జరిగేది ఉప ఎన్నికే అయినా.. తెలంగాణలో రాజకీయ వాతావరణం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచీ నేతల జోరు మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. అయితే తనను పొమ్మనలేక పొగబెట్టారని పేర్కొంటూ ఈటెల టీఆర్‌ఎస్ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజురాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారో.. అనేది ఆసక్తిగా మారింది.
ఆ రెండింటి మధ్యేపోరు
ఈ ఎన్నిక లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోరు హోరాహోరీగా ఉండనుంది. ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థి అయినప్పటికీ.. వ్యక్తిగతంగానే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. దీంతో ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మారింది. టీఆర్‌ఎస్ నుంచి పోటీలో ఉన్న విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , బీజేపీ నుంచి పోటీలో ఉన్న ఉద్యమ నాయకుడు రాజేందర్ హోరాహోరీగా తలపడుతున్నారు. రాజీనామా చేసిన నాటి నుంచి ఈటెల ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. కొన్ని రోజులు పాదయాత్ర చేపట్టారు. అస్వస్థతకు గురవడంతో పాదయాత్రకు ముగింపు పలికి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా రెండుసార్లు చుట్టేశారు. 2004 కమలాపూర్ నియోజకవర్గం నుంచి, 2009, 10 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో హుజురాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Also Read : అదే జరిగితే ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుంది..?
ఆయనది అనుభవం
ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం.. ప్రజలందరికీ చేరువ కావడం ఈటలకు కలిసొచ్చే అంశం. అన్ని మండలాలు ఆయనకు సుపరిచితమే. ప్రతిఒక్కరినీ పేరుపేరున పలకరించేంత ప్రజల్లో కలిసిపోయారు. పైగా స్థానికుడు. ఈటలపై ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బహిష్కరించిందనే సానుభూతి ప్రజల్లో ఏర్పడడం, నరేంద్ర మోదీ హవా కూడా కనిపించే అవకాశం ఉంది. బలహీనతల విషయానికి వస్తే హుజురాబాద్ అభివృద్ధిలో వెనకపడి ఉండడం.. అవినీతి ఆరోపణలు రావడం వంటివి ఈటలకు చేటు చేసేలా ఉంది. బీజేపీ నాయకత్వం సహకరించపోవడం కూడా కొంత ప్రభావం చూపనుంది. ఈ ఎన్నిక ఈటెలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నిక ఆయనకు చావో రేవోగా పేర్కొంటున్నారు.
ఈయనకు పార్టీ బలం
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ బలంగా ఉంది. అభ్యర్థిని కొన్ని నెలల ముందటే ప్రకటించారు. స్థానికుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను వ్యూహాత్మకంగా అభ్యర్థిగా ప్రకటించి బీసీ ఓటర్లకు గాలం వేసింది. పైగా కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం.. ఈ నియోజకవర్గానికే చెందిన వ్యక్తికి ఎస్సీకార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. వీటికితోడు దేశంలోనే ప్రప్రథమంగా రూ.10 లక్షల నగదు సాయం పథకం ‘దళితబంధు’ ప్రకటించడం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశం. నియోజకవర్గ బాధ్యతలు పార్టీ అప్పగించడంతో మంత్రి హరీశ్ రావు హుజురాబాద్‌లోనే కొన్ని నెలలుగా ఉంటున్నారు. తరచూ పర్యటనలు.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
Also Read : రాజకీయ సన్యాసం చేస్తానంటున్న ఈటెల
మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఈ గెలుపు టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. నాగార్జునసాగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న టీఆర్‌ఎస్.. హుజురాబాద్‌తో విజయయాత్ర కొనసాగించాలని భావిస్తోంది. అయితే ప్రతికూలతలు ఏమున్నాయంటే.. ఈటలను అకారణంగా మంత్రివర్గం నుంచి తొలగించారని స్థానికుల్లో ఆగ్రహం. ఏడున్నరేళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత చేటు చేసేలా ఉంది.