iDreamPost
android-app
ios-app

జగన్ ఈ విజయ సౌధాన్ని ఎలా నిర్మించారు..?

  • Published Sep 26, 2021 | 10:17 AM Updated Updated Sep 26, 2021 | 10:17 AM
జగన్ ఈ విజయ సౌధాన్ని ఎలా నిర్మించారు..?

పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన ఘన విజయం ఒక రికార్డు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తిరుగులేని యోగ్యతాపత్రం. రెండు సంవత్సరాల నాలుగు నెలల ప్రాయమున్న సర్కారును అక్కున చేర్చుకున్న అరుదైన సన్నివేశం. ఎక్కడైనా..ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీపై క్రమంగా ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా రూపు దిద్దుకుంటుంది. ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా వచ్చే ఓట్ల శాతం తగ్గుతుంది. కానీ పరిషత్ ఎన్నికల్లో అందుకు విరుద్ధంగా ఓట్ల శాతం గణనీయంగా పెరగడమే విశేషం.

ఈ శాతాలే నిదర్శనం..

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ దాదాపు 50 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో 69.55 శాతం ఓట్లతో వైఎస్సార్ సీపీ తిరుగులేని విజయం సాధించింది. టీడీపీకి 22.27 శాతం, జనసేన 3.83, బీజేపీ 2.32 శాతం ఓట్లు వచ్చాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 64.8 శాతం ఓట్లు సాధించగా టీడీపీకి 25.27, జనసేనకు 4.34, బీజేపీకి 1.48 శాతం ఓట్లు దక్కాయి.

Also Read : ఫలిస్తున్న ఏపీ పారిశ్రామికాభివృద్ధి వ్యూహం

జడ్పీ పీఠాలన్నీ గంపగుత్తగా..

13 జిల్లాల్లోని జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాలను, ఉపాధ్యక్ష పదవులను వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. రాష్ట్రంలో 660 మండలాల్లో 11 చోట్ల ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు. 649 చోట్ల ఎంపీపీ అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహణకు ఏర్పాటు చేశారు. 15 స్థానాల్లో కోరం లేకపోవడం, నామినేషన్ల దాఖలు కాకపోవడం వంటి కారణాలతో వాయిదా పడ్డాయి. ఎన్నికలు జరిగిన 634 మండలాల్లో 621 ఎంపీపీ అధ్యక్ష పదవులను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ జనసేన మద్దతుతో 7 చోట్ల విజయం సాధించింది. జనసేన, సీపీఎం ఒక్కో ఎంపీపీ అధ్యక్ష పదవి గెలిచాయి. నాలుగు చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు.

ఎలా సాధ్యమైంది?

అనితర సాధ్యమనదగ్గ ఈ విజయం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వల్లే సాధ్యమైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టో ఒక భగవద్గీత, బైబిలు, ఖురాన్ అని ప్రకటించి 96 శాతం హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడం వల్లే ఆయనకు జనం ఈ అపూర్వ విజయం కట్టబెట్టారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం అనే పునాదిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ విజయ సౌధాన్ని నిర్మించారు.

Also Read : జగన్ మార్క్ రాజకీయం, సామాజిక సమీకరణాల్లో పెను మార్పులు

ఆత్మ విమర్శ మరచి పరనింద..

ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఆత్మ విమర్శ చేసుకోవడానికి బదులు అధికార పక్షాన్ని ఆడిపోసుకోవటం విడ్డూరంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల పరాజయంపై కూడా ఈ విధంగానే స్పందించడం వల్లే టీడీపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ విషయాన్ని గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోనంత వరకు ఆ పార్టీ విజయ తీరాలకు దూరంగా నిలుచోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు.