iDreamPost
android-app
ios-app

దుబ్బాక చైత‌న్యం గ్రేట‌ర్ కు లేదా..?

దుబ్బాక చైత‌న్యం గ్రేట‌ర్ కు లేదా..?

గ్రేట‌ర్ పోరులో ఈసారి ఎన్న‌డూ లేని హైఓల్టేజ్ ప్ర‌చారాన్నిచూశాం. నేత‌లు గెల‌వ‌డం కోసం ఎంత తీవ్ర స్థాయిలో పోరాడారో.. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వ‌హించారో.. చూశాం. అవ‌న్నీ చూసి ఎన్నిక‌ల‌పై విప‌రీతంగా ప్ర‌జ‌లు కూడా చ‌ర్చించారు. ప్ర‌చార స‌ర‌ళిపై చ‌ర్చించిన జ‌నం పోలింగ్ పై ఎందుకు ఆస‌క్తి చూప‌డం లేదు..? క‌రోనా ప‌రిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల‌లో మొట్ట‌మొద‌టి సారిగా జ‌రిగిన ఎన్నిక దుబ్బాక ఉప ఎన్నిక‌. అయిన‌ప్ప‌టికీ అక్క‌డి ఓట‌ర్లు చైత‌న్యం ప్ర‌ద‌ర్శించారు. అత్య‌ధిక మంది ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. దుబ్బాకలో 82 శాతానికిపైగా పోలింగ్ న‌మోదైంది. ఆ ప‌ల్లెవాసుల‌కు ఉన్న చైత‌న్యం ప‌ట్ట‌ణంవాసుల‌కు లేకుండా పోయింద‌ని ప‌లువురు నిపుణులు, సామాజిక‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అతి త‌క్కువ పోలింగ్ శాతం న‌మోదు కావ‌డ‌మే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. గ్రేట‌ర్ లో ఎప్పుడూ ఇదే ప‌రిస్థితి అని కొంత మంది చెబుతున్నారు.

ఓట‌రు స్లిప్పులు అంద‌క‌పోవ‌డ‌మూ ఓ కార‌ణ‌మా..?

సాధార‌ణంగా ఎన్నిక‌ల తేదీ వ‌స్తుందంటే చాలా మంది ఓట‌ర్లు ఎదురుచూసేది ఓట‌రు స్లిప్పుల కోసం. దాంట్లో త‌మ పోలింగ్ బూత్ చిరునామా ఎక్క‌డ ఉందో తెలిసే అవ‌కాశాలు ఉన్నాయి. కానీ ఈసారి చాలా మందికి ఆ స్లిప్పులు అంద‌లేదు. ఆన్ లైన్ లో చూసుకునే అవ‌కాశం ఉన్నా.. అది ఎంత మంది వినియోగించుకోగ‌ల‌రు. గ్రేట‌ర్ లో 60 శాతం ప్రాంతాల్లో ఓట‌రు స్లిప్పుల పంపిణీ చేయ‌లేద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాత‌బ‌స్తీలో అయితే అత్య‌ధిక మందికి ఓట‌రు స్లిప్పులు అంద‌లేదు. ఓట‌ర్లు పోలింగ్ బూత్‌ల‌కు వెళ్ల‌క‌పోవ‌డానికి ఇదొక కార‌ణంగా క‌నిపిస్తోంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వ‌ర‌కు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం ప‌రిశీలిస్తే ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఘాన్సీబ‌జ‌రా్ 16 శాతం, సులేమాన్ న‌గ‌ర్ 15 శాతం, న‌ల్ల‌కుంట 12, గోల్నాక 13, అడిక్ మెట్ 12, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో 12 శాతం, హ‌ఫీజ్ పేట 13 శాతం, వివేకానంద న‌గ‌ర్ 8 శాతం, మియాపూర్ 9 శాతం, చందాన‌గ‌ర్ 9 శాతం చొప్పున మాత్ర‌మే పోలింగ్ న‌మోదైంది. ఈసారి ఓటింగ్ స‌మ‌యం పెంచ‌డం, చ‌లి కార‌ణంగా ఉద‌యం వేళ పోలింగ్ శాతం త‌క్కువ ఉంద‌ని, సాయంత్రం లోపు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుత స‌ర‌ళిని బ‌ట్టి ప‌రిశీలిస్తే నిర్దేశిత స‌మ‌యంలోపు 40 శాతానికి మించ‌క‌పోవ‌చ్చ‌ని మ‌రికొంద‌రు అంచ‌నా వేస్తున్నారు.