కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఫర్నిచర్ పార్కు ఏర్పాటు కానుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, శ్రీ సిటీకి సమీపంలో 1,500 ఎకరాల్లో ఫర్నిచర్ పార్కును ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ భారీ ఫర్నిచర్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ సంస్థతో పాటు మరో రెండు కంపెనీలు ముందుకు వచ్చాయి.
అంతర్జాతీయంగా ప్రతీ సంవత్సరం సుమారు 20 లక్షల కోట్ల ఫర్నిచర్ వ్యాపారం జరుగుతుండగా అందులో సుమారు రూ.3–4 లక్షల కోట్ల విలువైన మార్కెట్‌ను భారత్ సొంతం చేసుకోగలిగితే సుమారు 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు కోసం ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపైఐఐటీ)అధికారులు శ్రీ సిటీకి సమీపంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. చెన్నై, కృష్ణపట్నం రేవులకు చేరువలో ఉండటంతో పాటు మౌలిక సదుపాయాల రూపకల్పన బాగుండడంతో నెల్లూరు జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు DPIIT అధికారులు ఆమోదం తెలిపినట్లు సమాచారం.కాగా ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా ఫర్నిచర్ తయారీకి అవసరం అయిన దుంగలు ఇతర కలపపై దిగుమతి సుంకం ఎత్తివేయడంతో పాటు మరిన్ని అనుబంధ యూనిట్లకు రాయితీలు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ఒకవేళ నెల్లూరులో భారీ ఫర్నిచర్ పార్క్ ఏర్పడితే సుమారు 25 లక్షల మందికి ఉపాధి కలగడమే కాకుండా దేశీయ ఎగుమతులు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.