iDreamPost
android-app
ios-app

సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 5

సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 5

ఒక ఫ్యాక్ట‌రీలో మెషిన్ చెడిపోయింది. పెద్ద‌పెద్ద ఇంజ‌నీర్ల వ‌ల్ల కూడా కాలేదు. చివ‌రికి ఒక రిటైర్డ్ మెకానిక్‌ని పిలిచారు. మెషిన్‌ని ప‌రిశీలించి ల‌క్ష రూపాయలు ఫీజు అడిగాడు. ప‌ని అత్య‌వ‌స‌రం కాబ‌ట్టి స‌రేన‌న్నారు. ఒక సుత్తితో గ‌ట్టిగా ఒక బోల్ట్‌ని బాదాడు. మెషిన్ స్టార్ట్ అయింది.

“సుత్తితో ఒక దెబ్బ కొట్టినందుకు ల‌క్ష రూపాయ‌లా?” అని అడిగారు.

“దెబ్బ కొట్టినందుకు కాదు ఎక్క‌డ కొట్టాలో తెలిసినందుకు” అన్నాడు మెకానిక్‌.

రాజ‌మౌళికి ప్రేక్ష‌కుల్ని ఎక్క‌డ కొట్టాలో తెలుసు. చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్న జాన‌ప‌ద క‌థ నే కొత్త‌గా చెప్పాడు. చిన్న‌ప్పుడు త‌ల్లితండ్రుల నుంచి విడిపోయే సినిమాలు NTR క‌నీసం 50 తీసుంటాడు. ఈగ కొత్త క‌థ‌, బాహుబ‌లి పాత క‌థ‌.

క‌థ‌ని ఎంత చెప్పాలో , ఎక్క‌డ ఆపాలో తెలిసిన వాడు. క‌థ‌లు ఎక్క‌డి నుంచి వ‌స్తాయి? అన్ని దేశాల సినిమాలు చూస్తూ ఉంటే అవే పుడతాయి. ఇపుడు చాలా మంది చేస్తున్న‌దే. హాలీవుడ్ అయితే సుల‌భంగా తెలిసిపోతాయ‌ని కొంత కాలం కొరియ‌న్ సినిమాల‌పైన ఆధార‌ప‌డ్డారు. స‌బ్‌టైటిల్స్ లేకుండా కూడా అర్థ‌మ‌య్యేంత‌లా చూసేశారు.

Inspiration, Imitation త‌ప్పే కాద‌ని అరిస్టాటిల్ అన్నాడు. క‌థ‌లో 3 Act Structure ఉండాల‌ని Poetics book లో రాసాడు. 335 B.Cలోనే చెప్పాడు. తేనెటీగ‌లు ర‌క‌ర‌కాల పువ్వుల నుంచి మ‌క‌రందాన్ని తీసుకుని తేనెను చేస్తాయి. ఆ తేనెకి ప్ర‌త్యేక‌మైన రుచి, వాస‌న ఉంటుంది. పువ్వుని క‌నిపెట్ట‌లేం.

ప్రేర‌ణ‌, అనుక‌ర‌ణ ఆ ర‌కంగా ఉండాలి. బాహుబ‌లిలో కూడా చాలా సీన్స్ సేక‌రించిన‌వే. త‌ల మీద కాలు పెట్టుకునే సీన్‌ చెంఘిజ్‌ఖాన్‌లోది. శివ‌లింగాన్ని మోసే సీన్ శాంస‌న్ అండ్ డిలైలాలో ఉంది. దాంట్లో శాంస‌న్ పెద్ద‌లోహ‌పు కూజాని మోస్తాడు.

మున్నాబాయ్ MBBS కూడా తేనెలాంటిదే. Patch Adams (1998) నుంచి కొంత‌, A stich In Time (1963)లో కొంత. దారం దొరికే స‌రికి పువ్వులు అల్లుకుంటూ పోయారు. జ‌నం మెచ్చి మాల వేశారు.

Patch Adams ఆత్మ‌హ‌త్య‌కి ప్ర‌య‌త్నించి 3సార్లు ఆస్ప‌త్రిపాల‌య్యాడు. త‌ర్వాత మెడిక‌ల్ సిస్ట‌మ్‌లో ఉన్న లోపాల‌పై తిర‌గ‌బ‌డ్డాడు. ఆయ‌న జీవిత చ‌రిత్ర‌నే సినిమాగా తీశారు.

నార్మ‌న్ విజ్‌డం బ్రిటీష్ క‌మెడియ‌న్‌. అత్యంత పేద‌రికంలో పెరిగాడు.

13 ఏళ్ల వ‌య‌సుకే నానా చాకిరీ చేశాడు. కిరాణాకొట్టు, హోట‌ల్, కాసింత తిండి కోసం ప‌గ‌లూరాత్రి చేశాడు. మిల్ట‌రీలో డ్ర‌మ్మ‌ర్ బాయ్‌గా చేరాడు. 1930లో ల‌క్నో వీధుల్లో మిల్ట‌రీ బ్యాండ్ వాయించాడు. త‌ర్వాత బాక్సింగ్ చాంపియ‌న్‌గా మారాడు.

