజాయ్ చేస్తున్న ఉండవల్లి

ఉండవల్లి అరుణ్‌ కుమార్..ఈ మాజీ ఎంపీ మాట తీరులోనే కాదు వ్యవహారం కూడా ఆసక్తికరంగా వ్యవహరిస్తారు. తాజాగా ఆయన కరోనా బారిన పడిన నేపథ్యంలో మిత్రులకు సందేశం పంపించారు. అందులో ఆయన పేర్కొన్న అంశం పలువురి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు నిర్వహించిన డాక్టర్ సలహాతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్టు వెల్లడించారు. అందులో ఫలితం పాజిటివ్ గా రావడంతో తాను అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలిపారు. అంతటితో సరిపెట్టకుండా తాను కోవిడ్ ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే పలువురు కరోనా సోకగానే కలవరపడుతున్న దశలో సీనియర్ సిటిజన్ గా ఉన్న మాజీ ఎంపీ ఆ మహమ్మారిని ఎంజాయ్ చేస్తున్నట్టు తేలికగా ప్రకటించడం విశేషంగా మారింది.

మేథావిగా గుర్తింపు పొందిన ఉండవల్లి రాజకీయ, వర్తమాన అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అందులో భాగంగా పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే రెండు నెలల క్రితం కరోనా గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా అనేది పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ ప్రచారం కారణంగా అది చాలామందిని కలవరపరుస్తోందిన వ్యాఖ్యానించారు. జాగ్రత్తలు పాటిస్తే దానిని అధిగమించడం కష్టం కాదని ఆయన చెప్పారు.

ఇప్పుడు తీరా తనకు వైరస్ సోకగానే తన మాటలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయనకు ఒకనాటి సాటి ఎంపీ హర్షకుమార్ వారం క్రితమే వైరస్ సోకింది. హర్షకుమార్ భార్య రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో నర్సింగ్ సూపరింటిండెంట్ గా కోవిడ్ విధులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆమెకు తొలుత కరోనా సోకగా, తదనంతరం కుటుంబంలో పలువురికి వ్యాపించింది. అయితే తాజాగా హర్షకుమార్ పరిస్థితి కాస్త విషమించడంతో వెంటనే అప్రమత్తమయిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్ లో ఉండగా హర్షకుమార్ ని మాత్రం హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది.

అదే సమయంలో ఉండవల్లి కాస్త దిటువుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కరోనా మీద యుద్దంలో ఆయన నిబ్బరంగా వ్యవహరించడం అనుచరులకు కూడా ఉత్సాహాన్నిస్తోంది. ఉండవల్లి భార్య జ్యోతికి కూడా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ఉండవల్లి స్వగృహంలోనే క్వారంటైన్ లో ఉన్నారు.