Idream media
Idream media
ఒక కథ అంటే చెప్పేవాడు, వినేవాడు ఇద్దరుంటారు. నీ స్నేహితుల మధ్యలో కథ చెబుతే అది నలుగురు వింటారు. పత్రికలో కథ రాస్తే మహా అయితే 1000 మంది చదువుతారు. ఒక సినిమా కథ చెబితే ఎంత చెత్త సినిమా అయినా కొన్ని వేల మంది చూస్తారు. హిట్ అయితే కొన్ని లక్షల మంది, సూపర్‌హిట్ అయితే కోట్ల మంది చూస్తారు.
ఒక కథకి ఇంత పెద్ద వేదిక ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఎంత బాధ్యతగా సినిమా తీయాలి? మరి ఆ పని చేస్తున్నామా? నానా చెత్త తీసి పడేస్తున్నాం.
జాంబిరెడ్డి అని ఒక సినిమా రెండు రోజుల క్రితం వచ్చింది. కథలో హారర్ , హారర్ కామెడీ ఒక జానర్. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా మనకి రిజిస్టర్ కాదు. Bad script కి ఇదో Example.
Good script కి Example ఏంటో తెలుసా? రామాయణ , మహాభారతం. రామాయణం జరిగిందా లేదా, రాముడు దేవుడా కాదా? అనే చర్చ ఇక్కడ అనవసరం. వాల్మీకి మహర్షి ప్రతి కారెక్టర్‌ని ఎంత అద్భుతంగా రిజిస్టర్ చేశాడు, ఇప్పటికీ రామాయణం తలచుకోగానే ఆయా వ్యక్తిత్వాలు కళ్ల ముందు నిలుస్తాయి.
తెల్లవారితే పట్టాభిషేకం, అయోధ్య సంబరాలతో ఉంది. కాసేపట్లో కిరీటం ధరించాల్సిన రాముడికి తండ్రి నుంచి పిలుపు. వనవాసం వెళ్లమని ఆజ్ఞ. మహారాణి కావలసిన సీతమ్మ నార చీరలతో అడవికి వెళుతుంది. ఈ సీన్‌లో ఉన్న ఎమోషన్ పాఠకున్ని, ప్రేక్షకున్ని కదిలిస్తుంది.
ముత్తులో హీరో రజనీకాంత్ కంటే , తండ్రి రజనీకాంతే బాగా గుర్తుంటాడు. ఎందుకంటే కొన్ని విలువల కోసం ఆయన కొడుకుని కూడా వదిలేసి , కట్టుబట్టలతో వెళ్లిపోతాడు. నరసింహలో తన బంగళాని వదిలేసి శివాజీగణేషన్ బయటికొస్తాడు. అలసటగా ఉంది కాసేపు కూచుంటానని స్తంభం నీడలో ప్రాణం విడుస్తాడు.
ఎమోషన్ ఆక్సిజన్ లాంటిది. అది లేకుండా మనుషులు జీవించలేరు. దూకుడు సినిమా హిట్ కావడానికి కామెడీ , ఫైట్స్ , పాటలు కాదు. అవి ఆగడులో కూడా ఉన్నాయి. ప్లాప్ ఎందుకైంది?
దూకుడులో ప్రకాశ్‌రాజ్, మహేష్‌ల మధ్య తండ్రీకొడుకుల ఎమోషన్ అద్భుతంగా పండింది. తండ్రి కోసం కొడుకు పడే తపన, ఎమోషన్స్‌ని తట్టి లేపింది.
ఎంచుకున్న కథ ఏ జానర్ అయినా కావచ్చు. ఎమోషన్ మిస్ అయితే దానికి లైఫ్ ఉండదు.
