Idream media
Idream media
15 రోజుల క్రితం హైదరాబాద్ మహానగరంలో వరదలు సృష్టించిన బీభత్సం అందరికీ తెలిసిందే. ఇళ్లు చెరువులయ్యాయి. కాలనీలు గోదారులు అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వేలాది కుటుంబాలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో ఇళ్లు వదిలి తరలిపోయాయి. కొందరు బంధువులు, ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. మరికొందరు బతుకుజీవుడా అంటూ సొంతూళ్లకు వెళ్లిపోయారు. వరదలు సృష్టించిన విధ్వంసానికి సర్వం కోల్పోయిన కుటుంబాలు ఎన్నో. ఆప్తులను దూరం చేసుకున్న బాధితులు ఎందరో. ఎన్నో ఆపన్నహస్తాలు బాధితులకు అండగా నిలిచాయి. కేసీఆర్ సర్కార్ సైతం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించింది. ఒక్కో ఇంటికి రూ. 10 వేలు చొప్పున పంపిణీ చేసేందుకు రూ.400 కోట్లు సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి రిలీజ్ చేసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చేసిన సహాయం కొందరు దళారుల, స్వార్థ రాజకీయ నేతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పక్కదారి పట్టింది. నిజమైన బాధితుల్లో చాలా మందికి ఇంకా సహాయం అందలేదు. ప్రభుత్వం విడుదల చేసిన ఆ సహాయం కోసం ఎదురుచూస్తుండగా.. కొందరు నేతల మితిమీరిన రాజకీయ జోక్యంతో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం వరద సాయం పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
కొందరి నేతలపై ఫిర్యాదుల వెల్లువ
అసలే అన్నీ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ముంపు ప్రాంత బాధితులు. నేటికీ కొన్ని కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. మరికొన్ని కాలనీల్లో నీళ్లు పోయినా వరద తెచ్చిన బురద, వ్యర్థాలు మేట వేశాయి. చెత్తాచెదారంతో అధ్వానంగా మారాయి. ఎల్బీనగర్, మహేశ్వర్ నగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఏం చేయాలో.. ఎటు పోవాలో.. తెలియక సతమతం అవుతున్న కుటుంబాలు ఇంకా ఎన్నో. అలాంటి వారిని ఆదుకోవాల్సింది పోయి.. కొందరు స్థానిక నేతలు అడ్డదారులు తొక్కారు. ప్రభుత్వం సహాయాన్ని అడ్డంగా బొక్కేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రూ.10 వేలు ఇచ్చి అధికారులు వెళ్లిపోగానే రంగప్రవేశం చేస్తున్న కొందరు నేతలు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కమీషన్ కింద తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యూసుఫ్‌గూడలో నగదు పంపిణీలో గోల్‌మాల్ చేస్తున్న కొందరు కార్యకర్తలపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో స్థానికులు ఫిర్యాదు చేశారు. యూసుఫ్‌గూడకు చెందిన ఓ నేత తమ కుటుంబంలోని ముగ్గురి పేర్లు రాయించుకొని రూ.30 వేల రూపాయలు తీసుకున్నట్లు బాధితులు ఆందోళన చేశారు. మూడో అంతస్తులో ఉంటున్న వారికి కూడా వరద బాధితుల కింద రాయించి డబ్బులు తీసుకుంటున్నారు చాలా మంది. ఎత్తు ప్రాంతంలో ఉన్న యూసుఫ్‌గూడ వెంకటగిరి, చందానగర్, కూకట్ పల్లిలోని కొన్నిప్రాంతాల్లో వరద సమస్యే లేదు. అయినప్పటికీ బాధితుల పేరు చెప్పి కొందరు దండుకుంటున్నారు.
రాజకీయ జోక్యంతో గందరగోళం
వరదబాధితులకు సహాయం పంపిణీలో రాజకీయ జోక్యం పెరగడం తీవ్ర గందరగోళం సృష్టించింది. తమ అనుయాయులు, తమకు తెలిసిన కుటుంబాలకే పూర్తిసాయం అందేలా స్థానిక రాజకీయనేతలు వ్యవహరించారని నగరవ్యాప్తంగా ప్రజలు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయి. బాధితులను మరింత రెచ్చగొట్టి రోడ్డెక్కేలా చేశాయి. కొన్ని రోజులుగా ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. నిజమైన బాధితులకు చాలా చోట్ల సహాయం అందకపోగా,కొన్ని చోట్ల అనర్హులకు కూడా అందాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె ఇళ్లలో ఉన్నవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్ని చోట్ల ఇళ్ల యజమానులకే పంపిణీ చేయడంతో వరదల్లో సమస్తం కోల్పోయి, కట్టుబట్టలతో మాత్రమే మిగిలిన వారికి కూడా కిరాయిదారులకు సాయమందకుండా పోయిందనే వేదనలు వ్యక్తమయ్యాయి. ఈ గందరగోళం నేపథ్యంలో వరద సాయం తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొందరు నేతల తీరుతో ఎందరో బాధితులు ప్రభుత్వ సహాయం అందుకోలేకపోతున్నారు.
పకడ్బందీగా ప్రణాళిక రచించి పంపిణీ చేయాలి..
కొందరు స్వార్థపరుల కారణంగా బాధితులకు ప్రభుత్వ సహాయం దూరం కాకూడదు. కట్టుబట్టలతో మిగిలిన ఎన్నో కుటుంబాలకు ఆ 10 వేలు ఎంతో కొంత ఆధారం అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పక్కాగా బాధితులకు సహాయం అందేలా ప్రణాళికలు రచించాలి. ప్రజలకు బ్యాంకు ఖాతాల ద్వారా కానీ, మరేదైనా మార్గంలో కానీ నగదు అందేలా చేయాలి. నేరుగా నగదు పంపిణీ చేయడమే అక్రమాలకు తావిచ్చింది. గ్రేటర్ పరిధిలో వరదబాధిత కుటుంబాలు దాదాపు 4 లక్షలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు చూస్తే దాదాపు 6 లక్షల కుటుంబాలున్నట్లు అంచనా. ప్రభుత్వం రిలీజ్ చేసిన రూ.400 కోట్లలో దాదాపు రూ.342 కోట్లు పంపిణీ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన డబ్బునైనా అసలైన బాధితులకు అందేలా ప్రభుత్వం కృషి చేయాలని బాధితులు కోరుతున్నారు.