త‌న‌లో న‌వ్వించే ల‌క్ష‌ణం ఉంద‌ని గ్ర‌హించి న‌టుడిగా మారాడు. జ‌నాల్ని ఎంత‌గా న‌వ్వించాడంటే చార్లీ చాప్లిన్ అంత‌టి వాడు ఇష్ట‌ప‌డేంత. మ‌న హాస్య‌న‌టుడు ప‌ద్మ‌నాభం కొంత కాలం విజ్‌డంని అనుక‌రించాడు. A stich In Timeలో తాను డాక్ట‌ర్‌న‌ని ఆస్ప‌త్రిలోకి వెళ్లి కామెడీ సృష్టిస్తూ ఉంటాడు. విమాన ప్ర‌మాదంలో అమ్మానాన్న‌ల్ని పోగొట్టుకుని చ‌ల‌నం లేకుండా ఉన్న చిన్న‌పాప‌ని త‌న కామెడీతో మామూలు మ‌నిషిని చేస్తాడు. మున్నాబాయ్‌లో పెద్ద పేషెంట్‌గా మారాడు. విచిత్రంగా శంక‌ర్‌దాదాలో ఈ క్యారెక్టర్ పిల్ల‌వాడిగా ఉంటాడు.

రాజ్‌కుమార్ హిరానీ ఎంత ప్ర‌జ్ఞావంతుడంటే త‌న‌కి ప్రేర‌ణ క‌లిగించిన సినిమాల నీడ క‌న‌ప‌డ‌కుండా చేశాడు. క‌థ‌ని ఎక్క‌డి నుంచైనా తీసుకోవ‌చ్చు. అయితే నేటివిటీ మిస్ అయితే అస‌లుకే మోసం.

క‌థ జీవం లాంటిది. అది ఉంటే అన్ని అలంకారాలు సొగ‌సుని ఇస్తాయి. అది లేక‌పోతే శ‌వానికి ఆభ‌ర‌ణాలు వేసిన‌ట్టే. స్క్రీన్ మీద బోర్ స్టార్ట్ అవుతుంది. బాహుబ‌లితో ప్ర‌భాస్‌కి వ‌చ్చిన హైప్ అంతాఇంతా కాదు. సాహో ఒక రేంజ్‌లో ఆడాల్సిన సినిమా కానీ , క‌థ లేదు. అస‌లు ప్ర‌భాస్ ఎవ‌రు? అత‌ని ల‌క్ష్యం ఏంటో తెలిసే స‌రికి జ‌నం విసిగిపోయారు.

అద్భుత‌మైన చికెన్ బిర్యాని వ‌డ్డిస్తామ‌ని అర‌బ్ దేశాల నుంచి మ‌సాలాలు తెప్పించారు, మెక్సికో నుంచి బాస్మ‌తి బియ్యం, ట‌ర్కీ నుంచి కోళ్లు, ఇరాన్ నుంచి వంట‌వాళ్లు. జ‌నం ఆవురావుర‌మ‌ని ఎదురు చూశారు. బిర్యానీ వ‌డ్డించారు కానీ, చికెన్ వేయ‌డం మ‌రిచిపోయారు. ఈ మ‌ధ్య కాలంలో ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా నిరాశ‌ప‌రిచిన సినిమా ఇది.

డాన్‌ల క‌థ మ‌న వాళ్ల‌కి స‌రిగా అర్థం కాలేదని ప్ర‌భాస్ అభిమానులు కొంత స‌ర్దిచెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. God Father కూడా డాన్ క‌థే. ఫ‌స్ట్ సీన్‌లోనే డాన్ క్యారెక్ట‌ర్ అర్థ‌మ‌వుతుంది. ర‌చ‌యిత మేరియోపూజో గొప్ప‌త‌నం అది. ముగ్గురు స్క్రీన్ ప్లే ర‌చ‌యిత‌ల్లో ఆయ‌న ఒక‌రు. క‌థ‌ని ఒక కావ్యంలా చూపించాడు ద‌ర్శ‌కుడు కొప్పోలా.

God Father ప్ర‌భావానికి లోనుకాని ద‌ర్శ‌కులు త‌క్కువ మంది. రాంగోపాల్‌వ‌ర్మ అయితే ఒక జిరాక్స్ మిష‌నే పెట్టుకున్నాడు. మ‌ణిర‌త్నం కూడా నాయ‌కుడు, ఘ‌ర్ష‌ణ (క్లైమాక్స్‌)లో చాలా సీన్స్ వాడేశాడు.

క‌థ‌లు రెండు ర‌కాలు. ఈ ప్ర‌పంచంలో జ‌రిగేవి, ఎక్క‌డా జ‌ర‌గ‌నివి. వీటినే ఫాంట‌సీలు అంటారు.

నిజానికి సినిమానే ఒక ఫాంట‌సీ, మాంత్రిక శ‌క్తి.

క‌థ ఒక మంత్ర దండం.