– రేపటి నుంచి మూడురోజుల పాటు చంద్రబాబు పర్యటన
– పంచాయతీ ఫలితాలపై సమీక్ష
– ఇప్పటికే బాబు తీరుపై కార్యకర్తల అసంతృప్తి
చంద్రబాబు కుప్పం పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏడాదిగా నియోజకవర్గంపై కన్నెత్తి చూడని ఆయన…పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవడంతో నియోజకవర్గ పర్యటన చేపట్టారు. ఇప్పటికే బాబు తీరుపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. రేపు ఆయన ముందే తమ ఇబ్బందులను చెప్పేందుకు సిద్ధమయ్యారు.
ఆ ముగ్గురిపై తీవ్ర వ్యతిరేకత
కుప్పం ఇంచార్జి మునిరత్నం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్ పై టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. తమ వద్ద డబ్బులు లేకున్నా బలవంతంగా పంచాయతీ బరిలో నిలిపారని మండిపడుతున్నారు. పోటీ చేయండి.. ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి తర్వాత చేతులెత్తేయడంపై అధినేత వద్దే తేల్చుకుంటామని హెచ్చరించారు. కాగా, కుప్పం నియోజక వర్గంలో 89 పంచాయితీలుండగా, అందులో 74 చోట్ల వైసీపీ అభిమానులు, టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీల్లో, ఇతరులు ఒకచోట గెలుపొందారు.
ఈ ఫలితాలు చంద్రబాబును తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఎవరు చేసిన తప్పిదాలకు వారే బాధ్యత వహించకతప్పదనే రీతిలో చంద్రబాబు ఓటమిని ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ నుంచి ఇప్పటివరకు తన నియోజకవర్గం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. 35 ఏళ్లు రాజకీయ భవిష్యత్ కల్పించిన తాము కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకున్న పాపానపోలేదని నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో తగిన బుద్దిచెప్పారు. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఓడించి.. కర్రకాల్చి వాతపెట్టారు. బాబు గుండె కాయ అన్ని చెప్పుకునే గుడుపల్లె మండలంలో 13 పంచాయతీలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది.
రాజీనామాకు సిద్ధపడ్డ టీడీపీ ఇంచార్జ్..!
పార్టీ ఓటమికి మీరంటే మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు నేతలు విమర్శలకు దిగుతున్నారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పీఎస్ మునిరత్నంపై స్థానిక నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రామకుప్పంలో నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ సమావేశానికి వచ్చిన మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్‌లకు స్థానికంగా చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు నేతలపై కార్యకర్తలు తిరుగుబాటుబావుట ఎగురవేశారు. మీ ఇద్దరి తీరు వల్లే ఎన్నికల్లో ఓటమి చెందామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేసేందుకు మునిరత్నం సిద్ధపడ్డారు. నేతలు సముదాయించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రెండు.. మూడు రోజులు అక్కడే..
పార్టీ దుస్థితి, నాయకులు, కార్యకర్తల మధ్య విబేధాలను పరిష్కరించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో కుప్పంలో ఆయన పర్యటించనున్నారు. మూడు రోజులు పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనున్నారు.