లారెల్ అండ్ హార్డీ , ఇద్దరూ అమెరికన్ కమెడియన్స్. మూకీల నుంచి టాకీల వరకూ ఉన్నారు. విపరీతంగా నవ్వించారు. ఇప్పుడెవరికీ గుర్తు లేరు. ఎందుకంటే వీళ్లు చేసింది జబర్దస్త్ లాంటి స్కిట్స్. నవ్వుకుని జనం మరిచిపోయారు.
చాప్లిన్ కూడా నవ్వించారు. సినిమా బతికున్నంత కాలం గుర్తుంటాడు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎమోషన్ ఉంది. ప్రతి క్యారెక్టర్ మనకి గుర్తుంటుంది. అలా రిజిస్టరై పోయాయి.
రచయితకి తాను చెబుతున్న కథలోని క్యారెక్టర్లు సమూలంగా తెలిసుండాలి. సినిమాలో అన్నీ చూపించకపోవచ్చు. కానీ అతని మెదడులో ఆ క్యారెక్టర్ స్వరూప స్వభావాలు తెలిసుండాలి. భారతీయుడిలో కూతురి సరదా కోసం 500 నోటుతో కాగితం పడవ చేసే కమల్‌హాసన్ , ఆ కూతురిని బతికించడం కోసం లంచం ఇవ్వడు. అది క్యారెక్టర్. ఆ లైన్ మీదే సినిమా మొత్తం నిలబడి ఉంటుంది.
వ్యవస్థలోని నిర్లక్ష్యానికి చెల్లెలు బలైపోతే , నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్లపై పగ తీర్చుకుంటాడు అపరిచితుడు హీరో. క్యారెక్టర్‌లో బలం లేకపోతే అది కేవలం థర్డ్ రేట్ క్రైం సినిమాగా మిగిలిపోయేది.
ఈ మధ్య ఎక్కడో చదివాను. మలయాళ రచయితలు, దర్శకులు కొచ్చిలో కాపురం ఉండరని, సినిమా ఉన్నప్పుడు అందరూ కలిసి టీం వర్క్ చేసి , మళ్లీ ఎవరి ఊళ్లకి వాళ్లు వెళ్లిపోతారని. మన తెలుగు వాళ్లు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దాటి వెళ్లరు. వెళితే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వెళతారు. కారు దిగరు. దూర ప్రయాణమైతే విమానం. సామాన్య జనం ఎలా ఉంటారో , ఏమి ఆలోచిస్తారో తెలియదు. క్యారెక్టర్లన్నీ మెదడులో పుడుతాయి. బయట పరిశీలిస్తే పుట్టినవి కావు. అందరూ కాదు కానీ, మెజార్టీ వీళ్లే! మలయాళం నుంచి కథలు కొనే దురవస్థ రమ్మంటే ఎందుకు రాదు?
తమాషా ఏమంటే పెట్టుబడిదారి వ్యవస్థకి ప్రతీక అయిన హాలీవుడ్ ఆరోగ్యంగా ఉంది. ఇక్కడ రచయితల పని రచయితలు చేస్తారు. దర్శకుడి పని దర్శకుడు చేస్తాడు. మన తెలుగులో రచయితల్ని లేకుండా అయినా చేసారు. లేదంటే రచయితలు డైరెక్టర్లుగా మారిపోయారు. ఎవరితోనైనా రాయించుకుంటే రచనా సహకారం చీమ తలకాయ అక్షరాలతో End titles లో వేస్తారు. ఒకవేళ బిగినింగ్ టైటిల్స్‌లో వేసినా మూడు సెకెండ్లు కూడా ఆ పేరు కనపడకుండా వేస్తారు. స్క్రీన్ పట్టక వదిలేస్తున్నారు కానీ, లేదంటే కథ, మాటలు, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం, ఎడిటింగ్, సంగీతం, ఫొటోగ్రఫీ, పాటలు అన్నీ కూడా డైరెక్టరే వేసేసుకుంటాడు. డైరెక్టర్‌కి Soul లేకపోతే సినిమాలో మాత్రం వస్తుందా?