iDreamPost
iDreamPost
లాక్ డౌన్ జరిగిన కాలంలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాబోతున్న మొదటి స్టార్ హీరో సినిమాగా వి మీద అంచనాలు మాములుగా లేవు. ప్రపంచవ్యాప్తంగా ఒకే టైం కాబట్టి మిడ్ నైట్ బదులు రేపు రాత్రి 9.30కే ఇండియాలో వరల్డ్ ప్రీమియర్ టెలికాస్ట్ కాబోతోందని సమాచారం. 200 దేశాల్లో ఒకేసారి అందుబాటులోకి రానున్న వి పట్ల స్పందన గురించిఅమెజాన్ ప్రైమ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఒక సౌత్ సినిమాకు ఎన్నడూ పెట్టనంత బడ్జెట్ ని హక్కుల రూపంలో ఇన్వెస్ట్ చేయడంతో ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తోంది. రేపు సాయంత్రం నుంచి వి టీమ్ ప్రత్యేకంగా ప్రేక్షకులతో లైవ్ వీడియో ఛాట్ చేయబోతోంది. వి పేరుతో ఓపెన్ చేసిన వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుంటేనే ఆ అవకాశం దక్కుతుంది.
మరోవైపు నాని, సుధీర్ బాబులు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వి కోసం ఎంత ప్రమోట్ చేయాలో అంతా చేస్తున్నారు. నేరుగా ఎవరినీ కలవడం లేదనే మాటేగాని ఆన్ లైన్ రూపంలో గట్టిగానే అందుబాటులో ఉన్నారు. స్ట్రీమింగ్ టైంని ప్రైమ్ అధికారికంగా ప్రకటించనప్పటికీ గత కొంత కాలంగా వచ్చిన హిందీ ప్రీమియర్ టైమింగ్స్ గమనిస్తే అవన్నీ ముందు రోజు రాత్రి 10.30 లోపే ఉండటంతో ఇదీ అదే తరహాలో వచ్చే అవకాశం ఉంది. హీరోయిన్ గా నివేదా థామస్ సుధీర్ బాబు సరసన నటిస్తుండగా అదితి రావు హైదరి లుక్ ని ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. తను నాని ప్రియురాలిగా ఫ్లాష్ బ్యాక్ కు పరిమితమవుతుందట. కాసేపే ఉన్నప్పటికీ కథలో సెంటర్ పాయింట్ తనమీదే ఉంటుందని తెలిసింది.
ఓటిటిలో రావడం అనేది థియేటర్ లాగా కొన్ని రోజులకు పరిమితమయ్యే వ్యవహారం కాదు కాబట్టి సినిమా కనక బాగుంటే మళ్ళీ మళ్ళీ చూసే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు. అందులోనూ టికెట్ కొనడాలు లాంటివి ఏమి లేవు కాబట్టి తాపీగా ఎవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు ఇంట్లోనే చూసేస్తారు. ప్రాధమిక అంచనా మేరకు మొదటి రోజే మిలియన్ల వ్యూస్ పోటెత్తడం ఖాయమని ఓటిటి విశ్లేషకుల అంచనా. అందులోనూ ఇది క్రైమ్ థ్రిల్లర్ కనక నార్త్ ఆడియన్స్ లోనూ సబ్ టైటిల్స్ సహాయంతో చూసేవాళ్ళు కూడా అధికంగా ఉంటారు. ఈ లెక్కన పాత రికార్డులన్నీ బద్దలయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటిదాకా మొదటి రోజు మాకిన్ని కోట్లు ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పుకునే నిర్మాతలు ఇకపై మాకిన్ని దేశాల్లో ఇన్ని వ్యూస్ వచ్చాయనే పబ్లిసిటీ చేసుకునే రోజులు వచ్చాయి. దానికి వి ఎలాంటి శ్రీకారం చుడుతుందో చూడాలి.