iDreamPost
iDreamPost
సరిగ్గా ఇంకా 13 రోజుల్లో వకీల్ సాబ్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే బిజినెస్ వ్యవహారాలు పూర్తయ్యాయి. థియేటర్ల కేటాయింపు, స్క్రీన్ల విభజన తదితర పనుల్లో డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు. రెండో తేదీన రాబోతున్న మూడు సినిమాల కౌంట్ ని వాటి టాక్ కు తగ్గట్టు అడ్జస్ట్ చేస్తూనే మరోవైపు మొదటిరోజు ఎన్నేసి షోలు వేయాలనే ప్లానింగ్ కూడా జోరుగా సాగుతోంది. అర్ధరాత్రి నుంచే ఆటలు మొదలుపెట్టేలా బయ్యర్లు ఒత్తిడి చేస్తున్నారట. ఒకవేళ సాధ్యమైతే టికెట్ ధర వెయ్యి నుంచి పదిహేను వందల మధ్యలో ఉన్నా ఆశ్చర్యం లేదని సోషల్ మీడియాలో అప్పుడే ప్రచారం మొదలయ్యింది. కానీ ప్రభుత్వాలు ఇలా అనుమతి ఇవ్వడం సులభం కాదు.
తెల్లవారుఝామున షోలకు మాత్రం కనీసం అయిదు వందల రూపాయలు ఉండేలా అది కూడా ఏ సెంటర్స్ లో ఈ ధరను లాక్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఒకవేళ ఇంత పెట్టినా అభిమానులు పెద్దగా ఆలోచించకుండా కోనేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ ని స్క్రీన్ మీద చూడబోతున్న వాళ్ళ ఆనందం టికెట్ ఎంత డిమాండ్ చేస్తుందనేది ఆలోచించనివ్వకపోవచ్చు. అయితే టాక్ ఎలా వస్తుందనే దాన్ని బట్టే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. గతంలో అజ్ఞాతవాసికి జరిగిన అనుభవం ఎవరూ మర్చిపోలేదు. అయితే దర్శకుడు వేణు శ్రీరామ్ అలాంటి భయమేమి లేదంటున్నాడు.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ రావడం లేదు. ముందు యుసూప్ గూడ గ్రౌండ్స్ లో చేద్దామని సెట్ చేసుకున్నారు. కానీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద ఈవెంట్ కి అనుమతి ఇస్తుందా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పవన్ ఫ్యాన్స్ ని ఆ రోజు అదుపు చేయడం కష్టం. అది పలు సందర్భాల్లో రుజువయ్యింది కూడా. ఇప్పుడు ఇంత ఎగ్జైటైమెంట్ ఉన్న ఫంక్షన్ లో సైలెంట్ గా ఉంటారని ఆశించలేం. అందుకే ఎలా చేయాలనే దాని మీద ఒక కంక్లూజన్ కు వచ్చాక అప్పుడు ప్రకటన ఇస్తారని తెలిసింది. చూద్దాం