iDreamPost
android-app
ios-app

వంద సంవత్సరాల హైదరాబాదీ యునానీ దివ్యౌషధం

వంద సంవత్సరాల హైదరాబాదీ యునానీ దివ్యౌషధం

1920లో ప్రపంచాన్ని విలవిలలాడించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఒక మందు తయారు చేయాలని నిజాం ప్రభువుల పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని యునానీ వైద్యుడు హకీమ్ మహమ్మద్ మొయుజుద్దీన్ ఫరూఖీ రూపొందించిన ఔషధం జిందా తిలిస్మాత్. ఎటువంటి దుష్పరిణామాలు కలిగించని మూలికలతో రూపొందించిన ఈ మందు స్పానిష్ ఫ్లూని నివారించకపోయినా ఆ జబ్బు తాలూకు లక్షణాలను బాగా అదుపు చేయగలిగింది.

“జీవ అమృతం” అనే అర్థం వచ్చే ఈ మందు దగ్గు, జలుబు, గొంతు నొప్పి, వొళ్లు నొప్పులు, చెవి నొప్పి, పన్ను నొప్పి, కడుపు సమస్యలు లాంటి అనేక సమస్యలను కూడా తగ్గించగలగడంతో స్పానిష్ ఫ్లూ మాయమైన తర్వాత కూడా వినియోగదారుల ఆదరణ పొందుతూ ఉంది. పూర్తిగా మూలికలతో తయారైన దీనిలో యూకలిప్టస్ ఆయిల్, కర్పూరం, మెంథాల్, రతన్ జ్యోతి అనే మూలిక నుంచి తీసిన రసం ఉంటాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్తారు తయారీదారులు.

అంబర్ పేటలోని ఒక ఖార్ఖానాలో ఉత్పత్తి ప్రారంభించిన ఈ మందు 5,15 మిల్లీమీటర్ల సీసాలలో లభిస్తూ, సంవత్సరానికి కోటి సీసాలు అమ్మకాలు సాగిస్తోంది. “ప్రతి జబ్బునీ తగ్గించే మందు” అన్న ట్యాగ్ లైనుతో అమ్ముడయ్యే ఈ మందుకి ట్రేడ్ మార్కుగా నిజాం ప్రభువుల టోపీని ఎంచుకున్నారు తయారీదారులు.

లోగోలో ఆఫ్రికా యువకుడు

ఆ రోజుల్లో నిజాం ప్రభువు బాడీగార్డులుగా ఆఫ్రికా యోధులు ఉండేవారు. వారి దేహ ధారుఢ్యం, ఆరోగ్యవంతమైన శరీరాలు చూసిన తయారీదారుడు అహమ్మద్ అబ్దుల్ ముజీబ్ హజారీ ఈ ఆఫ్రికా యోధుడి ముఖాన్ని లోగోగా పెట్టుకున్నాడు.

యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించే జిందా తిలిస్మాత్ మందుని ప్రతిరోజూ ఒక మిల్లీమీటరు నీటిలో కానీ, పాలలో కానీ కలిపి తీసుకుంటారు చాలా మంది.

స్వైన్ ఫ్లూ, కరోనాలకు కూడా

ఆమధ్య స్వైన్ ఫ్లూ వ్యాపించినప్పుడు కూడా జిందా తిలిస్మాత్ వాడి ఉపశమనం పొందిన వారు ఉన్నారు. స్వైన్ ఫ్లూ జబ్బు తగ్గించకపోయినా దాని లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుందని తయారీదారులు చెప్పారు. ఇదే విషయం ఇప్పుడు కరోనా గురించి కూడా చెప్తున్నారు. కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు వొళ్లు నొప్పులు తగ్గించడంతో బాటు, రోగనిరోధక శక్తి పెరిగి కరోనా జబ్బు అదుపులోకి రావడానికి కూడా దోహద పడుతుందని చెప్తారు.

అమెజాన్లో కూడా లభ్యం

హర్ మర్జ్ కీ దవా, ప్రతి జబ్బుకీ పనిచేసే మందు అని ప్రకటించుకునే ఈ మందు అన్ని మందుల షాపులతో పాటు అమెజాన్ ఆన్ లైన్ షాపింగ్ సైట్ లో కూడా దొరుకుతుంది. ఈ మందు మరో ప్రత్యేకత ఏమంటే నొప్పి ఉన్న భాగం మీద పూసినా పని చేయడం.

జిందా తిలిస్మాత్ కాకుండా ఈ కంపెనీ జిందా బామ్ పేరిట నొప్పి నివారణ ఔషధాన్ని, ఫరూఖీ పళ్ళపొడిని కూడా ఉత్పత్తి చేస్తోంది.